Maharashtra Navnirman Sena
-
ఎమ్మెన్నెస్ ‘పట్టాలు తప్పింది’
అసెంబ్లీ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడింది. మహా వికాస్ ఆఘాడి, మహాయుతి కూటములకు చెందిన వెన్నుపోటుదార్లకు (గద్దార్లకు) ఓటు వేయవద్దని, ఒకసారి తమ పార్టీకి అవకాశమిచ్చి చూడాలని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగ్గా, శనివారం ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర రాజకీయరంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న ఎమ్మెన్నెస్ చీఫ్ ఆశలు అడియాశలయ్యాయి. పార్టీ తరపున ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోగా మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన తన తనయుడు అమిత్ ఠాక్రేను కూడా గెలిపించుకోలేకపోయారు. దీంతో రాజ్ వైఖరి,ఆయన తనయుడు అమిత్ ఓటమిపై సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ గుర్తు రద్దయ్యే అవకాశం... దాదాపు 18 ఏళ్ల కిందట హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలవడంతో రాజ్ ఠాక్రే పరువు, పార్టీ ప్రతిష్ట నిలబడ్డాయి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజు పాటిల్ కూడా ఓటమిపాలయ్యారు.ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిగా పేరుగాంచిన బాలా నాంద్‌గావ్కర్ శివ్డీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాంద్‌గావ్కర్ గెలుపు కోసం ప్రచారం ముగింపు చివరి రోజున అంటే గత సోమవారం శివ్డీలో ప్రత్యేకంగా ఓ సభ కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెన్నెస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అంతేగాకుండా ఈ ఎన్నికల్లో కనీసమాత్రం ఓట్లు కూడా రాకపోవడంతో పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశముందని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తును రద్దుచేసే అవకాశం కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాటలకు ఓట్లు రాలవని... రాజ్ ఠాక్రే ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ఇసుకవేస్తే రాలనంతమంది ప్రజలు ఆ సభలకు హాజరవుతారు. ఆయన మాటతీరు, ప్రముఖ రాజకీయ నాయకుల మాటలను అనుకరించే (మిమిక్రీ) విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో రాజ్ ప్రసంగం వినేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. అయితే మాటలకు ఓట్లు రాలవని ప్రతి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌కు రుజువవుతూనే ఉంది. ఫలితంగా ఓటింగ్ శాతం నెమ్మదిగా దిగజారుతూ వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా అధికసంఖ్యలో సీట్లను చేజిక్కించుకోవాలని భావించిన రాజ్‌ఠాక్రే గెలిచే అవకాశాలున్నాయని భావించిన 128 స్ధానాల్లో తమ అభ్యర్ధులను పోటీలో నిలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్ధులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.చదవండి: మహారాష్ట్రలో సకుటుంబ సపరివార రాజకీయంఅధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ తరపున గతంలో చేపట్టిన అనేక ఆందోళనల గురించి ప్రతీ సభలో వివరించారు. వీటినే ప్రధాన ప్రచార ఆ్రస్తాలుగా మలచుకున్నారు. టోల్ మాఫీ, రైల్వే ఉద్యోగాల భర్తీలో భూమిపుత్రులకు జరిగిన అన్యాయం, మసీదుల వద్దనున్న లౌడ్స్పీకర్లలోంచి పెద్ద శబ్దంతో వినిపించే నమాజ్‌కు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా వినిపించాలన్న ఆందోళన.. ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని తన ప్రసంగాల్లో వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఇలా అనేక హామీలిచ్చారు. కాని అవేమి ఓటర్లకు రుచించలేదని శనివారం వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమైంది. -
మహారాష్ట్రలో మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్‌కు చెక్ పెట్టేందుకు పావులు
సాక్షి ముంబై: శివాజీపార్క్ సాక్షిగా మరో మహాకూటమి అవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) దీపావళిని పురస్కరించుకుని శివాజీపార్క్‌లో శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శిందే వర్గం, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాజ్ ఠాక్రే కూడా వారి ఇంటికి వెళ్లి గణేశుడిని దర్శించుకోవడం ఆ సందర్భంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాబోయే రాష్ట్రంలో కొత్తగా మహాకూటమికి శివాజీపార్క్‌లో బీజం పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయగా మరోవైపు బీజేపీ మద్దతులో ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన ఉత్పాతం సంభవించదని చెప్పొచ్చు. అనంతరం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ, చిహ్నాన్ని రెండింటినీ తాత్కాలికంగా సీజ్ చేయడం ఆ తర్వాత ఉద్దవ్‌ఠాక్రేకు శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పారీ్టగా, ఏక్నాథ్ శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన పార్టీగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మండుతున్న కాగడా (మశాల్), శిందే వర్గానికి కత్తులు డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే పోటీ పడనున్నాయి. అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, శిందే వర్గం నేతలు రాజ్ ఠాక్రేతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: బెంగాల్‌ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్ ఈ విషయంపై పలుమార్లు బీజేపీ నాయకులు కూడా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఎమ్మెన్నెస్ దీపోత్సవానికి హాజరుకావడంతో పలు రకాల చర్చలకు ఊతం వచ్చేలా చేసింది. ముఖ్యంగా శివాజీపార్క్‌లో జరిగిన ఎమ్మెన్నెస్ దీపోత్సవ కార్యక్రమంలో శిందే, బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మహాకూటమికి బీజం పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. ఎప్పట్నుంచో కలవాలనుకున్నాను:సీఎం ఏక్నాథ్ శిందే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఎప్పట్నుంచో కలవాలని ఉన్నప్పటికీ రాజకీయాల్లో తీరికలేని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు కలవలేకపోయానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. ముఖ్యంగా గత పదేళ్లుగా ఎమ్మెన్నెస్ దీపోత్సవాలను నిర్వహిస్తోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అనేక నిర్బంధాలున్నాయి. అయితే ఈసారి మాత్రం మహమ్మారి తగ్గిపోవడంతో గణేశ్ ఉత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలతోపాటు దీపావళి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గతంలో మనసులో కలవాలన్న కోరిక ఉన్నప్పటికీ కలువలేకపోయాను. కానీ ఇప్పుడు దీపోత్సవం సందర్భంగా ఇలా కలిసేందుకు అవకాశం లభించిందన్నారు. -
సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం
సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్‌శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్‌పై తప్పుడు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. మైండ్‌ను సెట్ చేసుకోవాలి పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్‌ను సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. వాడివేడిగా రాజకీయ వాతావరణం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్‌గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!) -
కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్‌ఠాక్రే స్పందన
సాక్షి, ముంబై: నాటకీయ పరిణామాల మధ్య శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ విషయాన్ని భాగోద్వేగంతో బుధవారం రాత్రి ప్రకటించారు. దీనిపై ఇటు మహావికాస్ ఆఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు, సొంత పార్టీ శివసేన నాయకులు, సంజయ్ రావుత్, ఇతర పార్టీల పదాధికారుల నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. కానీ ఉద్ధవ్ సోదరుడు, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి రాజ్ ఠాక్రే నుంచి ఉద్ధవ్‌ను ఓదార్చడం, బాధ, ఆవేదన, సానుభూతిలాంటి ఎలాంటి స్పందనలు రాలేదు. ఒకవేళ రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరకు ఉద్ధవ్ రాజీనామా చేసిన 15 గంటల తరువాత అంటే.. గురువారం ఉదయం ఎట్టకేలకు రాజ్ ట్విటర్లో స్పందించారు. అందులో ఉద్దవ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కాని పరోక్షంగా వ్యాఖ్యలు మాత్రం ఆయనపై చేశారు. ‘ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, అధికారం చేతిలో ఉంది కదాని విర్రవీగితే పరిస్ధితులు ఇలాగే ఉంటాయి’ అని చురకలంటించారు. మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగించాలని అప్పట్లో రాజ్ చేసిన ప్రకటన చర్చల్లోకి వచ్చింది. చదవండి: నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న లౌడ్స్పీకర్లను తొలగించాలని ఆందోళన చేస్తున్న, మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా వినిపిస్తున్న ఎమ్మెన్నెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాజ్ ఠాక్రే ఆఘాడి ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు ఒక లేఖ రాశారు. అందులో నేను మీకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దు, అధికారం ఇవ్వాళ ఉంటుంది. రేపు పోతుంది. అధికారాన్ని పుట్టుకతోనే అమ్మ కడుపులోంచి ఎవరు తెచ్చుకోలేదు. ఉద్ధవ్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు నెలన్నర కిందట రాసిన ఆ లేఖను గురువారం మళ్లీ ట్విటర్లో పెట్టారు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
‘ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు..ఇంట్లో పొయ్యి వెలిగించే సిద్ధాంతం’
సాక్షి, ముంబై: ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు సృష్టించి ఇళ్లకు నిప్పంటించే హిందుత్వం తమది కాదని, ఇంట్లో పొయ్యి వెలిగించే హిందుత్వమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ముంబైలోని బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ) మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రతిపక్ష బీజేపీ నేతల వ్యవహార శైలి, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు, లౌడ్స్పీకర్లు, హనుమాన్ చాలీసా పఠనంపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలకు, ఆరోపణలకు సభ ద్వారా ఒకేసారి ధీటుగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ, కాశ్మీర్లో పండితులను హతమారుస్తున్నారు. అక్కడ వారికి భద్రతలేదు. కానీ ఇక్కడ ఊరికే తిరుగుతూ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసే వారికి మాత్రం కేంద్రం వై–ప్లస్ భద్రతా ఎలా కల్పిస్తుందని రాజ్ ఠాక్రే పేరు ఉచ్ఛరించకుండా పరోక్షంగా ప్రశ్నించారు. కాషాయ రంగు క్యాప్ (టోపీ)లు ధరించిన వారిని హిందూత్వవాదులంటున్నారు. మరి ఆర్ఎస్ఎస్ క్యాప్‌ల రంగు నల్లగా ఎలా ఉంటుందని నిలదీశారు. బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో శివసేన ఎక్కడుందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి పాత వీడియోలు చూడాలని హితవు పలికారు. బాబ్రీ మసీదు కూల్చడానికి దేవేంద్ర ఫడ్నవీస్ పైకెక్కే ప్రయత్నం చేస్తే ఆయన బరువుకే అదే కూలుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మేం ఓపిక, సంయమనం పాటిస్తున్నామంటే అసమర్ధులమని దాని అర్ధం కాదు... మా జోలికి వస్తే దయా దాక్షిణ్యం చూపించకుండా వచ్చిన దారిలోనే పరుగెత్తిస్తామని సీఎం హెచ్చరించారు. మా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు.. మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని కొద్ది నెలలుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, కానీ మా ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొనసాగుతుందని, మరో 20 ఏళ్ల వరకు మహావికాస్ ఆఘాడి ప్రభుత్వమే రాష్ట్రాన్ని ఏలుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా గడ్డుకాలంలో సైతం పేదలకు ఉచితంగా ‘శివ్ భోజన్’ థాలి (రైస్ ప్లేట్) అందించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆ పథకం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి ప్రయత్నం ఏ రాష్ట్ర పభుత్వం చేయలేదని గుర్తు చేశారు. వెనకాముందు ఆలోచించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం సభ జరుగుతున్న స్ధలంలో అంటే బీకేసీ మైదానంలో బుల్లెట్ ట్రైన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్–ముంబై మధ్య నడిపే ప్రతిపాదన సిద్ధమైతోంది. ఈ బుల్లెట్ ట్రైన్ ఎవరికి కావాలి? ఇది ముంబైని విడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఉద్ధవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సభా వేదికపై పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్ రావుత్, ఏక్నాథ్ షిందే, సుభాష్ దేశాయ్, అరవింద్ సావంత్, లీలాధర్ ఢాకే, అనీల్ పరబ్, వినాయక్ రావుత్, గులాబ్రావ్ పాటిల్, పలువురు ఎంపీలు, మంత్రులు ఉన్నారు. కాగా, మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బహిరంగ సభ జరగడం ఇదే ప్రథమం. దీంతో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. కొన్ని ఎకరాల బీకేసీ మైదానమంతా అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. పార్కింగ్ స్థలంలో చోటు లభించకపోవడంతో రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. సభ పూర్తిగా విజయవంతం కావడంతో శివసేన కార్యకర్తలు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ముంబైని మహారాష్ట్ర నుంచి విడదీసే కుట్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలను బట్టి దేశ ఆర్థిక రాజధాని ముంబైని రాష్ట్రం నుంచి విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోందని, కానీ వారి ప్రయత్నాలను తిప్పి కొట్టనిదే రాష్ట్ర ప్రజలు, శివసైనికులు ప్రశాంతంగా ఉండరని హెచ్చరించారు. రాజ్ ఠాక్రేను మున్నాబాయి ఎంబీబీఎస్ చిత్రంలో సంజయ్ దత్తో ఆయన పోల్చారు. రాజ్ ఠాక్రే మున్నాబాయి లాంటి వాడని, ఆయన మెదడులో కెమికల్ సమస్య రావడంవల్లే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడని పేరు ఉచ్ఛరించకుండా ఆరోపించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు మిత్రపక్షాలుగా ఉన్న ఇరు పార్టీలు విడిపోయాయి. అక్టోబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఉద్ధవ్ వివరించారు. తెల్లవారుజామున ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసిందో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ‘మీరు చేస్తే తప్పు లేదు. మేం చేస్తే మోసమా’ అంటూ అన్ని పార్టీలను నిలదీశారు. మీలాగా మేం గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ప్రమాణ స్వీకారం చేయలేదని, బహిరంగంగా అందరి సమక్షంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేశామని ఉద్ధవ్ గుర్తు చేశారు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే నేడు బీజేపీ–ఎన్సీపీ చెట్టాపట్టాలేసుకుని రాష్ట్రాన్ని ఏలేవారని దుయ్యబట్టారు. అధికారం లేకపోయేసరికి బీజేపీ నేతలు మతితప్పి ఇష్టమున్నట్లు ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తామెన్నడూ అలా వ్యవహరించలేదన్నారు. అలా వ్యవహరించడం శివసేన సంస్కృతి కాదని, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా ప్రవర్తించడం నేర్పలేదని స్పష్టం చేశారు. శివాజీ ఏలిన మహారాష్ట్ర ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని అన్నారు. బీజేపీ వ్యతిరేకులపై కేంద్రం ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోంది. ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం వెనుకపడ్డారు. ఒకవేళ దావుద్ బీజేపీలో చేరితే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు వెనకాడరని ఆయన ధ్వజమెత్తారు. హిందూత్వాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను రెచ్చగొడుతున్న నాయకుల ముసుగులను తొలగిస్తామని హెచ్చిరించారు. -
అరే చూస్తావేంటి చేరిపో!
