సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ అంశంపై చేపట్టిన రాస్తారోకో ఆందోళన చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. వాహనాల ధ్వంసం చేయలేదు. అయితే రాస్తారోకోలో వాహనాల టైర్లలో గాలి తీయడం, నిప్పంటించిన టైర్లను రోడ్లపై పడేయడం తదితర సంఘటనలు మాత్రం చోటుచేసుకున్నాయి. అయితే ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. అయితే కొన్ని రహదారులపై మాత్రం ట్రాఫిక్ స్తంభించింది.
అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త వాతవరణం మధ్య ప్రజలు గడిపారు. ఎప్పుడు ఏమీ జరగతుందోనని పలువురు భయాందోళనలకు గురయ్యారు. కేవలం నాలుగు గంటల్లోనే రాస్తారోకో ఆందోళనను విరమించినట్టు రాజ్‌ఠాక్రే ప్రకటించడంతో అటు పోలీసులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తన నివాసం కృష్ణకుంజ్ నుంచి వాషీ టోల్‌నాకా వద్ద ఆందోళనకు నేతృత్వం వహించేందుకు బయలుదేరిన సుమారు 15 నిమిషాల్లోనే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతవరణం కనిపించింది.
అనంతరం ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్‌సీఎఫ్ పోలీసు స్టేషన్ తీసుకువెళ్లారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫోన్లో మాట్లాడి చర్చలకు రమ్మని పిలిచారు. దీనికి రాజ్‌ఠాక్రే కూడా అంగీకరించడంతో టోల్ ఆందోళనకు తెరపడింది. సుమారు ఒంటిగంట ప్రాంతంలో రాజ్‌ఠాక్రేను ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు విడుదల చేశారు.
ఉద్రిక్తత మధ్య....
రాష్ట్రంలో ఎమ్మెన్నెస్ పార్టీ రాస్తారోకో ఆందోళన నిర్వహిస్తున్నట్టు ముందుగానే ప్రకటించడంతో బుధవారం ఉదయం నుంచి కొంత ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ముంబైతోపాటు ఠాణే, పుణే, నాసిక్, ఔరంగాబాద్ మొదలగు ప్రాంతాలతోపాటు ఎమ్మెన్నెస్ పట్టున్న ప్రాంతాల్లో కొంత ప్రభావం కనిపించింది. రోడ్డు మార్గాల మీదుగా వెళ్లాల్సి వచ్చినవారు తొమ్మిది గంటలలోపే టోల్‌నాకాలను దాటేందుకు ప్రయత్నించారు.
ముంబై ఈస్టర్న్, వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేలపై ముంబైకి విధులకు వచ్చేవారు కొంత ముందుగానే బయలుదేరడంతో ట్రాఫిక్ అధికంగా కనిపించింది. అయితే 8.30 గంటల నుంచి ఎమ్మెన్నెస్ కార్యకర్తలు టోల్‌నాకాల వద్దకి చేరుకోవడం ప్రారంభమైంది. 8.45 గంటలకే పలురోడ్లు బోసిపోయాయి. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవే పై ఖండాలా బోర్ ఘాట్ వద్ద ఎమ్మెన్నెస్ మద్దతుదారులు కంటెయినర్ టైర్లలో గాలీతీసేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
రాష్ట్రంలోని టోల్ వసూలు చేస్తున్న అనేక రహదారులపై ఎమ్మెన్నెస్ కార్యకర్తలు చేరుకుని రాస్తారోకో చేశారు. అయితే అప్పటికీ అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నవీముంబైలోని వాషీ టోల్‌నాకాకు రాజ్‌ఠాక్రే రానుండడంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ట్రాన్స్‌పోర్ట్ బస్సులను రోడ్డుపక్కన నిలిపారు. శాంతిభద్రతలకు విఘాతానికి దారి తీసేలా ఉందనగానే పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అ బస్సుల్లోకి ఎక్కించారు.
భయాందోళనలకు గురైన ప్రజలు...
రాజ్‌ఠాక్రేను పోలీసుల అదుపులోకి తీసుకున్న అనంతరం అనేక ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లోని దుకాణాలు మూసివేశారు. గతంలో రాజ్‌ఠాక్రేను అరెస్టు చేసిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాంటిదేమైనా జరగవచ్చని అనేక మంది ఆందోళన చెందారు. అయితే ఎమ్మెన్నెస్ కార్యకర్తలు మాత్రం ఈసారి శాంతియుతంగా ఆందోళన చేశారు. రాజ్‌ఠాక్రేను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన అనంతరం మాత్రం నిరసనలు తీవ్రం చేసినా దాడులకు దిగలేదు.