సాక్షి, ముంబై: తరుచూ పరాజయాలతో కుంగిపోతున్న రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ సభ్యత్వ నమోదుకు కొత్త నినాదం అందుకుంది. ‘అరె బగ్తాయ్ కాయ్ సామీల్ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త నినాదంతో ముందుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 9తో ఎమ్మెన్నెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరా లు పూర్తయింది. ఈ సుదీర్గ కాలంలో, అనేక రాజకీయ పరిణామాలతో పార్టీ ఇంతవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా చేపడుతున్న ఈ కార్యక్ర మానికి సోషల్ మీడియాలో యువతను ఆకుట్టకునే విధంగా ప్రకటన ఇచ్చింది అందులో ‘అరె బగ్తాయ్ కాయ్ సామీల్ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త పంథాతో ఎన్నికల ముందుకు వెళ్లనున్నారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు.. పుణే, నాసిక్, ఔరంగాబాద్, కల్యాణ్–డోంబివలి, మీరా–భాయందర్ కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలను రాజ్‌ఠాక్రే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కోల్పోయిన పార్టీ పూర్వ వైభవాన్ని మళ్లీ తెచ్చేందుకు ఎంతో కృషి, పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే ఆయన ఈ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. ఆ కార్పొరేషన్ల పరిధిలోని సంబంధిత పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. అక్కడి రాజకీయ వాతావరణం, ఏ పార్టీకి ఎక్కువ పట్టు ఉంది...? తమ పార్టీకి అవకాశాలెలా ఉన్నాయి...? ఎన్నికలు జరిగితే ఫలితాలెలా ఉంటాయి...? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు సభ్యత్వ నమోదు పథకానికి శ్రీకారం చుట్టారు. అందుకు సోషల్ మీడియా ద్వారా ప్రకటనలిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా నియోజకవర్గాల ప్రజల వరకు చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో సోషల్ మీడియా సాయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెన్నెస్‌లో సభ్యత్వం ఎలా తీసుకోవాలో అందులో వివరాలు పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని తమ పార్టీ కార్యకర్తలుగా చేర్చుకోవాలనే ప్రయత్నం చేయనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, పని చేస్తున్న ప్రముఖులను కూడా ఇందులో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే నెల 24వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఇదిలాఉండగా ఏటా పార్టీ అవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించే రాజ్‌ఠాక్రే ఈ సారి రద్దు చేశారు. సభలో పార్టీ పదాధికారులకు, కార్యకర్తలకు వివిధ అంశాలపై మార్గదర్శనం, పార్టీ దిశనిర్ధేశం చేస్తారు. కానీ, ఈ సారి కరోనా వైరస్ కారణంగా పార్టీ అవిర్భావ వేడుకలు నిర్వహించలేదు. అందుకు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల చెంతకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో ఘనంగా.. అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్ ఠాక్రే చేస్తున్నారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: ఊపిరి ఉన్నంతవరకు బీజేపీపై పోరు హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర హెచ్చరికలు -
ఈడీ ముందుకు ఠాక్రే, ముంబైలో టెన్షన్
సాక్షి, ముంబై: కోహినూర్ మిల్లు భూమి కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) రాజ్ ఠాక్రే గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. దాదర్‌లోని కోహినూర్ మిల్లు భూ లావాదేవీలపై ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ ఎదుట రాజ్ ఠాక్రే హాజరైన నేపథ్యంలో దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వెలుపల 144 సెక్షన్ విధించారు. ఎమ్మెన్నెస్ కార్యకర్తల కదిలికలను గుర్తించి, అదుపు చేసేందుకు ముంబై నగరంలోని 12 జోన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండేతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారిన్ డ్రైవ్, ఎంఆర్ఏ మార్గ్, దాదర్, ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ 144 సెక్షన్ విధించారు. రాజ్ ఠాక్రే నివాసం వద్ద కూడా పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. శాంతి, భద్రతలకు విఘాతం కల్గిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సంయమనం పాటించాలని, అందరూ శాంతంగా ఉండాలని ఇదివరకే రాజ్‌ఠాక్రే తన అనుచరులకు సూచించారు. ‘మా నాయకుడి ఆదేశాలకు కట్టుబడి సంయమనం పాటిస్తున్నాం. ఆయన చెప్పకపోయినా సహనంగా ఉండాలని అనుకున్నాం. మమ్మల్ని అదుపులోని తీసుకుని ప్రభుత్వం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది’ అని సంతోష్ ధుని అనే నాయకుడు ఆరోపించారు. కోహినూర్ మిల్లు భూ అక్రమాల కేసులో రాజ్‌ఠాక్రే వ్యాపార భాగస్వాములు ఉమేశ్ జోషి, రాజేంద్ర శిరోద్కర్‌లను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణలో ఒరిగేదేమీ లేదు: ఉద్ధవ్ కోహినూర్ మిల్లు భూమి కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ ఠాక్రేకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పరోక్ష మద్దతు ప్రకటించారు. రాజ్‌ఠాక్రేను ఈడీ ప్రశ్నించినా ఒరిగేదేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన ద్వంద్వ వైఖరి పాటిస్తోందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. -
ఢంకా బజాయిస్తున్న రాజ్‌ఠాక్రే
ఆయన లోక్‌సభ బరిలో లేరు ఆయన పార్టీ కూడా ఎన్నికలకి దూరంగా ఉంది. అయినా ఆయన ప్రచార సభలకి జనం వెల్లువెత్తుతున్నారు. ఒక్కో మాట తూటాలా పేలుతుంటే ఈలలు, చప్పట్లతో సభలు మార్మోగిపోతున్నాయి. ఆయన లక్ష్యం ఒక్కటే. ప్రధానమంత్రి మోదీ మళ్లీ అధికారం చేపట్టకూడదు. ఒకప్పుడు మోదీకి వీరభక్తుడే. కానీ ఇప్పుడు శత్రువు. తన సరికొత్త ప్రచారంతో రాత్రికి రాత్రి మోదీకి పక్కలో బల్లెంలా మారారు. ఆయనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌ఠాక్రే. ఆయన చేస్తున్న ప్రచారం ఎలా ఉంది ? దాని ప్రభావం ఎంత ? అది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా లో హరిశాల్ అనే గ్రామం. అక్కడ ఓ భారీ ఎన్నికల బహిరంగ సభ జరుగుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. తమ ప్రియ తమ నాయకుడు ఏం చెబుతారా అన్న ఆసక్తి అక్కడికొచ్చిన వారందరిలోనూ కనిపిస్తోంది. అప్పుడు వేదిక మీదకి వచ్చా రు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే. అప్పటికే ఆయన వెనకాలే భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంది. రాజ్‌ఠాక్రే వచ్చిన వెంటనే తన అనుచరుడిని ఉద్దేశించి ‘యే.. లగావోరే వీడియో’ (ఏయ్.. ఆ వీడియో ప్లే చెయ్యి) అని ఆదేశించగానే దానిని ప్లే చేస్తారు. ఆ తెర పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షమవుతారు. గత అయిదేళ్లలో ఆయన ఇచ్చిన హామీలు, ప్రకటిం చిన పథకాలు, పేపర్ క్లిప్పింగులు, అవి ఎంత విజయవంతమయ్యాయో స్వయంగా మోదీ చెప్పిన మాటలు, అన్నీ ఒక్కొక్కటికిగా వస్తూ ఉంటాయి. క్రమంగా వీడియో ఆగిపోతుంది. రాజ్‌ఠాక్రే మైక్ అందుకుంటారు. అప్పుడు మొదలవుతుంది ఆయన ప్రసంగం. సూటిగా సుత్తి లేకుండా . సింపుల్‌గా చెప్పాలంటే అది ప్రసంగం కాదు. అదొక రియాల్టీ చెక్. మోదీ చెప్పిన మాటల్లో నిజానిజాలెంతో సాక్ష్యాధారాలతో సహా చెప్పే ప్రయత్నం. మోదీ చెప్పిన ప్రతీ మాటకి రాజ్ ఠాక్రే నుంచి కౌంటర్ తూటాలా పేలుతుంది. మోదీ ఇచ్చిన హామీలు ఎలా గాల్లో కలిసిపోయాయో, మోదీ, షా ద్వయం ఎన్ని అబద్ధాలు చెప్పారో, ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారో గణాంకాలతో సహా వివరిస్తారు. 51 ఏళ్ల వయసులోనూ రాజ్ ఠాక్రే తన ప్రసంగాలతో జనంపై సమ్మోహనాస్త్రం వేస్తున్నారు. ప్రచారంలో నవపథం మహారాష్ట్రలో హరిశాల్ను మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మొదట ఆ వీడియోలో ప్రభుత్వం చేసిన ప్రకటన వస్తుంది. ఆ తర్వాత ఆ గ్రామంలో కరెంట్ లేక జనం పడుతున్న అవస్థలు, ఇంటర్నెట్ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆ వీడియోలోనే చూపించారు. అంతేకాదు ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కూడా స్టేజ్ మీదకి తీసుకువచ్చారు. తమ గ్రామంలో అసలు పరిస్థితి ఎలా ఉందో ఆయన నోటివెంటే చెప్పించారు. ఇదంతా చూశాక కూడా మోదీకి ఓటు వెయ్యాలని మీరు భావిస్తున్నారా అని జనాన్ని సూటిగా ప్రశ్నిం చారు. మరాఠీ భాషలో చమత్కారాలని ఉపయోగిస్తూ మోదీపై వ్యంగ్యబాణాలు విసురుతారు. అవన్నీ జనం గుండెల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయి. ముంబై, సోలాపూర్, లాతూర్, సతారా, పుణె ఇలా మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సరికొత్త ప్రచారంతో కొన్నేళ్లుగా నిస్తేజంగా ఉన్న రాజ్‌ఠాక్రే, ఆయన పార్టీ ఎంఎన్ఎస్కి మళ్లీ కొత్త జీవం వచ్చినట్టయింది. ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టగలరా ? రాజ్‌ఠాక్రే రూపొందించిన ఒక వీడియో క్లిప్‌కి వచ్చిన ప్రతిస్పందన చూసి కాషాయ శిబిరంలో కలవరం రేగుతోంది. తమకి అసలు సిసలు ప్రత్యర్థి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమా ? లేదంటే రాజ్ ఠాక్రేయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరిశాల్ గ్రామంలో ఒక్క వారంలో 8 లక్షల 50వేలు టాయిలెట్లు నిర్మించామని మోదీ చెప్పిన విజువల్ బైట్ మొదట ప్లే అవుతుంది. దానికి గణాంకాలని హాస్యాన్ని కలగలిపి తిప్పి కొట్టారు రాజ్ ఠాక్రే. మోదీ అరచేతిలో ఎలా స్వర్గం చూపిస్తున్నారో సోదాహరణంగా చెబుతున్నారు. ‘‘ఒక్క వారంలో 8.50 లక్షల టాయిలెట్లు అంటే, ఒక నిమిషానికి 84 టాయిలెట్లు కట్టాలి. అంటే ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టారన్న మాట. ఇదెలా సాధ్యం అంటూ జనం చప్పట్ల మధ్య ప్రసంగాన్ని ముగించారు. ఈ ప్రచారం ప్రభావం ఎంత ? మహారాష్ట్ర మీడియా రాజ్ సభలకి అద్భుతమైన కవరేజ్ ఇస్తోంది. అదే సమయంలో మోదీ సభ లైవ్ వస్తున్నా కట్ చేసి మరీ రాజ్‌ఠాక్రే సభనే చూపిస్తున్నారంటే ఆయన చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం ఎంతలా జనంలోకి చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. జనానికి అర్థమయ్యేలా వీడియోలు రూపొందించడం చూసి ఆశ్చర్యపోయిన ఒక జర్నలిస్టు రాజ్‌ఠాక్రేతో మాట్లాడినప్పుడు మీడియా తాను చేయాల్సిన పని చేయకపోవడంతో తానే స్వయంగా ఈ తరహా ప్రచారానికి దిగానని సమాధానం ఇవ్వడం విశేషం. అయితే రాజ్ చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఓట్లు వేసినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన పెద నాన్న, మరాఠీ టైగర్ బాల్‌ఠాక్రే తనని శివసేనకు వారసుడిగా ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్న రాజ్‌ఠాక్రే అవి అడియాసలు కావడంతో 2006లో పార్టీకి గుడ్‌బై కొట్టేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొత్త పార్టీ పెట్టాక రాజ్‌ఠాక్రే చేసే రెచ్చగొట్టే ప్రసంగాలకు జనం మంత్రముగ్ధులయ్యారే తప్ప ఆయనకు ఓట్లు మాత్రం రాలలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు సాధించిన ఎంఎన్ఎస్ 2014 అసెంబ్లీ ఒక్క సీటుకే పరిమితమైపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేస్తే 5శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు కూడా రాలేదు. రాజ్‌ఠాక్రే జనాకర్షక నాయకుడే కానీ ఓట్లు రాబట్టే నాయకుడు కాదన్న పేరు కూడా ఉంది.. మరి ఈ సారి ఠాక్రే చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఏ మేరకు ఓట్ల పంట పండిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
‘తిడుతూనే.. కాపీ కొడుతున్నారుగా’
ముంబై : ఐదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలను తిడుతూనే వారిని కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ‘ న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో ఒక కొటేషన్ ఉంటుంది. ప్రజలు నన్ను ప్రధాన మంత్రి అని కాకుండా ప్రథమ సేవకుడిగా పిలవాలి అన్న నెహ్రూ ఆదర్శ వాక్యాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం మోదీ ప్రథమ సేవకుడికి బదులు ప్రధాన సేవకుడిని అని చెప్పుకొంటున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీని తిడుతూనే వారిని భలేగా కాపీ కొడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. నాందేడ్‌లో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే...నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళా భద్రత గురించి పట్టించుకోకుండా ప్రధానిగా మోదీ విఫలమయ్యారన్నారు. సైనికుల త్యాగాలను రాజకీయాలకు వాడుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నందుకు మోదీ సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. బీజేపీ, అమిత్ షా, మోదీలను దేశ రాజకీయాల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు. కాగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాజ్ ఠాక్రే పోటీ చేయడం లేదన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ, పాలక బీజేపీపై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇక రాజ్ ఠాక్రే కజిన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
మోదీకి అందని థాక్రే ఆహ్వానం!
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీతోపాటు పలువురు కేంద్ర మంత్రులకు వివాహ ఆహ్వానాలు అందగా.. ప్రధాని మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. గత కొద్దిరోజులుగా మోదీపై బాహాటంగానే విమర్శలు చేస్తున్న థాక్రే.. ఉద్దేశపూర్వకంగానే మోదీని ఆహ్వానించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజ్ థాక్రే కుమారుడు అమిత్, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ సంజయ్ బోరుడె కుమార్తె మిథాలిల వివాహం జనవరి 27న లోవర్ పరేల్‌లోని సెయింట్ రెగిస్ హోటల్లో జరగనుంది. ఈ వివాహానికి ఆహ్వానించడానికి రాజ్ థాక్రే గతవారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయారు. దీంతో ఆయన తన సన్నిహతులైన హర్షల్ దేశ్‌పాండే, మనోజ్ హతేకు ఆహ్వాన బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ ఢిల్లీలోని పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి వివాహానికి ఆహ్వానించారు. వివాహ ఆహ్వానాలు పొందినవారిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవడేకర్, ధర్మేంద్ర ప్రదాన్, మేనకా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులు ఉన్నారు. ఎన్సీపీ నేత శరథ్ పవార్‌ను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆహ్వానం అందింది. అయితే మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందలేదు. కొద్దిరోజుల క్రితం కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్‌థాకరే స్పందిస్తూ.. 'పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?' అంటూ బదులిచ్చారు. కొత్త కూటమి..? మహారాష్ట్రలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో మోదీని రాజ్ థాక్రే కుమారుడి పెళ్లికి ఆహ్వానించకపోవడం ఈ తరహా ప్రచారానికి బలంచేకూరుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన బీజేపీకి ఎదురుతిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీపై బాహాటంగానే శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో మహారాష్ట్రలో మహాకూటమి ఏర్పడితే బీజేపీ కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
తనుశ్రీపై కేసు నమోదు
సాక్షి, ముంబై : నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి వంటి బాలీవుడ్ ప్రముఖులపై వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన తనుశ్రీ దత్తాపై కేసు నమోదైంది. ఇప్పటికే నానా పటేకర్, వివేక్ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపగా.. తాజాగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్త సుమంత్ దాస్ ఫిర్యాదుతో బీడ్ జిల్లాలోని కైజ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. ఎంఎన్ఎస్ తనుశ్రీ అసత్య ఆరోపణలు చేశారని దాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తద్వారా రాజ్‌థాకరే, ఎంఎన్ఎస్ పరువుకు ఆమె భంగం కలిగించారని ఆయన ఆరోపించారు. కాగా, నానా విషయంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనపై బెదిరింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌లో వద్దు.. ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో-12వ సీజన్లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్ఎస్ స్పందించింది. తనుశ్రీకి బిగ్‌బాస్ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్ఎస్ యూత్వింగ్ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్‌బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు. -
ఏంటి ఇదేమన్నా జోక్ అనుకుంటున్నారా : నటి
‘ఏంటి ఇదేమన్నా జోకా? అంటే మనం ఈ దౌర్జన్యాలను, పోకిరి వేషాలు వేసే వాళ్లను అలా వదిలేయాలంటారా? అయినా విధ్వంసం సృష్టించే అటువంటి గూండాలతో ఫొటో దిగడానికి ఎవరు ఇష్టపడతారు. అసలేం జరిగింది? మనందరికీ ఏమయ్యింది?’ అంటూ నటి స్వరా భాస్కర్ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) నాయకులను ఉద్దేశించి ట్విటర్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. ఈ విధంగా ట్వీట్ చేసి మరోసారి తనుశ్రీ దత్తాకు తన మద్దతు తెలిపారు. కాగా తనుశ్రీ- నానా పటేకర్ వివాదం ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్ర సమయంలో నానా తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తనూశ్రీ ఆరోపించారు. అలాగే ఆ సమయంలో నానాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కార్యకర్తలు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తనుశ్రీ పబ్లిసిటీ కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తోందని ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనూశ్రీపై విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. తనూశ్రీ తన చెల్లెలితో కలిసి బిగ్‌బాస్‌లో పాల్గొంటుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్పై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి వారికి లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్‌లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ విషయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన స్వరా భాస్కర్ ఎంఎన్ఎస్ నేతలను ఉద్దేశించి ట్వీట్ చేసి తనుశ్రీకి మద్దతుగా నిలిచారు. IS THIS A JOKE?????? Or are we now just okay with institutionalised hooliganism?????? And who takes pictures with the goons that threaten vandalism????? WHAT IS WRONG WITH US GUYS??!???? https://t.co/dL8gZvlYAR — Swara Bhasker (@ReallySwara) October 4, 2018 -
‘బిగ్‌బాస్‌లో తనుశ్రీ పాల్గొంటే అలా జరగొచ్చు’
సినిమా చిత్రీకరణలో సహ నటులు, దర్శకుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తనుశ్రీ దత్తా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు. నటుడు నానా పటేకర్, దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, నానాపై ఆరోపణలు మానుకోవాలని వచ్చిన ఒత్తిడులకు తలొగ్గొలేదని ఆమె మంగళవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నానాపై ఆరోపణలు చేయొద్దని రాజ్‌థాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) నాయకులు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. కాగా, తనుశ్రీ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఇంటి చుట్టూ 24 గంటల పోలీస్ ప్రొటెక్షన్ కల్పించింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర హోంమంత్రి దీపక్ కేస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. తనుశ్రీ విజ్ఞప్తి మేరకు రక్షణ కల్పించామని అన్నారు. ఈ చర్యను నానా పటేకర్‌కు వ్యతిరేకమైందిగా భావించొద్దని అన్నారు. ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో-12వ సీజన్లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్ఎస్ స్పందించింది. తనుశ్రీకి బిగ్‌బాస్ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్ఎస్ యూత్వింగ్ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్‌బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్ఎస్కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు. (చదవండి : తనుశ్రీకి మద్దతుగా నిలిచిన మేనకాగాంధీ) -
తనుశ్రీ వివాదం.. బిగ్‌బాస్‌కు హెచ్చరిక
ముంబై: తనుశ్రీ దత్త, నానా పటేకర్‌ల వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. కొందరు బాలీవుడ్ ప్రముఖులు తనుశ్రీకి మద్దుతుగా నిలువగా మరికొందరు ఈ విషయంపై మాట్లాడానికి ఆసక్తి కనబరచడం లేదు. కాగా, పదేళ్ల కిందట ప్లీజ్ హార్న్ ఓకె చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై వేధింపులకు దిగాడని తనుశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా తనుశ్రీకి మద్దుతుగా పలు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో తనుశ్రీ మాట్లాడుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నాయకులు తనపై దాడి చేశారని ఆరోపించారు. నానా విషయంలో తనపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె వ్యాఖ్యనించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఎంఎన్ఎస్ తీవ్రంగా ఖండించిది. ఎంఎన్ఎస్ పార్టీ నాయకులు అమేయ కోప్కర్ మాట్లాడుతూ.. తనుశ్రీ వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఆమెపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఎవరు దాడి చేయలేదని స్పష్టం చేశారు. తనుశ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని.. కానీ తాము దానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదని తెలిపారు. నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన తరువాత తనుశ్రీ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో వివాదాలు కేంద్రంగా నడిచే బిగ్‌బాస్ రియాల్టీ షోలోకి తనుశ్రీని తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఎంఎన్ఎస్పై తప్పడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి నిర్వహకులకు ఓ లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్‌లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా హిందీ బిగ్‌బాస్ 12వ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
బర్త్‌డే కానుక : పెట్రోల్‌పై రూ.5 తగ్గింపు
ముంబై : ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల్లో ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల 9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల ముందు వందల మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ఈ రోజు మహారాష్ట్రలో పెట్రోల్ ధర 84.26 రూపాయలుగా ఉంది. ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ బంక్ యాజమానులపై పడే భారాన్ని ఎంఎన్ఎస్ చెల్లించనుంది. దీనిపై ద్విచక్ర వాహనదారులు హర్షం చేస్తున్నారు. ఓ వాహనదారుడు మాట్లాడుతూ.. రాజ్ ఠాక్రేలాగే మోదీ కూడా పెట్రోలు ధరలు తగ్గిస్తారని ఆశిస్తున్నామన్నారు. తాను ట్యాంక్ ఫూల్ చేయించడం ఇదే తొలిసారి అని తెలిపారు. -
నాకు ఎమ్మెల్యే.. నీకు ఎంపీ!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో రహస్యంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో జతకట్టి 35–50 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేయాలని ఇప్పటి నుంచే ఎమ్మెన్నెస్ పార్టీ నాయకులు వ్యూహం పన్నుతున్నారు. అసెంబ్లీలో మద్దతిస్తే లోకసభ ఎన్నికల్లో ఇరుపార్టీల అభ్యర్థులున్న చోట ఎమ్మెన్నెస్ పోటీచేయకూడదని నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్‌తో కష్టమే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వ్యతిరేక పార్టీలన్ని ఒకతాటిపైకి రావల్సిన అవసరం ఉందని ఉగాది రోజున శివాజీపార్క్ మైదానంలో జరిగిన మేళావాలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై దృష్టి సారించారు. ఉత్తర భారతీయులకు వ్యతిరేక పార్టీగా గుర్తింపు పొందిన ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అందుకు ప్రధాన కారణం ఎలాంటి ఎన్నికలైనా కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తర భారతీయులు, ముస్లింల ఓట్లతోనే విజయ ఢంకా మోగిస్తారు. దీంతో ఎమ్మెన్నెస్‌తో కాంగ్రెస్ జత కష్టమే. కాగా, ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి పోటీ చేయడం, కొన్నింటిలో ఒంటరిగా బరిలోకి దిగడం లాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. దీంతో విభేదాలున్నా.. కాంగ్రెస్, ఎన్సీపీలతో రహస్యంగా పొత్తు పెట్టుకోవాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో 100–150 స్థానాల్లో పోటీ చేసే బదులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న 35–50 స్థానాలను ఎంపిక చేసుకుని అక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని ఎమ్మెన్నెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి పరోక్షంగా మద్దతు తీసుకునే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో సాయం చేస్తే.. లోకసభకు మద్దతు ఇటీవల ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. అందులో 35–50 నియోజక వర్గాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు నాలుగు, ఐదో స్థానాల్లో ఉండగా, ఎమ్మెన్నెస్ రెండు, మూడో స్థానాల్లో నిలిచింది. ఈ స్థానాల్లో ఇరుపార్టీల సాయం తీసుకునే అవకాశాలున్నాయి. ముంబై, థానే, నాసిక్‌తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని నియోజక వర్గాలలో పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరయ్యే పనులు ప్రారంభించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒకే ఎమ్మెల్యేతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్సీపీతో రహస్యంగా జతకట్టి ఎక్కువ స్థానాలు గెలుపించుకునే ప్రయత్నం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే కాంగ్రెస్, ఎన్సీపీ ఫలితాలపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలా...? వద్దా..? అనే దానిపై రాజ్ ఠాక్రే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపార్టీలు ఎమ్మెన్నెస్‌కు పరోక్షంగా సహకరిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కూడా పరోక్షంగా సహకరించే అవకాశాలున్నాయి. లేదంటే ఐదు లేదా ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలో దింపే ప్రయత్నం చేయనుంది. ఒకవేళ 2019లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌కు ఇరు పార్టీలు సహకరిస్తే బీజేపీ, శివసేనకు కొంత మేర నష్టం జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
రాజ్‌ఠాక్రే కార్యకర్తలను చితక్కొట్టారు..
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) కార్యకర్తలను చిరువ్యాపారులు శనివారం చితక్కొట్టారు. రాజ్ ఠాక్రే పార్టీకి చెందిన 15 మంది కార్యకర్తలు నగరంలోని మలడ్ రైల్వే స్టేషన్ వద్ద దురాక్రమణలను పరిశీలించేందుకు వెళ్లారు. రైల్వే స్టేషన్ పరిధిలోని భూమిలో అక్రమంగా నిలిపిన దుకాణాలను తొలగించాలని వారికి చెప్పారు. దీంతో ఆగ్రహించిన 100 మంది చిరు వ్యాపారులు వారిపై రాడ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ నిరుపమ్ మలడ్ రైల్వే స్టేషన్ పరిధిలోని చిరు వ్యాపారులతో సమావేశమైన తర్వాత వారు దాడికి పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. చిరు వ్యాపారుల దాడిలో ఓ ఎమ్ఎన్ఎస్ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) దురాక్రమణకు గురైన రైల్వే స్థలాలపై ప్రచార కార్యక్రమాలను ఆపబోమని పేర్కొంది. -
గుండాగిరి.. కర్రలు విరిగేలా చావుదెబ్బలు
సాక్షి, ముంబయి : మహారాష్ట్రలో మరోసారి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు గుండాగిరికి దిగారు. మరాఠేతరులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ పార్టీ జెండాలు విరిగిపోయేలా వారిని చావు దెబ్బలు కొట్టారు. తమ ప్రాంతంలో ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారని జులుం ప్రదర్శిస్తూ చెలరేగిపోయారు. సంగ్లీ పరిధిలోని కుప్వాడ్ ప్రాంతంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో పలువురు మహారాష్ట్రేతరులు పనిచేస్తుంటారు. వారి సంఖ్య దాదాపు 25 వేల వరకు ఉంటుంది. ఎన్నో పరిశ్రమలు, తయారీ యూనిట్లు, ఫ్యాక్టరీలు, మిల్లులు ఉన్న ఇక్కడ మహారాష్ట్రేతర్లు చాలామంది ఉంటారు. అయితే, వారు ఇక్కడ పనిచేయొద్దని స్థానికులు మాత్రమే ఉండాలని, ఉద్యోగాలు ఇచ్చే వారు కూడా స్థానికులకే ఇవ్వాలని నినాదాలు ఇస్తూ ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరిచారు. తమ ప్రాంతాల్లో నేరాలు జరగడానికి కారణం వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారేనని వారు ఆరోపించారు. స్థానికుల ఉద్యోగాలను స్థానికేతరులు దోచుకెళుతున్నారని మండిపడ్డారు -
ఎన్నికల ప్రచారంలో పురిటినొప్పులు
పుణె: ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా కార్పొరేటర్ అభ్యర్థి పోలింగ్ జరగకముందే విజయాన్ని సాధించారు. అదెలా అంటే.. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్ రూపాలి పాటిల్ పుణె మునిసిపల్ కార్పొరేషన్ (పీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీ నేతల తరహాలోనే ఆమె తన ప్రచారాన్ని కొనసాగిస్తుండగా గురువారం రాత్రి పురిటినొప్పులు వచ్చాయి. పార్టీ నేతలు ఆమెను పుణెలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం ఉదయం తన రెండో కాన్పులో ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఓటింగ్ జరగకముందే తమ అభ్యర్థి రుపాలి విజయం సాధించారంటూ ఎంఎన్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎన్ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ అయిన రుపాలి శనివార్ పేట్-నారాయణ్ పేట్ నుంచి 15వ వార్డు నుంచి కార్పొరేటర్ గా మున్సిపల్ ఎన్నికల్లో బరిలో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం వాస్తవానికి డాక్టర్లు పాటిల్ కు మార్చి 5న డెలివరి డేట్ ఇచ్చారు. అయితే దాదాపు నెల రోజుల ముందే తాను ఈ సంతోషాన్ని పొందానని పాటిల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బిబీగా పాల్గొనడం, నడవటం లాంటి వాటితో ఇలా జరిగి ఉండొచ్చుని చెప్పారు. డాక్టర్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తే మరో రెండు రోజుల్లోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని ఎంఎన్ఎస్ అభ్యర్థి రుపాలి పాటిల్ తెలిపారు. -
పార్టీ గుర్తు మార్చే పనిలో ఎంఎన్ఎస్!
ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎంఎన్ఎస్) కొత్త పార్టీ గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ పార్టీ గుర్తుగా రైలింజన్‌ను దాదాపు ఖరారు చేసినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎన్ఎస్ పార్టీ మహారాష్ట్రలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 13 స్థానాలు సాధించిన ఎంఎన్ఎస్, 2013లో మాత్రం కేవలం ఒక స్థానం సాధించి పూర్తిగా చతికలపడిన విషయం తెలిసిందే. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికే గుర్తు మారుస్తున్నారని పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ కారణాలు మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆర్టిస్టులపై నిషేధం విషయంలో ఎంఎన్ఎస్ నేతలు వీరంగం సృష్టించారు. థియేటర్ల యాజమాన్యాన్ని బెదిరించడం, బాలీవుడ్ దర్శకనిర్మాతలను హెచ్చరిస్తూ వ్యవహారాన్ని పెద్దది చేయడంతో.. ఇండస్ట్రీకి చెందిన కొందరు ఏకంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆశ్రయించారు. చివరికి కరణ్ జోహర్ తీసిన మూవీ విడుదలై రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. పార్టీ గుర్తు మార్చితే.. బీఎంసీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఫేట్ మారుతుందో లేదో తెలియాలంటే ఆ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే. -
48గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. లేదంటే..
ముంబయి: పాకిస్థాన్ కు చెందిన నటులకు, టీవీ ఆర్టిస్టులకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరికలు జారీ చేసింది. 48గంటల్లో భారత దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎంఎన్ఎస్ చిత్రపత్ సేనా చీఫ్ అమేయ ఖోప్కార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల (సెప్టెంబర్ 18)న ఊడి సెక్టార్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా పాక్ వ్యతిరేక వైఖరి దేశంలో బాగా పెరిగిపోయిందని అందుకే పాక్ కు చెందిన ఏ నటులు, ఆర్టిస్లులు ఉండొద్దని ముందస్తుగా హెచ్చరిస్తున్నామని చెప్పారు. తాము చెప్పినట్లు విని వారు వెళ్లకపోతే ఎలా పంపించాలో తమ పద్ధతిలో చూపిస్తామని హెచ్చరించారు. పాకిస్థాన్ నటులతో సినిమాలు, ప్రత్యేక షోలు చేసే నిర్మాతలను త్వరలోనే అడ్డుకుంటామని తెలిపారు. గతంలో ఎంఎన్ఎస్, శివసేన ఈ తరహా కార్యక్రమాలు గతంలో చేసిన విషయం తెలిసిందే. -
ఔను! చట్టాన్ని ఉల్లంఘిస్తాం!
థానే: సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) బేఖాతరు చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా గురువారం థానెలో ఉట్టికొట్టేందుకు ఏకంగా 40 అడుగుల మానవ పిరమిడ్‌ను నిర్మించింది. అంతేకాకుండా 'నేను చట్టాన్ని ఉల్లంఘిస్తాను' అనే రాతలు ఉన్న టీషర్ట్లు ధరించి ఎమ్మెన్నెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్టి వేడుకలపై సుప్రీంకోర్టు బుధవారం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఉట్టికుండ కొట్టేందుకు 20 అడుగుల ఎత్తుకుమించి మానవ పిరమిడ్లను నిర్మించవద్దని, మైనర్లు ఈ వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉట్టి ఉత్సవాల్లో పలు ప్రమాదాలు జరిగే ప్రాణాపాయం సంభవిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. కానీ, మహారాష్ట్రలో చాలాచోట్ల ఆదేశాలను ఉల్లంఘించారు. రాష్ట్రంలో ఘనంగా జరిగే కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించుకున్నారు. 'మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ అంచెలు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను' అని రాజ్ ఠాక్రే మీడియాతో పేర్కొన్నారు. -
'ఎంఎస్ ధోనీ'కి అనుకోని చిక్కులు!
ముంబై: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ'. ఈ సినిమాకు మహారాష్ట్రలో అనుకోని చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ చిత్రాన్ని మరాఠీలోకి డబ్ చేయవద్దంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) సినీ వ్యవహారాల విభాగం తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ధోనీకి దేశమంతా అభిమానులు ఉన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదిగిన అతని జీవిత కథ యువతకు స్ఫూర్తిదాయకం. అందుకే ఈ సినిమాను దేశంలోని అన్ని భాషల్లో డబ్ చేయాలని నిర్ణయించినట్టు చిత్ర దర్శకుడు నీరజ్ పాండే తెలిపారు. అయితే ఎమ్మెన్నెస్ చిత్రవిభాగమైన చిత్రపత్ కర్మాచారి సేన (సీకేఎస్) ఈ ఆలోచనను వ్యతిరేకిస్తుంది. ఈ సినిమాను ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తే.. ప్రాంతీయ భాషా సినిమాల మార్కెట్‌ను ఇది దెబ్బతీసే అవకాశముందని సీకేఎస్ పేర్కొంటున్నది. 'ధోనీ' సినిమాను మరాఠీలో డబ్ చేస్తే.. అది మరిన్ని హిందీ సినిమాలు మరాఠీలో డబ్ చేసే ట్రేండ్‌కు దారితీయవచ్చునని, దాంతో స్థానిక మరాఠీ సినిమాలకు అన్యాయం జరుగుతుందని సీకేఎస్ వాదిస్తోంది. 'ధోనీ'ని మరాఠీలో డబ్ చేయాలన్న ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నట్టు సీకేఎస్ పేర్కొన్నది. -
మాంసం అమ్మకాల్లో 'మహా సేన'
ముంబయి: దేశ వాణిజ్య రాజధానిలో మాంసం లొల్లి ముదురుతోంది. ఓ పక్క జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మాకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా దానిని శివసేన పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మాత్రం శివసేన కంటే మరో అడుగు మందుకేసి ఏకంగా మాంసం అమ్మకాలను స్వయంగా గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయి దాదార్ లోని అగర్ బజార్‌వద్ద తన పార్టీకి చెందిన కార్యకర్తలతో ప్రత్యేక మాంసం విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయిస్తానని చెప్పింది. దీంతో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుని మరింత వివాదంగా మారే అవకాశం ఉంది. జైనులు పవిత్రంగా భావించే పర్యుషాన్ సందర్భంగా తొలుత ఎనిమది రోజులపాటు మాంసం విక్రయాలు నిషేధించాలని భావించారు. అయితే, పలు వర్గాల అభిప్రాయాలు తీసుకొని మొత్తం నాలుగు రోజులు నిషేధం విధించారు. అయినప్పటికీ ఈ నిర్ణయంపై కూడా పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శివసేన పార్టీ అయితే.. ఎవరేం తినాలో చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదని బీజేపీ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించగా.. ఇప్పుడు ఎమ్మెన్నెస్ మరో అడుగు ముందుకేసింది. -
మాటలొద్దు.. పని చేయండి: రాజ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: కరువు ప్రాంతాల బాధితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చే స్తూ కాలయాపన చేసే బదులు వారికి ఉపయోగపడే పనులేవైనా చేస్తే ఎవరైనా హర్షిస్తారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే హితవు పలికారు. ఆయన బుధవారం ఔరంగబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులను హేళన చేసే విధంగా మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి ఖడ్సే వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యవహరించాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది.. పంటలు పండక రైతులు బేజారవుతున్నారు.. చేసిన అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి బాధాకరమైన సమయంలో రైతులను కించపరిచే విధంగా ఖడ్సే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. మంత్రి ఖడ్సేకు ‘సెల్’ బహుమతి.. రైతులపై రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే చేసిన వ్యాఖ్యలు ఇంతట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. జితేంద్ర జనావలే అనే శివసైనికుడు బుధవారం ఖడ్సేకు ఏకంగా ఓ మొబైల్ ఫోన్ బహుమతిగా పంపాడు. కరువు పీడిత ప్రాంత రైతులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఖడ్సేకు శాంతాకృజ్ పోస్టు ఆఫీస్ నుంచి ఈ ఫోన్ పంపినట్లు చెప్పాడు. -
ఎమ్మెన్నెస్‌లో బీజేపీ ముసలం
సాక్షి, ముంబై: నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ మేరకు బీజేపీ నాయకులు చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెన్నెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వసంత్ గీతే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాసిక్ కార్పొరేషన్‌లోని 18 మంది కార్పొరేటర్లు కూడా గీతే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాసిక్ కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారంలో కొనసాగుతోంది. ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం గీతే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనతో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలు, తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాజ్‌ఠాక్రే పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాని ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీనుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఎమ్మెన్నెస్‌లో ప్రముఖ నాయకుడైన ప్రవీణ్ దరేకర్ కూడా బీజేపీ బాటలో ఉన్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. తాజాగా గీతే పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినప్పుడు తన పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీని వీడిపోనని ప్రకటించారు. కాని కొద్ది సేపటిలోనే ఆయన బీజేపీతో సంప్రదింపులు జర్పుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, నాసిక్‌లోని అనేక మంది కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యకర్తలు బీజేపీ బాటలో ఉన్నారని బీజేపీ ఉత్తర మహారాష్ట్ర చీఫ్ విజయ్ సానే అన్నారు. ఈ విషయంపై రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సానే పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన రాజ్ ఠాక్రేతో అనేక మంది కార్యకర్తలు, పదాధికారులు మీకు అండగా మేమున్నామంటూ ఆయనకు మనోధైర్యాన్ని నూరిపోశారు. కాని వారం రోజులైన గడవకముందే వలసలకు సిద్ధం కావడం రాజ్ ఠాక్రేకు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కార్పొరేషన్లో ఎన్నెమ్మెస్కు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే బీజేపీకి 18, ఎన్సీపీకి 20, కాంగ్రెస్, 13, శివసేన,ఆర్పీఐ కూటమికి 23 మంది సభ్యులున్నారు. -
సీఎం రేసులో ఉన్నా..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం రాజ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసం ఉంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)ను గెలిపిస్తే రాష్ట్రానికి నేతృత్వం వహించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర తాజా మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌పై రాజ్ ఠాక్రే తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ఆయనను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన ఓ దిష్టిబొమ్మ అంటూ అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో దాదాపు అన్ని పార్టీలపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టీవీలలో ‘కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలో మహారాష్ట్ర నెంబర్ వన్ అని పేర్కొనడంపై ఘాటుగా స్పందించారు. అభివృద్ధి, సంక్షేమంలో కాకుండా నిరుద్యోగం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు తదితర విషయాల్లో మహారాష్ట్ర నెంబర్ వన్‌గా ఉందని ఎద్దేవా చేశారు. ఇజ్రాయిల్‌లోని ఎడారి భూములను ఎలా సాగుచేస్తున్నారో తెలుసుకునేందుకు నేతలు ఇజ్రాయిల్ వెళ్లారు. కాని రాష్ట్రంలోని సాగుకు అనుకూలమైన భూములను వీరు ఎడారులుగా మార్చారని, వాటి సంగతేమిటని నిలదీశారు. ఎమ్మెన్నెస్ రూపొందించిన బ్లూప్రింట్ గురించి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటామన్నారు. ‘అధికారం మాకివ్వండి.. యువతకు ఉపాధి కల్పిస్తామ’ని హామీ ఇచ్చారు. అదే విధంగా పోలీసు భర్తీ ప్రక్రియలో కూడా మార్పులు చేస్తామన్నారు. ఒక్కసారి తమకు అధికారమిచ్చి చూడంటంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి పార్టీలోనూ తిరుగుబాట్లు, జంప్ జిలానీలతో రాజకీయాలస్థాయి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎప్పుడు ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారో .. అసలు ఏ పార్టీలో ఎవరున్నారో తెలియకుండా పోతోంద’ని వ్యాఖ్యానించారు. -
రాజ్‌ఠాక్రే పేరుతో ‘నకిలీ ఎఫ్బీ’ హల్చల్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి నకిలీ ఫేస్ బుక్ పేజీ సృష్టించాడు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనపై బురద జల్లేందుకు చేస్తున్న అజ్ఞాత వ్యక్తి ప్రయత్నాలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మహాత్మ పులే పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఎఫ్ అకౌంట్ ఆధారంగా కేసును ఛేదించేందుకు కృషి చేస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. రాజ్ ఠాక్రే పేరుతో ఎఫ్బీ అకౌంటే లేదు ‘రాజ్ ఠాక్రే పేరుతో ఇంతవరకు ఫేస్ బుక్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. అయినప్పటికీ ఆయన పేరుతో నకిలీ అకౌంట్ తెరిచి అందులో రాజ్ ఠాక్రే తన కార్యకర్తలకు సూచనలిస్తున్నట్లు వ్యాఖ్యలు రాస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని బట్టి ఇది నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ అని స్పష్టమైందని’ ఎమ్మెన్నెస్ ఐటీ వింగ్ కల్యాణ్ కార్యదర్శి కాసం శేఖ్ అన్నారు. అజ్ఞాత వ్యక్తులు ఠాక్రే పేరు చెడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేశారు. ఫేస్ బుక్‌ను లైక్‌చేసిన వ్యక్తులతో సంప్రదిస్తూ తను రాజ్ ఠాక్రేనని మోసం చేస్తున్నారని శేఖ్ అన్నారు. రాష్ట్రం అభివృద్థి చెందాలంటే నిధుల అవసరం ఎంతైనా ఉంది. అందుకు దాతలు విశాల హృదయంతో విరాళాలు అందజేసేందుకు ముందుకు రావాలని రాజ్ పిలుపునిచ్చినట్లు ఫేజ్ బుక్‌లో వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ పేరు, రాజ్ ఠాక్రేను కావాలనే బద్నాం చేసేందుకు కుట్రపన్నారని, ఈ వివాదం మరింత ముదరక ముందే ఆజ్ఞాత వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని శేఖ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ ఈ పేజీని అనేక మంది లైక్ చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ బోయిర్ పోలీసుల దృిష్టికి తీసుకెళ్లారు. ఠాక్రే ప్రతిష్ఠకు భంగం కల్గించేందుకే.. శాసన సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో నకిలీ అకౌంట్ తెరిచి రాజ్ ఠాక్రే ప్రతిష్టకు భంగం వాటిళ్లే ప్రయత్నం కొందరు కావాలనే చేస్తున్నారని ఎమ్మెన్నెస్ కల్యాన్ నగర అధ్యక్షుడు రవీంద్ర బోంస్లే ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఆశ్రయిస్తాయి. అందులో ఇలాంటి తప్పుడు సందేశాలుంటే ఓటర్లు పొరబడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం అందరి వద్ద ఆధునిక సెల్ఫోన్లు ఉన్నాయి. అందులో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఇలాంటి సైట్లవల్ల ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇలాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించి నకిలీ, నాయకుల ప్రతిష్టకు భంగం వాటిళ్లజేసే సైట్లను వెంటనే తొలగించాలని బోంస్లే కోరారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పేరుతో నకిలీ ఫేస్ బుక్ పేజీ తయారు చేసిన గుర్తుతెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ మహాత్మ పులే పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. -
నాసిక్ మేయర్ పదవి ఎమ్మెన్నెస్ పరం
నాసిక్: ప్రతిష్టాత్మకంగా మారిన నాసిక్ మేయర్ పదవిని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) కైవశం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అశోక్ దేవరామ్ ముర్తాదక్ మేయర్‌గా ఎన్నికయ్యాడు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) మేయర్ పదవికి జరిగిన పోలింగ్‌లో అశోక్‌కు 77 ఓట్లు పోలవ్వగా, శివసేనకు చెందిన సుధాకర్ భికా బద్గూజర్‌కు 44 ఓట్లు వచ్చాయని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి విలాస్ పాటిల్ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థి గురుమిత్ అర్జున్‌సింగ్ బగ్గాను డిప్యూటీ మేయర్‌గా ప్రకటించారు. అతడికి 75 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి చెందిన ప్రత్యర్థి శంభాజీ శ్యామ్‌రావ్ మొరుస్కర్‌కు 43 ఓట్లు పోలయ్యాయని పాటిల్ చెప్పారు. ఇదిలా ఉండగా, 2012లో జరిగిన ఎన్ఎంసీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పార్టీ బీజేపీతో కలిసి అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఎమ్మెన్నెస్ నుంచి న్యాయవాది అయిన యతిన్ వాఘ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్లు ఎమ్మెన్నెస్, తర్వాత విడత బీజేపీ అభ్యర్థి మేయర్ పదవి చేపట్టాలి.అయితే యతిన్ మేయర్‌గా ఉన్న సమయంలో బీజేపీని పూర్తి విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. దాంతో ఇప్పుడు ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా, ఈ ఎన్నికల్లో మేయర్ పదవి కోసం ఎమ్మెన్నెస్‌కు చివరి నిమిషంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మద్దతు ఇవ్వడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. కాగా, ఎన్ఎంసీలో 122 మంది కార్పొరేటర్లు ఉండగా ఎంఎన్ఎస్-37, ఎన్సీపీ-20, కాంగ్రెస్-14, శివసేన-22, బీజేపీ-15, స్వతంత్రులు-6, జనస్వరాజ్య పార్టీ-2, ఆర్పీఐ-3, సీపీఎం-3 కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్నాయి. -
కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరైన ఎమ్మెన్నెస్
సాక్షి, ముంబై: నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ)లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారి తారుమారు అయ్యాయి. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్)తో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. గతంలో ఎమ్మెన్నెస్, బీజేపీ మిత్రపక్షాలుగా ఏర్పడి ఎన్ఎంసీలో అధికారం చేజిక్కించుకున్నాయి. కానీ బీజేపీ ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకుని మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదర్చుకుంది. శివసేన మేయర్ పదవికి, బీజేపీ డిప్యూటీ మేయర్ పదవికి నామినేషన్లు వేశాయి. ఇక చేసేది లేక ఒంటరైన ఎమ్మెన్నెస్, శరద్ పవార్ నేతత్వంలోని నేషనలిస్టు కాంగ్రె స్ పార్టీ (ఎన్సీపీ)తో జతకడుతుందా..? అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెన్నెస్ తరఫున నలుగురి నామినేషన్లు ఎన్ఎంసీకి ఈ నెల 12న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అండతో ఎమ్మెన్నెస్ అధికారం చేజిక్కించుకుంది. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో నాసిక్ ఒకటే ఎమ్మెన్నెస్ అధీనంలో ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా దూరం కావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు మంగళవారం 11-2 గంటల మధ్య నామినేషన్లు వేయాలి. బీజేపీ తమతో జతకట్టడం లేదని తేలిపోయిన తర్వాత ఎమ్మెన్నెస్ తరఫున నల్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీజేపీకి సంబంధించిన వారెవరు లేరు. కొద్ది సేపటికి బీజేపీ, శివసేన, ఆర్పీఐ కార్పొరేటర్లు భారీగా బలప్రదర్శన చేస్తూ కార్పొరేషన్ భవనానికి చేరుకున్నారు. మూడు గంటల్లోనే రాజకీయ సమీకరణాలు మారిపోవడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. నాసిక్‌లో ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల పోటీ మరింత ఉత్కంఠకు దారితీసింది. ఎన్సీపీతో దోస్తీకి ప్రయత్నం.. ఎమ్మెన్నెస్ ఆధీనంలో ఉన్న ఒక్క కార్పొరేషన్ కూడా చేజారి పోవడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే శాసన సభ ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉంటాయోనని ఎమ్మెన్నెస్‌కు దిగులు పట్టుకుంది. ఎలాగైన అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తెర వెనక నుంచి చక్రం తిప్పాలని యోచిస్తోంది. నాసిక్ కార్పొరేషన్లో ఎన్సీపీకి 20 మంది కార్పొరేటర్ల సంఖ్యా బలముంది. అధికారం కోసం ఎమ్మెన్నెస్ ఎన్సీపీతో జతకట్టే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క 14 మంది సంఖ్యా బలం ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు తమ వైఖరి స్పష్టం చేయలేదు. బలాబలాలు ...... ఎమ్మెన్నెస్-39, శివసేన, ఆర్పీఐ-23, బీజేపీ-15, ఎన్సీపీ-20, కాంగ్రెస్-14, ఇండిపెండెంట్లు-6, మార్క్స్‌వాది కమ్యూనిస్టు పార్టీ -3, జనరాజ్య-2 ఇలా మొత్తం 122 స్థానాలున్నాయి. -
లాంచ్ చేయడానికి.. నా కొడుకేమైనా రాకెట్టా?
ముంబై: లాంచ్ చేయడానికి నా కొడుకేమైనా రాకెటా? అంటూ మహారాష్ట్ర నవీనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే తీవ్రంగా స్పందించారు. ఎంఎన్ఎస్ విద్యార్ధి విభాగం కీలక పదివిని అధిష్టించడం ద్వారా రాజ్ థాక్రే రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలని రాజ్ థాక్రే ఖండించారు. లాంచ్ చేయడానికి నా కుమారుడు అమిత్ రాకెట్ కాదు. సరియైన సమయంలో రాజకీయాల్లో ప్రవేశిస్తారు అని రాజ్ థాక్రే అన్నారు. ఎంఎన్ఎస్ విద్యార్ధి విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ థాక్రే తండ్రితోపాటు పాల్గొన్నారు. ఈసభలో తన మాటల్నే నమ్మాలని.. మీడియా వార్తలను పరిగణనలోకి తీసుకోవద్దు అని అమిత్ అన్నారు. శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే లానే అమిత్ థాక్రే విద్యార్ధి విభాగం ద్వారా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
పార్టీ ప్రక్షాళనపై రాజ్‌ఠాక్రే వెనకడుగు
సాక్షి ముంబై: పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావించిన ఎమ్మెన్నెస్ అధినేత రాజ్‌ఠాక్రే వెనకడుగు వేసినట్లు కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత పార్టీ స్థానిక నాయకత్వంలో మార్పులు చేయాలని రాజ్‌ఠాక్రే భావించారు. అయితే ప్రస్తుతం స్థానికంగా కీలక స్థానాల్లో ఉన్న నాయకులు, వారి మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, మారిస్తే పార్టీని వీడతామంటూ తెగేసి చెప్పడంతో రాజ్ కొంత వెనక్కు తగ్గినట్లు తెలిసింది. పైగా అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగించే పనిలో ప్రస్తుతం రాజ్ నిమగ్నమైనట్లు కూడా చెప్పుకుంటున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కీలక శక్తిగా ఎదిగేందుకు పార్టీని బలోపేతం చేయాలని రాజ్ భావించారు. అందుకోసం పార్టీకి మంచి పట్టున్న నాసిక్ నుంచి ప్రక్షాళన మొదటు పెట్టాలని నిర్ణయించారు. ఇక్కడ ఎమ్మెన్నెస్‌కు 40 కార్పొరేటర్లు, మేయర్‌తోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఇక్కడ ప్రభావం చూపలేకపోయింది. పైగా పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో నాసిక్ నుంచే ప్రక్షాళన చేయాలని భావించిన రాజ్ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాజ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు స్థానిక నేత వసంత్ గీతేతోపాటు ఆయన మద్దతుదారులు శివసేన, బీజేపీలోకి వె ళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన రాజ్ పార్టీ సీనియర్ నాయకులను రంగంలోకి దింపి గీతేను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతానికి బుజ్జగింపులు పనిచేసినా స్థానిక నాయకత్వంలో ఎటువంటి మార్పులు చే యమనే హామీని రాజ్‌ఠాక్రే నుంచి వారు కోరుతున్నట్లు తెలిసింది. దీంతో ప్రక్షాళ నను దాదాపు రాజ్ పక్కనబెట్టేసినట్లేనని చెబుతున్నారు. -
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘వై ఫై’ట్..!
సాక్షి, ముంబై: నగరంలో వై ఫై సేవల ప్రారంభంపై శివసేన, మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. మహానగర పాలక సంస్థ(బీఎంసీ) తరఫున శివాజీ పార్క్ మైదానం పరిసరాల్లో వై ఫై సేవలు ప్రారంభిస్తామని గత ఏడాది మేయర్ సునీల్ ప్రభు ప్రకటించారు. కాని ఆ సేవలు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. దీంతో వై ఫై సేవలను తాము ప్రారంభించనున్నట్లు ఎమ్మెన్నెస్ ప్రకటించింది.ఈ మేరకు సన్నాహాలు కూడా ప్రారంభించింది. దీంతో తేరుకున్న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ తాము నగరంలో వై ఫై సేవల కల్పనకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఎమ్మెన్నెస్ నేత రాజ్ ఠాక్రే కొట్టిపారేశారు. నగరవాసులకు వై ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని శివసేన చెప్పి ఏడాది దాటినా ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదని అందుకే తాము ముందుకు వచ్చామని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తున్నట్లు బీఎంసీలోని ఎమ్మెన్నెస్ గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే స్పష్టం చేశారు. దీనిపై సునీల్ ప్రభు మాట్లాడుతూ బీఎంసీ అనుమతి లేకుండా వై ఫై యంత్ర సామగ్రి ఏర్పాటు చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై సందీప్ దేశ్‌పాండేది తొందరపాటు చర్య అని ఆరోపించారు. బీఎంసీ తరఫున త్వరలోనే వై ఫై సేవలు ప్రారంభిస్తామని ప్రకటించారు. -
ఇద్దరు ఠాక్రేలు యుద్ధానికి సిద్ధం
మహారాష్ట్రలో ఠాక్రే కుటుంబం తొలిసారి ముఖాముఖి ఎన్నికల పోరుకు సిద్ధం అవుతోంది. ఆదివారం బాలాసాహెబ్ ఠాక్రే మేనల్లుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, తమ పార్టీ తరఫున తానే ముఖ్యమంత్రినని ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడి 24 గంటలు కాకుండానే శివసేన అధినేత, బాలాసాహెబ్ పుత్రుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ముఖ్యమంత్రి సీటు మీద టవలేశారు. ఉద్ధవ్ ఎన్నికల్లో పోటీచేస్తారని, పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయనేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో బిజెపి-శివసేన కూటమి 42 సీట్లు గెలిచింది. బిజెపికి 23, శివసేనకి 18 సీట్లు వచ్చాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పది చోట్ల పోటీ చేసి, అన్నిటా డిపాజిట్లు కోల్పోయింది. అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత అక్షరాలా నిజమౌతోంది. ఇద్దరు ఠాక్రేల కొట్లాట బిజెపికి చావులా తయారైంది. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కొట్టి, ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవాలన్న బిజెపి ఇప్పుడు ఈ ఇద్దరి కొట్లాటతో ఇరకాటంలో పడింది. మరో వైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోనూ శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్, కూతురు సుప్రియా సులేల మధ్య ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. -
ఎన్నికలకు రెడీ
సాక్షి, ముంబై: మరికొన్ని నెలల్లో నిర్వహించబోయే శాసనసభ ఎన్నికల్లో తను స్వయంగా పోటీ చేస్తానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటించారు. సైన్-పన్వేల్ రహదారిపై ఉన్న సోమయ్య గ్రౌండ్లో శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బహిరంగసభ నిర్వహించారు. ఇందులో ప్రసంగించిన రాజ్ పోటీపై స్వయంగా ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయాన్ని చవిచూడడం తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణను వెల్లడించేందుకు ఆయన ఈ సభ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు. సభలో ఆయన ఏం మాట్లాడుతారనేదానిపై ఎమ్మెన్నెస్ కార్యకర్తలు, ప్రజల్లో ఆసక్తి కనిపించింది. అందరూ ఊహించిన విధంగా ప్రతిపక్ష నాయకులపై ఘాటైన విమర్శలు సంధించలేదు. గతంలో మాదిరిగా తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా సాధారణ ప్రసంగంతోనే సభ ముగించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో భారీగా సీట్లు వచ్చాయని, పెద్ద సంఖ్యలో తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని (పరోక్షంగా శివసేనను లక్ష్యంగా చేసుకుని) కొందరు విర్రవీగుతున్నారు. నరేంద్ర మోడీ వల్లే వారికి గెలుపు సాధ్యమయింది. మోడీ ప్రధాన మంత్రి అయినందుకు మనస్ఫూర్తిగా ఆయనను అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ప్రజలు మోడీ మాట విన్నారు. ఆయన పేరు మీదే ఓటు వేశారు. ఒకవేళ మోడీ లేకుంటే బీజేపీకి మిత్రపక్షంగా (శివసేన పేరు ఉచ్చరించకుండా) ఉన్న పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చేవా..?’ అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఒక్కస్థానం గెలుచుకోకపోవడంతో ఇక పార్టీ జెండా ఎత్తేసినట్లేనని ప్రతిపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే. వీటిపై రాజ్ స్పందిస్తూ ‘ఈ రోజు జరిగిన సభకు హాజరైన భారీ జనాన్ని చూస్తే తెలియడం లేదా...? జెండా ఎత్తేసే పార్టీ అయితే ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చేవారా..?’ అని నిలదీ శారు. ఓటమికి ఎమ్మెన్నెస్ భయపడబోదని, అందరూ పరాజయాల నుంచి నేర్చుకుని పైకి వస్తారని వ్యాఖ్యానించారు. తనకు పరాజయం కొత్త కాదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుంటానని అన్నారు. బంతిని ఎంత వేగంతో నేలపై కొడితే అంతే వేగంతో పెకైగురుతుందని, ఎమ్మెన్నెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడు ఓడినా వచ్చే శాసనసభ ఎన్నికల్లో బంతిలాగే పైకి లేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ ఎన్నిక ద్వారా ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకోవచ్చని, దాని ప్రకారం రాజకీయాల్లో ముందుకు సాగుతామని అన్నారు. నాసిక్‌లో ఓటమిపై స్పం దించారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారంలో ఉంది. అయితే స్థానికంగా అభివృద్ధి పనులు చేయకపోవడం వల్లే ఎమ్మెన్నెస్ పార్టీ అభ్యర్థి గెలవలేకపోయాడని ప్రతి పక్షాల అభ్యర్థులు విమర్శించారు. దీనిపై రాజ్ మాట్లాడుతూ ‘మేం అధికారంలోకి వచ్చి కేవలం రెండు సంవత్సరాలే అయింది. గత 20,30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయని మీరేందుకు నిలదీయరు...? రెండేళ్లలో మేం ఏం చేయగలుతాం.... మమ్మల్నే ఎందుకు లక్ష్యంగా చేస్తారు’ అని విపక్షాలపై మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటువేసిన ప్రజలందరికీ అభినందనలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నందున, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరవ్వాలని రాజ్‌ఠాక్రే పిలుపునిచ్చారు. -
ఎమ్మెన్నెస్ సీఎం అభ్యర్థిగా రాజ్!
సాక్షి, ముంబై: దేశ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని బీజేపీ ప్రమోట్ చేసిన విధంగానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజ్‌ఠాక్రే పేరుకు ప్రచారం కల్పించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించేందుకు యశ్వంత్ చవాన్ ఆడిటోరియంలో గురువారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాజ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును బీజేపీ ప్రకటించినట్టుగా ముఖ్యమంత్రిగా రాజ్‌ఠాక్రేను ప్రకటించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ముందుకు వెళ్లేందుకు ఇదే మంచి మార్గమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేకు తెలియజేస్తామని ఎమ్మెల్యే ప్రవీణ్ దరేకర్ పేర్కొన్నారు. అయితే ఈ సమావేశానికి రాజ్‌ఠాక్రే హాజరుకాలేదు. అందరి దృష్టి మే 31పై... ముంబైలో రాజ్‌ఠాక్రే మే 31వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రిగా రాజ్‌ఠాక్రేను ప్రకటించాలన్న పదాధికారులు, కార్యకర్తల డిమాండ్‌పై ఆయన ఏమి మట్లాడతారన్న దానిపై అనేక మందిలో ఉత్కంఠ కనిపిస్తోంది. దీంతో రాజ్ బహిరంగ సభపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. రాజ్ నిర్ణయంపై ఉత్కంఠ... రాష్ట్ర కీలకనాయకునిగా ఎదిగే దిశగా పయనిస్తున్న రాజ్‌ఠాక్రేకు లోకసభ ఎన్నికల ఫలితాలు ఆందోళనలో పడేశాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పదాధికారులు, కార్యకర్తల కోరికపై అధికారికంగా ప్రకటన వెలుపడుతుందా, లేదా అనేది వేచిచూడాల్సిందే. అయితే గత చరిత్రను పరిశీలిస్తే 2002 సంవత్సరంలో రాజ్‌ఠాక్రే సీఎం పదవి చేపట్టాలని ఉందని చెప్పి రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించారు. అయితే తాజాగా పరిస్థితి ఎలా ఉండనుందనే దానిపై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆయనలోని హుందాతనం, దూకుడు స్వభావం మాట్లాడే శైలి బాల్‌ఠాక్రే మాదిరేనని చె ప్పేవారు ఉన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో శివసేనతో పాటు ఇతర పార్టీల ఆధిపత్యాన్ని అధిగమించుతారని కొందరు వాదిస్తున్నారు. శివసేన ప్రారంభంలో లేవనెత్తిన మరాఠీ కార్డుతో ఎమ్మెన్నెస్ ముందుకు సాగుతోంది. దీనిపై అనేక తర్జనబర్జనలు జరుగుతున్నా ఆయన మాత్రం ఇదే అజెండాతో ముందుకు సాగుతున్నారు. -
31న ముంబైలో రాజ్ బహిరంగసభ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పార్టీ నేతలు, కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే నడుంబిగించారు. ఇందుకోసం ఈ నెల 31న నగరంలోని సోమయ్య మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిద్వారా వారిలో నూతనోత్సాహం నింపాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాభవంతో ఆ పార్టీ పదాధికారులు, అభ్యర్థులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ బహిరంగసభ ద్వారా వారిని ఓదార్చడంతోపాటు మరోసారి బలాన్ని నిరూపించే ప్రయత్నం చేయనున్నారు. ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునివ్వనున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పది స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. అయితే ఏ ఒక్క స్థానంలో గెలవలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులకు లక్షల్లో ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఓడిపోయిన నియోజకవర్గాలలో అత్యధిక శాతం ఎమ్మెన్నెస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారనే ధీమా కనిపించింది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ప్రచార సభల్లో రాజ్‌ఠాక్రే అందరిని విమర్శించి ఎంతో ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. అయినా పరిస్థితులు అనుకూలించలేదు. ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడమే కాకుండా గతసారితో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఎమ్మెన్నెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘రాజ్‌గఢ్’లో అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఎన్నికల ఓటమిపై ఆరా తీశారు. ఓడిపోయిన అభ్యర్థులందరూ సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 31న జరిగే బహిరంగ సభలో ఓటమి ఫలితాలపై విశ్లేషణ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పరాజయం సంఘటనను మర్చిపోయి త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా రాజ్‌ఠాక్రే సాధారణ కార్యకర్త మొదలుకుని పదాధికారులకి మనోధైర్యాన్ని నూరిపోయనున్నారు. ఇదిలాఉండగా పుణేలోని ఖడక్వాస్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ వాంజలే మృతి చెందారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఔరంగాబాద్‌లోని కన్నడ్ ఎమ్మెల్యే హర్షవర్థన్ జాదవ్ ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఎమ్మెన్నెస్‌కు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సదరు 11 శాసనసభ నియోజక వర్గాలలో ఎమ్మెన్నెస్ ప్రాబల్యం తగ్గినట్లు తెలిసింది. దీంతో రాజ్ నేతృత్వంపై అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 31న జరిగే బహిరంగ సభలో రాజ్‌ఠాక్రే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి ఉంది. -
అసెంబ్లీపై రాజ్ గురి
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన షాక్‌తో డీలాపడ్డ మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉబలాటపడుతున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మంచి జోష్ నింపి అనుకూల ఫలితాలు రాబట్టాలనుకుంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్ట పరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 12 స్థానాలను మించి ఎక్కువ స్థాయిలో సీట్లు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్‌గా మారాలని అనుకుంటున్న రాజ్‌ఠాక్రే ప్రజలను తమవైపునకు తిప్పుకునేలా వ్యూహ రచన సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవాన్ని మరిచి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలనుకుంటున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంటుందని, శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరిస్తారన్న ఆశాభావంతో ఉన్న రాజ్‌ఠాక్రే ప్రత్యర్థి పార్టీలకు దీటుగా గట్టి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. శివసేనను చావుదెబ్బ తీయాలని భావించి బొక్కబోర్లా పడ్డ ఎమ్మెన్నెస్ ఈసారి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో అచితూచి అడుగులు వేయాలనుకుంటోంది. మోడీ గాలి బలంగా వీయడంతోనే శివసేన విజయం సాధించిందని అంటున్న రాజ్‌ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలే ఎక్కువ ప్రభావం చూపే అవకాశముండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకుంటామంటున్నారు. మహాకూటమి జోరును తట్టుకొని నిలబడగలిగే సత్తా ఉందని అంటున్న రాజ్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి నుంచి ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకున్నామని, ఇది మా విజయానికి బాటలు పరుస్తుందని ఆశాభావంతో రాజ్ ఉన్నారు. వంద స్థానాలకు శివసేన గురి... లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టిన శివసేన అదే జోరుతో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. వందకుపైగా స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలమైన నేతలెవరూ? ఎవరికి టికెటిస్తే గెలుస్తారు? స్థానిక సామాజిక లెక్కలు ఎలా ఉన్నాయి? వీటన్నింటిని బేరీజు వేసుకుంటోంది. మహాకూట మి అభ్యర్థులకు గణనీయంగా ఓట్లు రావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడింది. అనేకచోట్ల శివసేనతో పోలిస్తే ఎమ్మెన్నెస్ అభ్యర్థులకు తక్కువ ఓట్లు పోలవడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ ఉంటుందని శివసేన అంచనా వేస్తోంది. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలే శివసేనకు చాలా మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 171 స్థానాల్లో పోటీచేసిన శివసేన కేవలం 45 స్థానాలు గెలిచింది. ఇందులో ఎమ్మెన్నెస్ కారణంగా దాదాపు 27 స్థానాల్లో శివసేన ఓడిపోయింది. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సదరు 27 స్థానాల్లో దృష్టిసారిస్తే ఈ ఎన్నికల్లో మహాకూటమికి భారీగా ఓట్లు పోలయ్యాయి. దీంతో మహాకూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కనీసం గతంలో వచ్చిన 12 స్థానాలైనా దక్కుతాయా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
ఎమ్మెన్నెస్, ఆప్‌లకు మొండిచేయి
సాక్షి ముంబై: రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)లకు ప్రజలు మొండిచేయి చూపారు. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు తమ సత్తా చాటుతామని పేర్కొన్న రాజ్ ఠాక్రే పార్టీ ఎమ్మెన్నెస్ కూడా ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్, ఆప్ అభ్యర్థులు ప్రభావం చూపుతారని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అసలు వీరి ప్రభావమే కనిపించలేదు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీల ప్రభావం కూడా ఎక్కడా కానరాలేదు. బోణీ చేయని ఎమ్మెన్నెస్... ముంబైతోపాటు రాష్ట్రంలోని మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎమ్నెన్నెస్ పోటీ చేసింది. గతంలో ఖాతా తెరవలేకపోయినపార్టీకి ఈ సారి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసింది. అయితే ప్రజలు మాత్రం ఎమ్మెన్నెస్‌ను ఆదరించకపోగా కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా గల్లంతైనట్టు సమాచారం. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారంలో ఎమ్మెన్నెస్ ఉన్నప్పటికీ అక్కడ పెద్దగా అభివృద్ధి పనులేవీ చేయలేదని, అన్నిపార్టీల్లాగానే హామిలిచ్చిందనే ఆరోపణలున్నాయి. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో కనిపించిందని కొందరు పేర్కొంటున్నారు. నాసిక్‌లో ఎమ్మెన్నెస్ అభ్యర్థి ప్రదీప్ పవార్ ఎలాంటి ప్రభావం చూపలేదు. మరోవైపు ముంబైలో కూడా బాలానాందగావ్కర్తోపాటు ప్రముఖ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. ఖాతా తెరవని ఆప్... తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ ప్రభావం కూడా కనిపించలేదు. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం కారణంగా కనీసం ఒకటిరెండైనా సీట్లు దక్కుతాయని భావించారు. అయితే ప్రముఖ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా మేథా పాట్కర్, మీరా సాన్యాల్, మయాంక్ గాంధీ, అంజలి దమానియా, విజయ్ పాండరేలు బరిలోకి దిగినా ఉపయోగం లేకుండాపోయింది. -
రోగులకు మంచిరోజులు
సాక్షి, ముంబై: బీఎంసీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు నాణ్యమైన భోజనం అందజేయాలని పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. రోగులకు భోజనం సరఫరా చేసే బాధ్యతలు విలేపార్లేలోని ఇస్కాన్ సంస్థకు అప్పగించింది. ఇప్పటిదాకా బీఎంసీ ఆస్పత్రుల్లోని రోగులకు పరిపాలన విభాగమే భోజనం పంపిణీ చేస్తోంది. ఇక నుంచి ఈ బాధ్యతను ‘ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్’ నిర్వహించనుంది. ఈ బాధ్యతను ఎవరికి అప్పగించాలా? అనే విషయమై మొదట టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్)కు చెందిన గట్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు. కాని అధికారంలో ఉన్న నాయకులు వారి డిమాండ్‌ను పట్టించుకోకుండానే ఇస్కాన్ వైపు మొగ్గు చూపారు. అయితే భోజనం పంపిణీచేసే ఈ పథకాన్ని ముందుగా విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి నుంచి ప్రారంభించనున్నారు. అందుకు రూ.1.97 కోట్లు ఖర్చుకానుంది. ఈ మొత్తంతో ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్.. రోగులకు రెండు పూటల భోజనంతోపాటు టీ, అల్పాహారం అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. పెరిగిన రోగుల సంఖ్య... కూపర్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇక్కడ 636 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గతంలో రోగులకు భోజనం సరఫరా చేయాలంటే బీఎంసీ పరిపాలన విభాగానికి రూ.1.99 కోట్లు ఖర్చయ్యేది. రోగుల సంఖ్య పెరగడంతో వంటశాల సిబ్బంది, వార్డుబాయ్‌ల సంఖ్య కూడా పెంచాల్సి ఉంటుంది. దీని కారణంగా వ్యయం పెరిగే అవకాశముంది. కాని ఇస్కాన్ సంస్థ మాత్రం రూ.1.97 కోట్లకే రెండు పూటల భోజనం, టీ, అల్పాహారం అందజేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో ఇస్కాన్ సంస్థకే కాంట్రాక్టు ఇవ్వాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు మంగళవారం జరిగిన స్థాయి సమితి సమావేశంలో ఆమోదం లభించింది. బీఎంసీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గతంలో మహిళా పొదుపు సంఘాల ద్వారా కిచిడీ పంపిణీ జరిగేది. ప్రస్తుతం దీన్ని కూడా నిలిపివేసి ఇస్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తానీ చెప్పారు. -
తెరపైకి మళ్లీ భూమిపుత్రుల నినాదం
పార్లమెంట్లో మరాఠీయుల ఆత్మగౌరవం వినిపించే ఎంపీనే లేరన్న రాజ్‌ఠాక్రే సాక్షి, ముంబై: పార్టీ స్థాపించిన తొలినాళ్లలో వినిపించిన భూమి పుత్రుల నినాదాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. మరాఠీయుల ఆత్మగౌరవం గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ఏ ఒక్క ఎంపీ కూడా లేరని అన్నారు. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్మెన్నెస్ అభ్యర్థి రాజు పాటిల్‌కు మద్దతుగా కల్వాలోని మనీష్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ప్రచారసభలో రాజ్‌ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వలసవాదులు తలదాచుకునేందుకు ఎంపిక చేసుకుంటున్న ప్రాంతాల్లో ఠాణే జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు ఠాణే పేరు పూర్తిగా చెడగొట్టాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క బిల్డర్‌ను కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పూర్తిగా అడ్డుకట్టవేస్తామని హామీ ఇచ్చారు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో మరాఠీయులు ఆత్మగౌరవం వినిపించేందుకు ఎమ్మెన్నెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చాటింపు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోందని రాజ్‌ఠాక్రే ఆరోపించారు. ఒక్క పుణేలోనే 1.25 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని, దీన్ని ప్రజాస్వామ్యమంటారా..? అని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను గొరంతలు, కొండంతలుగా చూపిస్తున్న హిందీ, ఇంగ్లీష్ చానళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా టీఆర్పీని పెంచుకునేందుకు తన ఇంటర్వ్యూని ఇతర భాషల్లోకి అనువధించి తప్పుగా ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మోడీ దేశానికి కూడా సుపరిపాలన అందించగలరన్న ధీమాను వ్యక్తం చేశారు. అందుకే ఆయన ప్రధాని అయ్యేందుకు మద్దతు పలికామన్నారు. మహారాష్ట్ర గురించి సమగ్ర సమాచారం తెలిసిన మోడీ వస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళుతుందన్నారు. మోడీకి మద్దతు తన వ్యక్తిగత విషయమని, ఇతరులెందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘పీడబ్ల్యూడీ మంత్రి ఛగన్ భుజబల్ పదవీ కాంక్ష ఉంది. అప్పట్లో శరద్ పవార్ పదవి ఎర చూపగానే శివసేన నుంచి ఎన్సీపీకి వెళ్లారు. బాల్‌ఠాక్రేకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోంమంత్రి పదవి రాగానే బాల్‌ఠాక్రేను అరెస్టు చేయాలనుకున్నారు. ఇలాంటి వ్యక్తిని మాతోశ్రీ బంగ్లాకు ఉద్ధవ్‌ఠాక్రే విందుకు ఆహ్వానిం చార’ని అన్నారు. అదే తాను పార్టీని వీడితే బాల్‌ఠాక్రేకు వెన్నుపోటు పొడిచానని ఉద్ధవ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. -
బాహాబాహీ
సాక్షి, ముంబై: నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అభ్యర్థుల వెంట వచ్చిన శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) కార్యకర్తలు పరస్పరంగా దాడులకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. కార్యకర్తలు పరుగులు తీశారు. స్థానిక మింట్ రోడ్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం...దక్షిణ ముంబై లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఓల్డ్ కస్టమ్ హౌస్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఆ సమయంలో సావంత్ వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఎమ్మెన్నెస్‌కు చెందిన అభ్యర్థి ఆదిత్య శిరోడ్కర్ కూడా పార్టీ కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో ఆ గుంపులోంచి కొందరు ముర్దాబాద్ అని నినాదాలు చేశారు. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఇరుపార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. తమ చేతిలో ఉన్న పార్టీ జెండా కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. చేతికందిన వస్తువులను విసురుకున్నారు. రాళ్లు కూడా రువ్వుకున్నారు. పరిస్థితులు చేజారిపోయేలా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో లాఠీలు ఝుళిపించారు. తాత్కాలికంగా అక్కడ పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇరు పార్టీల మధ్య వాతావరణం మాత్రం వేడిగానే ఉంది. ఎమ్మెన్నెస్ గుర్తింపుని రద్దు చేయాలి: శివసేన రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని శివసేన పార్టీ కార్యదర్శి, ఎంపీ అనిల్ దేశాయ్ డిమాండ్ చేశారు. పక్కా ప్రణాళికతో శివసేన కార్యకర్తలపై ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాను కలిసి జరిగిన విషయం తెలిపామని, దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. దేశాయ్ రాళ్లు, నీళ్ల బాటిళ్లు శివసైనికులపై విసిరారని, ఆ తర్వాత పోలీసులు చేసిన లాఠీచార్జిలో మహిళా కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు లేవని తెలిసే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అన్నారు. దక్షిణ ముంబై లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు బయట అరగంటపాటు వేచి ఉన్నామన్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పోలీసుల భద్రత అవసరమని తెలిపారు. రియాల్టీ షోలా ఉంది: ఎన్సీపీ, కాంగ్రెస్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నగరంలోని ఎన్నికల కార్యాలయం ముందు శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ టెలివిజన్ రియాల్టీ షో తరహాలో ఉందని డీఎఫ్ కూటమి పేర్కొంది. అది వారి సిద్ధాంతాలను తెలియచేస్తుందని ఎంపీసీసీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ అన్నారు. కోట్లాడుకోవడం, రాళ్లు విసురుకోవడం వల్లే వారి పార్టీలు ఎలాంటివో అందరికి తెలస్తుందని చెప్పారు. ఠాక్రే సోదరులపై రాష్ట్ర ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జితేంద్ర ఆవాడ్ మండిపడ్డారు. ఆ రెండు పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ వారి సాంస్కృతిని తెలియజేస్తుందన్నారు. -
కాంగ్రెస్ పార్టీ గల్లంతే: రాజ్
పింప్రి, న్యూస్‌లైన్: దేశాన్ని లూఠీ చేసిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్సు గల్లంతవుతుందని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ఠాక్రే జోస్యం చెప్పారు. పుణేలోని డెక్కన్ జింఖానా సమీపంలో సోమవారం సాయంత్రం ఎమ్మెన్నెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ...దేశ ప్రజలు ఇక కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంటి దారి పట్టడం ఖాయమని అన్నారు. దేశంలో సుస్థిర పాలన కావాలంటే ఒక్క నరేంద్ర మోడీవల్లే సాధ్యమని ఉద్ఘాటించారు. గుజరాత్ అభివృద్ధి చూసి ఓటేయ్యాలని మోడీ చెప్పడంలో విశ్వాసం ఉందని, ఆ నమ్మకం, విశ్వాసంతో పనిచేసే చురుకైన ప్రధానే తమకు కావాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకుల కల్లబొల్లి కబుర్లకు ప్రజలు మోసపోవద్దని, వారిచ్చే డబ్బులు పుచ్చుకుని ఓటు మాత్రం విశ్వాసపాత్రుడైన వ్యక్తికే వేయాలని సూచించారు. ‘దేశంలో ైరె తుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వారి సమస్యలు పరిష్కరించే నాధుడే లేడు. అవినీతి ద్వారా కాంగ్రెస్ పేరు ప్రతిష్టలు బాగా పెరిగాయి. అయినప్పటికీ మళ్లీ వారికే టికెటు ఇవ్వడమంటే అవినీతిని మరింత ప్రోత్సహించడమేన’ని దుయ్యబట్టారు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, పుణే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వజిత్ కదం ప్రజలను లూఠీ చేశారని, వీరికి పార్లమెంట్ మెట్లు ఎక్కే అర్హత లేదని అన్నారు. కదం తండ్రి సాంగ్లీ ఎంపీ కావడం, స్థానికేతరుడైన కదంకు పుణే నుంచి అభ్యర్థిత్వం ఇవ్వడమంటే పుణేలో కాంగ్రెస్‌కు అభ్యర్థుల కొరత ఉందని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ అవినీతి భాగోతానికి తెరదించాలంటే ఎమ్మెన్నెస్ అభ్యర్థి దీపక్ పాయ్గుడేను అధిక మెజార్టీతో గెలిపించాలని పుణే ప్రజలకు పిలుపునిచ్చారు. దీపక్‌ని గెలిపిస్తే పుణేని అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని హామీని ఇచ్చారు. ఎమ్మెన్నెస్‌లో చేరిన పలువురు నేతలు ... రాజ్‌ఠాక్రే సమక్షంలో శివసేన ఎంపీ గజానన్ బాబర్, విద్యార్థి సేనా మాజీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు సారంగ్ కమ్లేకర్, నగర శివసేన మాజీ ఉపాధ్యక్షుడు రోమి సంధు, మాజీ కార్పొరేటర్లు ప్రకాశ్ బాబర్, జిల్లా సేన పార్టీ ప్రముఖులు రాందాస్ ధన్వట్, దయానంద్ ఇర్కల్ తదితరులు చేరారు. ఏక్వీర దేవిని దర్శించుకున్న రాజ్‌ఠాక్రే ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ముందు తన ఆరాధ్య దైవమైన లోనావాలా, కార్లా గుహలో ఉన్న ఏక్వీర దేవిని దర్శించుకున్నారు. రాజ్ ఠాక్రే వెంట ఎమ్మెల్యే జయంత్ పాటిల్, మావల్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి లక్ష్మణ్ జగ్తాప్, రమేశ్ కదం, ఎంపీ గజానన్ బాబర్, అమెయ్ బోప్కర్, భాపు బేగడే తదితరులు కూడా వెళ్లారు. -
తేల్చండి
ముంబై: రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)తో ఉన్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే బీజేపీని కోరారు. వాళ్లు కావాలో, మేం కావాలో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగానే మీరు ఇతరుల మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్థులు, పార్టీ ఆఫీస్ బేరర్లతో మంగళవారం సమావేశం అయిన అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ తీసుకునే నిర్ణయాలకు ఎవరూ బాధ్యులో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల గురించి రాజ్‌తో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చర్చలు జరిపిన నేపథ్యంలో అగ్రహాంతో ఉన్న ఉద్ధవ్‌ఠాక్రేను బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పంపిన రాజీవ్ ప్రతాప్ రూడీ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఉద్దవ్ బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్‌ఠాక్రే పేరును ఉచ్ఛరించకుండానే అధికారంలో ఉండేందుకు కొంత మంది ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే, అతని బృంద సభ్యులతో శివసేనకు మంచి సత్సంబంధాలున్నాయని తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులు మధ్యలో దూకి ఆ ఘనతను సొంతం చేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటానికి మద్దతు అవసరమైతే ఎవరినైనా కలుపుకొని పోతారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్, రాజీవ్‌గాంధీ మద్ధతుతో మాజీ ఫ్రధాని చంద్రశేఖర్ మాదిరిగా వ్యవహరిస్తారా అని బీజేపీని నిలదీశారు. ఇంకా అవసరమనుకుంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ అలా జరిగితే కేజ్రీవాల్‌కు, బీజేపీకి ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. హిందూత్వ అంశంపై బీజేపీతో జట్టుకట్టామని, వారు సంక్షోభంలో ఉన్న సమయంలో వారి వెంటే నడిచామని, అయితే బీజేపీ ఇప్పుడు ఎందుకు దారి తప్పుతోందనని ఆయన నిలదీసే ప్రయత్నం చేశారు. రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పొత్తుపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడతానని అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతామని, అయితే లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్న ఉద్ధవ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెళ్లారు. నమ్మకమైన మిత్రపక్షంగానే శివసేనను ఎప్పుడూ బీజేపీ చూస్తుందని ఒప్పించానని ఉద్ధవ్‌తో భేటీ అనంతరం ఫడ్నవిస్ మీడియాకు తెలిపారు. డర్మీ రేసు మొదలైంది సాక్షి, ముంబై: ఎన్డీఏ కూటమి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చేందుకు డర్బీ రేస్ మొదలైందని సామ్నా సంపాదకీయంలో రాజ్‌ఠాక్రే తీరును విమర్శించారు. మోడీని తప్పుబట్టిన వారే నేడు అడగకుండానే మద్దతు ప్రకటిస్తున్నారని రాజ్‌ఠాక్రేకు చురకలంటించారు. శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమానీ పార్టీల మహాకూటమిలో చిచ్చుపెట్టేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శివసేన-బీజేపీల బంధం చాలా ఏళ్ల నుంచి ఉందని, తమల్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ‘హిందూత్వం అంశంపై శివసేన, బీజేపీలు ఒక్కటయ్యాయి. ఈ కూటమిని విడగొట్టేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. హిందువుల ఓట్లు చీల్చి లబ్ధిపొందాలని భావిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో కుటుంబాల్లో కూడా కలహాలు పెట్టార’ని ఉద్ధవ్ ఆరోపించారు. అయినా మహాకూటమికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. అనేక విషయాలపై విభేదాలు వచ్చినా పొత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. మోడీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. తెరపైకి మూడో ఫ్రంట్ ముంబై: రాష్ట్రంలో మూడో కూటమి ఏర్పాటుకు సన్నాహలు మొదలయ్యాయి. ఎన్డీఏలోకి ఎమ్మెన్నెస్ రాకను శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చిన్నచితక పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఎదగాలని రాజ్‌ఠాక్రే భావిస్తున్నారని ఊహగానాలు వస్తున్నాయి. ఈ మేరకు పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ), జనసూర్య శక్తి పార్టీ, జయంత్ పాటిల్, వినయ్ కోరే, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అపూర్వ హిరాయ్ చర్చలు జరిపారు. ఈ విషయాన్ని పీడబ్ల్యూపీ నాయకుడు ఎస్వీ దేశ్‌ముఖ్ మంగళవారం మీడియాకు తెలిపారు. మా సిద్ధాంతాలు విభిన్నంగా ఉన్నా, రెండు అంశాల్లో మాత్రం ఒకే విధంగా ఉన్నామని వివరించారు. ఎమ్మెన్నెస్ ఏజెండాలో ఉన్న రాష్ట్ర అభివృద్ధితో పాటు మరాఠీయులకు ప్రాధాన్యత విషయాలు కూడా తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దీనిపై జయంత్ పాటిల్ మరోకసారి రాజ్‌తో ఏటీ అవుతారన్నారు. రాయ్‌గఢ్, మావల్, కొల్హాపూర్‌తో పాటు లాతూర్, ఉస్మానాబాద్ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. -
శివాలెత్తిస్తా
శివసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను దింపుతామని రాజ్‌ఠాక్రే ప్రకటన సాక్షి, ముంబై: రాజ్‌కీయం మొదలైంది. పెదనాన్న బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీయే లక్ష్యంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే లోక్‌సభ కదనరంగంలోకి దూకుతామని ప్రకటించారు. ఠాణేలోని షణ్ముఖానందహాల్ లో ఆదివారం ఉదయం ఆ పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాకూటమిలోని బీజేపీ పోటీచేసే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు మద్దతిస్తామని సభాముఖంగా ప్రకటించి కాషాయ కూటమిలోనే కలకలం రేపారు. బీజేపీతో మైత్రికి సై అంటూనే, దాని మిత్రపక్షమైన శివసేనతో రాజ్ ఆడుతున్న రాజకీయ చదరంగం ఎటువైపు మలుపులు తిరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగేలా చేయడంలో సఫలీకృతమయ్యారు. అయితే గతంలో మాదిరిగానే ఈసారీ మరాఠీ ఓటర్లు తమవైపు వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్న రాజ్‌ఠాక్రే ఇలా బహిరంగంగా శివసేనను లక్ష్యంగా చేసుకొని దూకుడు పెం చడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందోనన్న మీమాంస ఆ పార్టీలోనూ కనబడుతోంది. కావాలనే శివసేన పార్టీని లక్ష్యంగా చేసుకొని రాజ్‌ఠాక్రే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజల్లోకి శివసైనికు లు తీసుకెళ్లగలిగితే ఎమ్మెన్నెస్ పార్టీకి కొంతలో కొంతైనా దెబ్బతీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరాఠీ ఓటర్ల లో గట్టి పట్టున్న శివసేన పార్టీని కూకటి వేళ్లతో పెకలించడం అంత సులభం కాదని అంటున్నారు. బాల్‌ఠాక్రే మరణానంతరం శివసేన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్‌ఠాక్రే ఈసారి ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో ‘మహా’ కూటమిని గెలిపిం చాలన్న కసితో ఉన్నారు. అయితే గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థులను బరిలోకి దింపొద్దని మహాకూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాజ్‌ఠాక్రేను కోరింది. దీనిపై ఉద్ధవ్‌ఠాక్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాజ్‌ఠాక్రే నిర్ణయం మహా కూటమిలోనూ భేదాభిప్రాయాలకు దారి తీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరింత వైరం... రాజ్‌ఠాక్రే తాజా ప్రకటనతో శివసేన వర్గాల్లో గుబు లు మొదలైంది. బీజేపీ అభ్యర్థులు పోటీచేసే నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను బరిలోకి దింపబోమని రాజ్ స్పష్టం చేసి సోదరుడితో మరింత వైరం పెంచుకున్నారు. గతంలో ఠాక్రే సోదరుల మధ్య పెరిగిన వైరాన్ని, దూరాన్ని తగ్గించేందుకు అనేక మంది దిగ్గజాలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. చివరకు బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఇద్దరూ ఒకటవుతారని అందరూ భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. తాజాగా రాజ్ చేసిన ప్రకటన ఠాక్రేల మధ్య మరింత దూరాన్ని పెంచేదిగా ఉంది. ఇది సేనా నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శివసేనపై లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. దీంతో శివసేన భవిత అంధకారంలో పడిపోయింది. కాగా, శివసేన, బీజేపీ, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) నేతృత్వంలోని మహాకూటమిలోకి ఇటీవల స్వాభిమాని శేత్కరి సంఘటన అధ్యక్షుడు, కొల్హాపూర్ ఎంపీ రాజు శెట్టి చేరారు. దీంతో మహా కూటమి మరింత బలపడిందని భావిస్తున్న తరుణంలో రాజ్ ఠాక్రే నిర్ణయం పరోక్షంగా దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహాకూటమి లో శివసేన, బీజేపీ ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకా రం శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. గతంలో కూడా ఇదే ఫార్ములాను అవలంభిం చారు. ఆ ప్రకారం ఒక టర్మ్ శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ ఇప్పు డు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెన్నెస్ వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై కూడా పడే అవకాశముంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నిక ల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తే ఒప్పందం ప్రకా రం శివసేన నుంచి ముఖ్యమంత్రి పీఠం చేజారిపోవడం ఖాయం. మూడు పర్యాయాలుగా రాష్ట్రా న్ని ఏలుతున్న కాంగ్రెస్‌ను ఈసారి ఎలాగైనా గద్దె దింపి, అసెంబ్లీ భవనంపై కాషాయ జెండా రెపరెపలాండించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న శివసేనకు రాజ్ కారణంగా చివరకు నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మోడీకి జై కొట్టిన రాజ్ థాకరే
ముంబై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) మద్దతు ప్రకటించింది. అత్యున్నత పదవి రేసులో నిలిచిన మోడీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరే తెలిపారు. ప్రధాని పదవికి మోడీ అన్నివిధాలా అర్హుడన్నారు. రానున్నలోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. మోడీకి మద్దతు తెలిపినందుకు రాజ్ థాకరేకు బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థులకు కూడా మద్దతు పలకాలని ఆయన కోరారు. శివసేనతో తమ సంబంధాలు బలంగా ఉన్నాయని తెలిపారు. బీజేపీ-శివసేన కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తాయని గడ్కరీ స్పష్టం చేశారు. -
రాజ్‌కీయం?!
ఎమ్మెన్నెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో తేలనున్న అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వైఖరి ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఏం చేయనున్నారు..? బీజేపీ అగ్రనేతల ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా? అభ్యర్థులను ప్రకటించకుండా పరోక్షంగా ‘మహా’ కూటమికి సహకరించేందుకు సిద్ధమయ్యారా? లేకపోతే అభ్యర్థులను బరిలోకి దింపుతానని ప్రకటిస్తారా? అసలు రాజ్ నిర్ణయం ఎలా ఉండోబోతోంది? అసలు ఏం చేయబోతున్నారో? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారంనాడు జరగనున్న ఎమ్మెన్నెస్ పార్టీ ఎనిమిదో వార్షికోత్సవంలో రాజ్‌ఠాక్రే దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ ఉపాధ్యక్షుడు వాగీశ్ సరస్వత్ శనివారం మీడియాకు తెలిపారు. ‘మాది రాజకీయ పార్టీ. అన్ని ఎన్నికలు మాకు ప్రధానమే. తమ పార్టీ కొంతమందికి మిత్ర మండల్ కాద’న్నారు. ఇప్పటికే రాజ్‌ఠాక్రేతో భేటీ గురించి బీజేపీ నాయకులు మీడియాకు వివరించారని తెలిపారు. అయితే ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధతిపై ఇప్పటికే రాజ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఆఫీస్ బేరర్లతో చర్చించారన్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. కాగా, కొన్ని రోజుల క్రితం బీజేపీ నేతలు నితిన్ గడ్కారీ, వినోద్ తావ్డే, ముంబై బీజేపీ అధ్యక్షుడు అశీష్ షెలార్‌లు రాజ్‌ఠాక్రేను కలిసి లోక్‌సభకు అభ్యర్థులను బరిలోకి దింపవద్దని కోరారు. గతంలో జరిగిన అనుభవం దృష్ట్యా ఈసారి కాంగ్రెస్ కూటమిని దెబ్బకొట్టాలంటే పోటీకి దింపకపోవడమే మంచిదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అవసరమనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరిస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఈ నెల 20న జరగనున్న విధాన మండలి ఎన్నికల్లో బీజేపీకి 12 మంది ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు మద్దతును కూడా ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఇదిలావుండగా 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ 12 లోక్‌సభ స్థానాలకు పోటీచేసింది. ముంబైలోని అన్ని స్థానాలతో పాటు ఠాణే, నాసిక్, పుణేలో బరిలోకి దిగిన ఎమెన్నెస్ అభ్యర్థులకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లను గెలుచుకుంది. మరాఠీ ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి లబ్ధి చేకూరేలా వ్యవహరించిందని అప్పట్లో కాషాయకూటమి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏర్పాట్లు పూర్తి... ముంబైలో జరిగే పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవానికి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. -
మూడో కూటమి!?
సాక్షి, ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమికి, శివసేన, బీజేపీ, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) నేతృత్వంలోని మహాకూటమికి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే నివాసమైన కృష్ణకుంజ్లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో జనసురాజ్య పార్టీ, పీడబ్ల్యూపీ, ఇతర పార్టీల నాయకులు దాదాపు గంటకుపైగా రాజ్ ఠాక్రేతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలాఉండగా బీజేపీ నాయకుడు నితిన్ గడ్కారి ఇటీవల రాజ్‌తో భేటీ కావడం, లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేయకూడదని, ఒకవేళ పోటీచేస్తే సాధ్యమైనంత తక్కువ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాలని విజ్ఞప్తి చేయడం తె లిసిందే. దీనిపై రాజ్ ఎలా స్పందిస్తారనే దానిపై ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు అటు వివిధ పార్టీ నాయకుల్లో ఇదివరకే ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీపై విభిన్న కథనాలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పీడబ్ల్యూపీకి చెందిన జయంత్ పాటిల్, జన సురాజ్య పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి వినయ్, అపూర్వ హిరే తదితర నాయకులు రాజ్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల అనంతరం జనసురాజ్య పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి వినయ్ కోరే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఎన్సీపీ (డీఎఫ్) కూటమి అవినీతి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారని, దీంతో ప్రజలు డీఎఫ్, కాషాయ మహాకూటమికి ప్రత్యామ్నాయ పార్టీ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. దీంతో ఇరు కూటములకు దీటుగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రాథమికంగా చర్చించినట్లు కోరే వివరించారు. మూడో ఫ్రంట్‌లోకి మరికొన్ని పార్టీలు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వాటి పేర్లు సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు. కాగా, ఈ కూటమి ఏర్పాటు సాకారమైతే డీఎఫ్, కాషాయ కూటములకు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గెలుపుగుర్రాల కోసం ఎమ్మెన్నెస్ వేట..
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కొత్త అభ్యర్థులకే ప్రాధ్యాన్యత ఇవ్వాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే యోచిస్తున్నారు. దీంతో లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువ ఉన్న కొత్త అభ్యర్థులతోపాటు సామాజిక రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న అభ్యర్థుల వేటలో పడ్డారు. అందులో భాగంగా రాజ్ ఠాక్రే జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. అక్కడి రాజకీయ వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ప్రత్యర్థి ఎవరూ, తమ పార్టీ నుంచి ఎవరికి అభ్యర్థిత్వం ఇస్తే ఫలితాలెలా ఉంటాయనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఉత్తర ముంబై నుంచి ఎమ్మెల్యే ప్రవీణ్ దరేకర్, ఈశాన్య ముంబై, దక్షిణ ముంబై నుంచి రామ్ కదం, బాలానాంద్గావ్కర్ను పోటీ చేయాలని రాజ్ ఠాక్రే చెప్పనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 16 నుంచి 18 స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం కొత్త వారికే ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్ యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ జాబితాయే తరువాయి.. నాగపూర్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో బీజేపీ, ఎన్సీపీ, ఆప్ వంటి పార్టీలు విదర్భలో తమ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఇంకా జాబితా విడుదలలో ఊగిసలాడుతోంది. ఈ రీజియన్‌లో ఉన్న 10 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా ఆయా పార్టీలు ప్రచారంలో ముందుకు దూసుకుపోతుండగా కాంగ్రెస్ కార్యకర్తల్లో మాత్రం నైరాశ్యం కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఈ ప్రాంతంలో ఇప్పటికే గుర్తింపు పొందిన నాయకులే అభ్యర్థులుగా ఉంటారనేది తెలిసిందే అయినా ఆ పార్టీ జాబితా విడుదల చేస్తేనే వారు ఎవరనేది స్పష్టమవుతుందని కార్యకర్తలు అంటున్నారు. ఇతర పార్టీల విషయానికి వస్తే.. బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ఎన్సీపీ నుంచి కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు కాగా బీజేపీ నుంచి నవ్‌నీత్ కౌర్ రాణా (అమరావతి), కృష్ణారావు ఇంగిల్ (బుల్ధానా) పేర్లు వినిపించడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, గోండియా- భండారా నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేయనున్న ప్రఫుల్ పాటిల్‌కు బీజేపీ అభ్యర్థి నానా పటోల్, ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ మిశ్రా రూపంలో ప్రమాదం పొంచి ఉంది. నాగపూర్‌లో నితిన్ గడ్కరీకి సైతం విజయం అంత సులభం కాకపోవచ్చు. ఇక్కడ నుంచి గత ఏడు పర్యాయాలుగా ఎంపీగా కొనసాగుతున్న విలాస్ముత్తెంవార్తోపాటు ఆప్ అభ్యర్థి అంజలీ దమనియా నుంచి గట్టిపోటీ ఎదుర్కోక తప్పదు. శివసేనకు పెట్టనికోటగా ఉన్న బుల్ధానా నియోజకవర్గంలో పాగా వేసేందుకు కృష్ణారావు ఇంగిల్కు ఎన్సీపీ ఇక్కడ టికెట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా చంద్రపూర్నుంచి ఆప్ అభ్యర్థిగా నిలబడుతున్న సమాజ సేవకుడు వామన్‌రావు చాతప్ విదర్భ ఉద్యమంలో భాగంగా నగరంలో గత ఏడాది నిర్వహించిన విదర్భ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా పాత్ర పోషించాడు. అలాగే ఆప్ అమరావతి అభ్యర్థిగా ప్రకటించిన భావ్నా వాస్నిక్ స్థానిక కళాశాలలో ప్రొఫెసర్గాపనిచేస్తున్నారు. -
ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి
ముంబై: నగరవాసుల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషిచేస్తోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఆయన బుధవారం ఎలివేటెడ్ రోడ్డును ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘ ఈ 2.2 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇకపై పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హై వే నుంచి నేరుగా అంధేరీలోని ఛత్రపతి శివాజీ (సహార్) అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-2కు ముంబైకర్లు నేరుగా చేరుకోవచ్చు’నని అన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఇటీవల ఈస్టర్న్ ఫ్రీవేను, తర్వాత టెర్మినల్-2ను ప్రారంభించిందని, ఇప్పుడు ఎలివేటెడ్ రోడ్డు సేవలను అందజేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు వల్ల సుమారు 30 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుందని ఆయన వివరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) సంయుక్తంగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాయని సీఎం చెప్పారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ పనులను వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. అలాగే శాంతాక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డుపై మరో రెండు, మూడు వారాల్లో వాహనాల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే కొలాబా-సీప్జ్ మధ్య మూడో మెట్రో పనులను సైతం త్వరలోనే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. -
రాస్తారోకో ప్రశాంతం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ అంశంపై చేపట్టిన రాస్తారోకో ఆందోళన చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. వాహనాల ధ్వంసం చేయలేదు. అయితే రాస్తారోకోలో వాహనాల టైర్లలో గాలి తీయడం, నిప్పంటించిన టైర్లను రోడ్లపై పడేయడం తదితర సంఘటనలు మాత్రం చోటుచేసుకున్నాయి. అయితే ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అయితే కొన్ని రహదారులపై మాత్రం ట్రాఫిక్ స్తంభించింది. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త వాతవరణం మధ్య ప్రజలు గడిపారు. ఎప్పుడు ఏమీ జరగతుందోనని పలువురు భయాందోళనలకు గురయ్యారు. కేవలం నాలుగు గంటల్లోనే రాస్తారోకో ఆందోళనను విరమించినట్టు రాజ్‌ఠాక్రే ప్రకటించడంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తన నివాసం కృష్ణకుంజ్ నుంచి వాషీ టోల్‌నాకా వద్ద ఆందోళనకు నేతృత్వం వహించేందుకు బయలుదేరిన సుమారు 15 నిమిషాల్లోనే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతవరణం కనిపించింది. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్సీఎఫ్ పోలీసు స్టేషన్ తీసుకువెళ్లారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్లో మాట్లాడి చర్చలకు రమ్మని పిలిచారు. దీనికి రాజ్‌ఠాక్రే కూడా అంగీకరించడంతో టోల్ ఆందోళనకు తెరపడింది. సుమారు ఒంటిగంట ప్రాంతంలో రాజ్‌ఠాక్రేను ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు విడుదల చేశారు. ఉద్రిక్తత మధ్య.... రాష్ట్రంలో ఎమ్మెన్నెస్ పార్టీ రాస్తారోకో ఆందోళన నిర్వహిస్తున్నట్టు ముందుగానే ప్రకటించడంతో బుధవారం ఉదయం నుంచి కొంత ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ముంబైతోపాటు ఠాణే, పుణే, నాసిక్, ఔరంగాబాద్ మొదలగు ప్రాంతాలతోపాటు ఎమ్మెన్నెస్ పట్టున్న ప్రాంతాల్లో కొంత ప్రభావం కనిపించింది. రోడ్డు మార్గాల మీదుగా వెళ్లాల్సి వచ్చినవారు తొమ్మిది గంటలలోపే టోల్నాకాలను దాటేందుకు ప్రయత్నించారు. ముంబై ఈస్టర్న్, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలపై ముంబైకి విధులకు వచ్చేవారు కొంత ముందుగానే బయలుదేరడంతో ట్రాఫిక్ అధికంగా కనిపించింది. అయితే 8.30 గంటల నుంచి ఎమ్మెన్నెస్ కార్యకర్తలు టోల్‌నాకాల వద్దకి చేరుకోవడం ప్రారంభమైంది. 8.45 గంటలకే పలురోడ్లు బోసిపోయాయి. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవే పై ఖండాలా బోర్ ఘాట్ వద్ద ఎమ్మెన్నెస్ మద్దతుదారులు కంటెయినర్ టైర్లలో గాలీతీసేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రాష్ట్రంలోని టోల్ వసూలు చేస్తున్న అనేక రహదారులపై ఎమ్మెన్నెస్ కార్యకర్తలు చేరుకుని రాస్తారోకో చేశారు. అయితే అప్పటికీ అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నవీముంబైలోని వాషీ టోల్నాకాకు రాజ్‌ఠాక్రే రానుండడంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ట్రాన్స్పోర్ట్ బస్సులను రోడ్డుపక్కన నిలిపారు. శాంతిభద్రతలకు విఘాతానికి దారి తీసేలా ఉందనగానే పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అ బస్సుల్లోకి ఎక్కించారు. భయాందోళనలకు గురైన ప్రజలు... రాజ్‌ఠాక్రేను పోలీసుల అదుపులోకి తీసుకున్న అనంతరం అనేక ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేశారు. గతంలో రాజ్‌ఠాక్రేను అరెస్టు చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాంటిదేమైనా జరగవచ్చని అనేక మంది ఆందోళన చెందారు. అయితే ఎమ్మెన్నెస్ కార్యకర్తలు మాత్రం ఈసారి శాంతియుతంగా ఆందోళన చేశారు. రాజ్‌ఠాక్రేను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన అనంతరం మాత్రం నిరసనలు తీవ్రం చేసినా దాడులకు దిగలేదు. ఉదయం తొమ్మిది గంటలలోపే రాజ్‌ఠాక్రేను ఆయన నివాసం కృష్ణకుంజ్లోనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించారు. అయితే అప్పటికే కృష్ణకుంజ్కి భారీ ఎత్తున ఎమ్మెన్నెస్ కార్యకర్తలు చేరుకోవడంతో మార్గంమధ్యలో అదుపులోకి తీసుకోవాలని పథకం పన్నారు. దీని ప్రకారమే రాజ్‌ఠాక్రే ఇంటి నుంచి 10 గంటలకు బయలుదేరగానే సైన్ చూనబట్టి వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయనతోపాటు ఉన్న ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు, బాలా నాందగావ్కర్, నితిన్ సర్దేశాయిలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు 15 నిమిషాల అనంతరం రాజ్‌ఠాక్రే కారు నుంచి దిగడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అయితే వారిని శాంతపరిచిన రాజ్‌ఠాక్రే పోలీసు వ్యాన్లోకెళ్లి కూర్చున్నాడు. అనంతరం ఆయనను ఆర్సీఎఫ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో రాజ్‌ఠాక్రే భార్య షర్మిలా ఠాక్రే, కుమారుడు అమిత్ ఠాక్రే పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సుమారు ఒంటిగంటకు రాజ్‌ఠాక్రేను వదిలి పెట్టారు. కాగా ‘మేము అనుకున్నది సాధిం చాం. ముఖ్మమంత్రి అన్ని విషయాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ ఆందోళన ఇంతటితో నిలిపివేస్తున్నామ’ని ఠాక్రే ప్రకటించారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో మూసివేసిన దుకాణాలను మళ్లీ తెరిచారు. ముఖ్యమంత్రితో నేడు చర్చలు... ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎట్టకేలకు అన్ని విషయాలను అమోదించి చర్చలకు పిలిచారని రాజ్‌ఠాక్రే తెలిపారు. ఆర్సీఎఫ్ పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో సీఎంతో టోల్ అంశంపై చర్చలు జరగనున్నట్టు తెలిపారు. దీంతో తాము టోల్ అంశంపై చేపట్టిన ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు. రాజ్‌ఠాక్రేపై ప్రత్యర్థుల విమర్శలు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) చేపట్టిన ఆందోళనపై ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీలు ఆడించిన నాటకమని శివసేన,, ఎన్నికలకు ముందుగా పబ్లిసిటీ కోసం రాజ్‌ఠాక్రే చేస్తున్న స్టంట్ అని ఎన్సీపీ ఆరోపిస్తోంది. ‘ముందు నుంచి ముఖ్యమంత్రితోపాటు ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ చర్చలకు రావాలని కోరినా ఆందోళనకు దిగారు. మంగళవారం కూడా చర్చలకు రావాలని ఫోన్ వచ్చినట్టు రాజ్‌ఠాక్రేనే మీడియాకు తెలిపారు. అయితే ఆందోళన చేసి ఇలా నాలుగు గంటల్లోనే విరమిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా సాధించేందేమిట’ని ఎన్సీపీ అధికారప్రతినిధి నవాబ్ మల్లిక్ ప్రశ్నించారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజ్‌ఠాక్రే, ఎమ్మెన్నెస్లపై పరోక్షంగా చురక లంటించారు. ప్రజల శ్రేయస్సు కోసమని చెప్పుకుని కొందరు ఎన్నికల ముందు లబ్ధిపొందేందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం చేసే ఆందోళనలు ఇలా గే ఉంటాయని ఎద్దేవాచేశారు. ‘ఆందోళనతో జనజీవనంపై ఎలాం టి ప్రభావం పడలేదు. దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేద’ని శివసేన ఎంపీ సంజయ్ రావత్ అన్నారు. -
దూకుడే
సాక్షి, ముంబై: టోల్ విధానంలో పారదర్శకత తీసుకురావాలన్న డిమాండ్‌తో తాము బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రాస్తారోకో ఉంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. పోలీసులు పంపిన నోటీసులకు తాను బెదరనని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం సాయంత్రం రాజ్‌ఠాక్రే నివాసం కృష్ణకుంజ్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాష్ట్రంలోని హైవేలన్నింటిపై తమ పార్టీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగుతారన్నారు. ఈ ఆందోళనలో భాగంగా నవీముంబైలోని వాషీ టోల్‌నాకా వద్ద జరిగే రాస్తారోకోలో తాను పాల్గొంటానని చెప్పారు. అయితే తాను ఆందోళనకు పిలుపునిచ్చిన అనంతరం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అయితే వారిని ఎలా నమ్మేదని ప్రశ్నించారు. మరోవైపు గతంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, ఫలితం మాత్రం శూన్యమన్నారు. నిజంగా ప్రభుత్వం టోల్ సమస్యను పరిష్కరించాలని భావిస్తే ఒక గడువు ఇచ్చి ఓ ప్రణాళిక రూపొందించాలని, కేవలం చర్చలు జరిపితే లాభం లేదన్నారు. తాము చర్చలకు వచ్చినప్పుడు తమ వెంట కొందరు విలేకరులను కూడా అనుమతించాలని ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. ‘ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఏదో గూడు పుఠాణి, ఒప్పందం కుదిరింది.. ఇలా రకరకాలుగా పుకార్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే చర్చల సమయంలో విలేకరులను కూడా అనుమతించాలని కోరామ’ని రాజ్‌ఠాక్రే వివరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు.... రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్నందున నగరాలు, పట్టణాల్లోని జనజీవనంపై ప్రభావం కలగకుండా ఆందోళన చేయాలని ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు సూచించానని రాజ్‌ఠాక్రే చెప్పారు. కేవలం నిరసన తెలిపేందుకే తాము ఈ ఆందోళన చేస్తున్నామన్నారు. మరోవైపు 13 రకాల పన్నులతోపాటు టోల్ వసూలు చేస్తున్నారని, వీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులు మౌలిక సదుపాయాల కోసం కాకుండా ఎన్నికల నిధి కోసమే కలెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 21న ర్యాలీ... రాస్తారోకో ఆందోళన అనంతరం ఈ నెల 21వ తేదీన ముంబై గిర్గావ్ నుంచి మంత్రాలయం వరకు మహార్యాలీ నిర్వహిస్తామని రాజ్‌ఠాక్రే ప్రకటించారు. రాస్తారోకో ఆందోళన అనంతరం కూడా ప్రయోజనం లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాకపోతే మాత్రం ఇక ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెన్నెస్ పార్టీ తనదైన శైలిలో ఆందోళనకు దిగుతుందన్నారు. సీఎంకు సీట్ల పంపకాలే ముఖ్యం... రాష్ట్రవ్యాప్తంగా సమస్యగా మారిన టోల్ అంశంపై చర్చలు జరపడంకంటే సీట్ల పంపకాలపైనే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి చూపుతున్నారని రాజ్‌ఠాక్రే ఆరోపించారు. ఈ సమస్యకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అయితే ఢిల్లీలో సీట్ల పంపకాల కోసం మాత్రం సమయం ఉందని ఎద్దేవా చేశారు. పోలీసు బందోబస్తు ఎమ్మెన్నెస్ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికోసం సిబ్బంది సెలవులు కూడా రద్దు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతోపాటు ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు పంపించారు. కాగా, రాజ్ ఠాక్రేకు శివాజీపార్క్ పోలీసు స్టేషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఆందోళన హింసాత్మకంగా మారితే దీనికి బాధ్యత మీదే ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు కూడా కొంత ఆయోమయంలో ఉన్నారు. దీంతో బుధవారం ఏమి జరగనుందనే విషయంపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. -
రాజ్‌ఠాక్రేపై కేసు
ముంబై: హింసను ప్రేరేపించేలా ప్రయత్నించిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేపై పుణే రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టోల్ రుసుం కట్టొద్దంటూ, బలవంతం చేస్తే వారిని ఎదురించాలంటూ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా రాజ్‌ఠాక్రే ప్రసగించడం, ఆ వెంటనే రాష్ట్రవ్యాప్తంగా టోల్‌ప్లాజాలపై దాడులు జరగడం చకచక జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర సర్కార్రాజ్ఠాక్రేపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇప్పటికే సీఎం పృథ్వీరాజ్ చవాన్, హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఈ మేరకు సంకేతాలను కూడా ఇచ్చారు. టోల్ రుసుం కట్టని రాజ్‌ఠాక్రే: ముంబై నుంచిcకు వచ్చే రహదారుల్లో ఉన్న వాషి, ఉర్సే, తలేగావ్ టోల్‌ప్లాజాల వద్ద రాజ్‌ఠాక్రే టోల్‌రుసుం కట్టలేదు. అక్కడి టోల్ సిబ్బంది కొన్ని నిమిషాల పాటు ఆపినా తాను అన్నమాటకే రాజ్‌ఠాక్రే కట్డుబడ్డారు. టోల్ రుసుం కట్టకుండానే తన వాహనంలో పుణే చేరుకున్నారు. శుక్రవారం నుంచి ఇక్కడ జరగనున్న పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ‘టోల్ ఎత్తివేత గుజరాత్లో చేసి చూపండి’: అధికారంలోకి వస్తే రాష్ట్రంలో టోల్ రుసుం ఎత్తివేస్తామని చెబుతున్న బీజేపీ, శివసేన కూటమి మొదటగా పొరుగు రాష్ట్రమైన గుజరాత్లో ఆ పని చేసి చూపించాలని ఎన్సీపీ పార్టీ సవాల్ విసిరింది. ఇంకా ఎన్నికల కోడ్ అమల్లోకి రాలేదని, ఆ లోపే గుజరాత్లో అమలు చేసి చూపించాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం డిమాండ్ చేశారు. టోల్‌ప్లాజాలో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ సర్కార్‌పై ఒత్తిడి తెస్తుందన్నారు. -
పొలిటి‘కలరింగ్’
సాక్షి, ముంబై: ‘గత అనేక సంవత్సరాల నుంచి టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకొని రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ ఆకస్మాత్తుగా ఈ టోల్ ఏంటి బాబో అని మొత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకర్షించేందుకు రాజకీయ స్టంట్లు రాజ్‌ఠాక్రే ప్రారంభించార’ని స్వాభిమాన్ సంఘటన అధ్యక్షుడు నీలేష్ రాణే ఆరోపించారు. ఇన్నాళ్లు గప్‌చుప్‌గా ఉన్న రాజ్‌ఠాక్రే ఒక్కసారి పూనకమొచ్చినట్టు మాట్లాడి ఎమ్మెన్నెస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి టోల్‌ప్లాజాలపై దాడులకు దిగేట్లు చేయడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. కేవలం 12 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ఇలా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ అంశాన్ని విధాన సభలో లేవనె త్తడానికి కూడా అవకాశముండేదని, అయితే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇంత నాటకం ఆడాల్సిన అవసరమేమొచ్చిందని నీలేశ్ రాణే ప్రశ్నించారు. లోక్‌సత్తా డాట్‌కామ్‌కు పోస్టుల వెల్లువ... మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా టోల్ ప్లాజాలపై దాడులకు దిగారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ కొందరు, తగిన శాస్తి చేశారని మెచ్చుకుంటూ మరికొందరు వెబ్సైట్లలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. దాడుల ఘటన తర్వాత లోక్‌సత్తా డాట్ కామ్‌లో మరాఠీలో అనేక మంది తమతమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజ్ ఇలా దూకుడుగా వ్యవహరించడం ఎన్నికల స్టంట్ అని కొంతమంది వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. మరికొందరు వాహనదారుల నుంచి అడ్డూ అదుపులేకుండా డబ్బులు వసూలు చేస్తున్న టోల్ ప్లాజాల ఆగడాలకు కళ్లెం వేయాలంటే ఇలాంటి రాజకీయ పార్టీలు అవసరమని, అందుకు ధన్యవాదాలంటూ మరికొంత మంది పోస్ట్ చేశారు. రోడ్ల నిర్వహణకు అయ్యే ఖర్చులు రాజ్‌ఠాక్రే సొంతంగా భరించి రాష్ట్ర ప్రజలకు టోల్ నుంచి విముక్తి కల్పించాలని, ముంబైలోని సేనా భవన్ ఎదురుగా నిర్మిస్తున్న టవర్‌ను ప్రజలకు ఉచితంగా వాడుకునేందుకు ఇవ్వాలని మరికొందరు రాశారు. ఎమ్మెన్నెస్ ఇలాంటి చిల్లర వేషాలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘అవినీతిలో కూరుకుపోయిన అధికార డీఎఫ్ కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో టోల్‌ప్లాజాలను మూసివేయదు. ఈ ప్రభుత్వాలకు బుద్దిచెప్పాలంటే ఎమ్మెన్నెస్ లాంటి దూకుడు పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంద’ని హేమంత్ అభిప్రాయపడ్డారు. ‘ఒక విధంగా ఇది మంచికే జరిగింది. టోల్ పేరుతో కోట్ల రూపాయలు వసూలుచేస్తున్న కాంట్రాక్టర్లు ఈ మొత్తాన్ని దేనికి వినియోగిస్తున్నారో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. చట్టం కేవలం కాంగ్రెస్ సొత్తు కాదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదా..?’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజ్‌పై బీజేపీ కన్నెర్ర
నాసిక్: వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధిపతి రాజ్‌ఠాక్రే నాసిక్‌లో శనివారం నిర్వహించిన భూమిపూజను బీజేపీ బహిష్కరించింది. నాసిక్‌లో 2015లో నిర్వహించే కుంభమేళా కోసం చేపట్టిన రోడ్డు నిర్మాణం/వెడల్పు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాసిక్ మేయర్ యతిన్ వాఘ్, ఎమ్మెన్నెస్ శాసనసబ్యులు వసంత్ గిటే, ఉత్తమ్ ధిక్లే, నితిన్ భోసాలే, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎమ్మెన్నెస్ బీజేపీ కూటమి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) అధికార ంలో ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని రాజ్ తీవ్రంగా విమర్శించడంతో స్థానిక బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నాసిక్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్ మాట్లాడుతూ ‘బీజేపీ తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే బాగుండేది. ప్రధాని అభ్యర్థిగా మారిన తరువాత ఆయన కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా యావత్ దేశ హితవు గురించి ఆలోచించాలి. ప్రధాని అంటే దేశ హితవు గురించి ఆలోచించాలి. కేవలం తన రాష్ట్రానికే పరిమితం కాకూడదు. ఇటీవల ముంబైలో సభ నిర్వహించిన మోడీ గుజరాత్ ప్రజల గొప్పదనం, సర్దార్ వల్లబాయి పటేల్ త్యాగాలను కొనియాడుతూ ప్రసంగించారు. మరి ఛత్రపతి శివాజీ ప్రాధాన్యం గురించి ఎందుకు మాట్లాడలేదు ?’ అని అన్నారు. రాజ్ విమర్శలపై బీజేపీ నాసిక్ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ సవాజీ మాట్లాడుతూ ‘ఏకపక్ష నిర్ణయాలు, విమర్శలతో ఇబ్బందిపెడుతున్న ఎమ్మెన్నెస్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని కోరుతూ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కు ప్రతిపాదన పంపించాం. నాసిక్ కార్పొరేషన్‌లోనూ ఎమ్మెన్నెస్ ఎవరినీ సంప్రదించకుం డానే నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధి ప్రాజెక్టుల విషయాల్లో అది మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే భూమి పూజను బహిష్కరించాం’ అని సవాజీ వివరించారు. -
అంతా మనోళ్లే!
ముంబై: ఈసారి ఎన్నికల్లో భారీ ఓట్లతో సత్తా చూపాలనే పట్టుదలతో ఉన్న మహరాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) రాష్ట్రంలోని ఉత్తరాది ఓట్లపై దృష్టి పెట్టింది. ఉత్తరాది వారి వ్యతిరేక పార్టీ అనే ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘ఎమ్మెన్నెస్ ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. రాజ్‌ఠాక్రే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించడం వల్ల అక్కడి వాళ్లు మా పార్టీపై దురభిప్రాయం ఏర్పరుచుకున్నారు. అందుకే ముంబైలోని ఉత్తరాది రాష్ట్రాల ప్రజలతో మాట్లాడి వారిలోని దురాభిప్రాయాలను తొలగించాలని ఆయన నన్ను కోరారు. మహారాష్ట్ర అభివృద్ధే రాజ్ ధ్యేయమన్న విషయాన్ని వారికి నేను స్పష్టం చేస్తాను’ అని ఎమ్మెన్నెస్ అధిపతి సన్నిహితుడు, వాగీశ్ సారస్వత్ అన్నారు. సినీ కళాకారుల సంక్షేమం కోసం గత నెల ఎమ్మెన్నెస్ నిర్వహించిన కార్యక్రమానికి కూడా అమితాబ్ బచ్చన్ ఆహ్వానించడాన్ని గమనిస్తే ఈ పార్టీ ఉత్తరాది వారికి దగ్గర కావడానికి యత్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దీనిపై వాగీశ్ స్పందిస్తూ ఉత్తరాది వ్యతిరేక ముద్రను తొలగించుకునే ప్రయత్నంగా దీనిని చూడకూడదని, మహారాష్ట్ర తన కర్మభూమి అని అమితాబ్ ప్రకటించడమేగాక, ఆ కార్యక్రమంలో మరాఠీలోనే మాట్లాడారని వివరణ ఇచ్చారు. బచ్చన్‌కు తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఆయన ముంబైలో ఉంటూ ఇతర రాష్ట్రాల ప్రచారకర్తగా వ్యవహరించడాన్నే మేం తప్పుపట్టాం. అయితే ఆయన ముంబైతోపాటు మహారాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. మేం ఉత్తరాది వారిని ఎప్పుడూ హింసించలేదు. అయితే మరాఠీల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం ఊరుకోం’ అని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. వాళ్లు మహారాష్ట్ర, మరాఠీని గౌరవిస్తే తామూ అభిమానిస్తామన్నారు. అయితే మరాఠీలను ‘కామధేను’గా భావించి దోపిడీ చేసే విధానాన్ని ఉత్తరాది ప్రజలు వదులుకోవాలని ఎమ్మెన్నెస్ ఉపాధ్యక్షుడు కూడా అయిన వాగీశ్ కోరారు. ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడి మరాఠీల మద్దతు సంపాదించడానికి రాజ్ ప్రయత్నించారని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన దగ్గర అజెండా ఏదీ లేదన్న ఆరోపణలను ఖండించారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే ఉత్తరాది వాసులకు ఎర్రతివాచీ పరుస్తామని, సంఘవ్యతిరేక శక్తులతో పోరాడుతామని ఆయన అన్నారు. తమ పార్టీ రాజకీయ కార్యకలాపాలకు ప్రచారం తేవడానికి గిమ్మిక్కులకు పాల్పడబోమన్నారు. ‘కరువు పీడిత ప్రాంతాల్లో తొలిసారిగా పర్యటించిన రాజకీయ నాయకుడే రాజ్‌ఠాక్రేనే. అక్కడ పశుదాణా శిబిరాలు, రైతుల కోసం సంక్షేమనిధిని ఏర్పాటు చేశారు. రాజ్ ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక సంబంధాల సైట్లలో అందుబాటులో ఉండరు. ఆయన సామాజిక సంబంధాల ద్వారానే ప్రజలకు దగ్గరవుతారు. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెన్నెస్ ప్రాబల్యం ఇప్పుడు బాగా పెరిగింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరిన్ని సీట్లలో పోటీ చేస్తాం. అయితే వేరే పార్టీలతో పొత్తులపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీనిపై రాజ్‌ఠాక్రేనే తుది నిర్ణయం తీసుకుంటారు’ అని వాగేశ్ సారస్వత్ వివరించారు. బీజేపీ, శివసేన నేతృత్వంలోని మహాకూటమిలో ఎమ్మెన్నెస్‌ను చేర్చుకునేందుకు ఆ రెండు పార్టీలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం తెలిసిందే. రాజ్ వ్యాఖ్యలపై ‘ఆప్’ అసంతృప్తి ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కొత్త పార్టీఅని, అది ఢిల్లీలో విజయం సాధించడం యాదృచ్ఛికం అంటూ రాజ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఆప్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయన అమర్యాదకరంగా మాట్లాడారని, అటువంటి వ్యాఖ్యలపై తాము స్పందించబోమని తెలిపింది. రాజ్ స్థాయికి తాము దిగజారబోమని ఆప్ నాయకుడు మయాంక్ గాంధీ ముంబైలో శుక్రవారం అన్నారు. మహారాష్ట్రలో తమదే అత్యంత ప్రాబల్యమున్న పార్టీ అని, ఆప్‌కు ఇక్కడ అవకాశమే లేదని మూడు రోజుల క్రితం మీడియా సమావేశంలో రాజ్ అన్నారు. శివసేన నాయకుడు మనోహర్ జోషి కుమారుడు ఉన్మేశ్ జోషితో రాజ్‌కు ఉన్న వ్యాపార సంబంధాలపై గాంధీ స్పందిస్తూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉందని ఆరోపించారు. ఇదిలా ఉంటే ముంబైకర్లకు చేరువకావడానికి ఆప్ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 26 వరకు 10 లక్షల సభ్యత్వాల సేకరణ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు మయాంక్ గాంధీ తెలిపారు. -
ఎంఎన్ఎస్ కార్యదర్శి అతుల్ కన్నుమూత
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యదర్శి అతుల్ సర్పోత్దార్ కన్నుమూశారు. గురువారం రాత్రి గుండె పోటు రావడంతో ఆయనను బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స కొనసాగిస్తుండగానే రాత్రి సుమారు 7.30 గంటలకు ఆయనకు మరోసారి గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచారు. 51 ఏళ్ల అతుల్‌కు భార్య శిల్పా, కుమారుడు జయ్ ఇలా ఉన్నారు. అతుల్ చనిపోయిన విషయం తెలియగానే ఆయన భార్య శిల్పా దిగ్భ్రాంతికిలోనయింది. ఆమెకు కూడా లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స నిర్వహిస్తున్నారు. అతుల్ చనిపోయిన విషయం తెలియగానే రాజ్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, పదాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. శివసేన నాయకులు దివంగత మధుకర్ సర్పోత్దార్ కుమారుడు అతుల్ ఎంఎన్ఎస్ అధినేత రాజ్‌ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు. రాజ్‌ఠాక్రే శివసేన వదిలిన తర్వాత అతుల్ కూడా ఆయన బాటలో వెళ్లి ఎంఎన్ఎస్లో చేరారు. ఎంఎన్ఎస్ స్థాపించినప్పటి నుంచి అతుల్ రాజ్‌తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారు. వ్యక్తిగతంగా అతుల్ సౌమ్యుడనే గుర్తింపు ఉంది. అతుల్ మరణ వార్తతో ముంబైతో పాటు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లోని కార్యకర్తలందరూ ఖిన్నులయ్యారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శన కోసం శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు అతుల్ భౌతికకాయాన్ని ఖేర్వాడిలోని వినాయక్ కాలనీలో ఉంచారు. మధ్యాహ్నం ఖేర్వాడిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు రాజ్ ఠాక్రే హాజరయ్యారు. పెళ్లి విడిచి వచ్చిన రాజ్‌ఠాక్రే........ అతుల్ సర్పోత్దార్ లీలావతి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రాజ్ ఠాక్రే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్కీకర్ కుమారుడి వివాహ కార్యక్రమంలో ఉన్నారు. అయితే లీలావతి ఆస్పత్రి నుంచి అతుల్ చనిపోయారన్న సమాచారం తెలియగానే ఆయన వెంటనే ముంబైకి బయల్దేరి వచ్చారు. అతుల్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.