ఉదయం తొమ్మిది గంటలలోపే రాజ్‌ఠాక్రేను ఆయన నివాసం కృష్ణకుంజ్‌లోనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించారు. అయితే అప్పటికే కృష్ణకుంజ్‌కి భారీ ఎత్తున ఎమ్మెన్నెస్ కార్యకర్తలు చేరుకోవడంతో మార్గంమధ్యలో అదుపులోకి తీసుకోవాలని పథకం పన్నారు. దీని ప్రకారమే రాజ్‌ఠాక్రే ఇంటి నుంచి 10 గంటలకు బయలుదేరగానే సైన్ చూనబట్టి వద్ద పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయనతోపాటు ఉన్న ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు, బాలా నాందగావ్కర్, నితిన్ సర్‌దేశాయిలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సుమారు 15 నిమిషాల అనంతరం రాజ్‌ఠాక్రే కారు నుంచి దిగడంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అయితే వారిని శాంతపరిచిన రాజ్‌ఠాక్రే పోలీసు వ్యాన్‌లోకెళ్లి కూర్చున్నాడు. అనంతరం ఆయనను ఆర్‌సీఎఫ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సమయంలో రాజ్‌ఠాక్రే భార్య షర్మిలా ఠాక్రే, కుమారుడు అమిత్ ఠాక్రే పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సుమారు ఒంటిగంటకు రాజ్‌ఠాక్రేను వదిలి పెట్టారు. కాగా ‘మేము అనుకున్నది సాధిం చాం. ముఖ్మమంత్రి అన్ని విషయాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఈ ఆందోళన ఇంతటితో నిలిపివేస్తున్నామ’ని ఠాక్రే ప్రకటించారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో మూసివేసిన దుకాణాలను మళ్లీ తెరిచారు.
ముఖ్యమంత్రితో నేడు చర్చలు...
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎట్టకేలకు అన్ని విషయాలను అమోదించి చర్చలకు పిలిచారని రాజ్‌ఠాక్రే తెలిపారు. ఆర్‌సీఎఫ్ పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో సీఎంతో టోల్ అంశంపై చర్చలు జరగనున్నట్టు తెలిపారు. దీంతో తాము టోల్ అంశంపై చేపట్టిన ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు తెలిపారు.
రాజ్‌ఠాక్రేపై ప్రత్యర్థుల విమర్శలు
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) చేపట్టిన ఆందోళనపై ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీలు ఆడించిన నాటకమని శివసేన,, ఎన్నికలకు ముందుగా పబ్లిసిటీ కోసం రాజ్‌ఠాక్రే చేస్తున్న స్టంట్ అని ఎన్సీపీ ఆరోపిస్తోంది. ‘ముందు నుంచి ముఖ్యమంత్రితోపాటు ప్రజాపనుల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ చర్చలకు రావాలని కోరినా ఆందోళనకు దిగారు. మంగళవారం కూడా చర్చలకు రావాలని ఫోన్ వచ్చినట్టు రాజ్‌ఠాక్రేనే మీడియాకు తెలిపారు. అయితే ఆందోళన చేసి ఇలా నాలుగు గంటల్లోనే విరమిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా సాధించేందేమిట’ని ఎన్సీపీ అధికారప్రతినిధి నవాబ్ మల్లిక్ ప్రశ్నించారు.
మరోవైపు ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజ్‌ఠాక్రే, ఎమ్మెన్నెస్‌లపై పరోక్షంగా చురక లంటించారు. ప్రజల శ్రేయస్సు కోసమని చెప్పుకుని కొందరు ఎన్నికల ముందు లబ్ధిపొందేందుకు ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం చేసే ఆందోళనలు ఇలా గే ఉంటాయని ఎద్దేవాచేశారు. ‘ఆందోళనతో జనజీవనంపై ఎలాం టి ప్రభావం పడలేదు. దీనికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేద’ని శివసేన ఎంపీ సంజయ్ రావత్ అన్నారు.
రాస్తారోకో ప్రశాంతం
Published Wed, Feb 12 2014 10:54 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement