సాక్షి, ముంబై: టోల్ విధానంలో పారదర్శకత తీసుకురావాలన్న డిమాండ్‌తో తాము బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న రాస్తారోకో ఉంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే స్పష్టం చేశారు. పోలీసులు పంపిన నోటీసులకు తాను బెదరనని, వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం సాయంత్రం రాజ్‌ఠాక్రే నివాసం కృష్ణకుంజ్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉదయం తొమ్మిది గంటల నుంచి రాష్ట్రంలోని హైవేలన్నింటిపై తమ పార్టీ కార్యకర్తలు రాస్తారోకోకు దిగుతారన్నారు. ఈ ఆందోళనలో భాగంగా నవీముంబైలోని వాషీ టోల్‌నాకా వద్ద జరిగే రాస్తారోకోలో తాను పాల్గొంటానని చెప్పారు. అయితే తాను ఆందోళనకు పిలుపునిచ్చిన అనంతరం చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అయితే వారిని ఎలా నమ్మేదని ప్రశ్నించారు. మరోవైపు గతంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరిగాయని, ఫలితం మాత్రం శూన్యమన్నారు. నిజంగా ప్రభుత్వం టోల్ సమస్యను పరిష్కరించాలని భావిస్తే ఒక గడువు ఇచ్చి ఓ ప్రణాళిక రూపొందించాలని, కేవలం చర్చలు జరిపితే లాభం లేదన్నారు.
తాము చర్చలకు వచ్చినప్పుడు తమ వెంట కొందరు విలేకరులను కూడా అనుమతించాలని ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. ‘ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ఏదో గూడు పుఠాణి, ఒప్పందం కుదిరింది.. ఇలా రకరకాలుగా పుకార్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే చర్చల సమయంలో విలేకరులను కూడా అనుమతించాలని కోరామ’ని రాజ్‌ఠాక్రే వివరించారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు....
రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరుగుతున్నందున నగరాలు, పట్టణాల్లోని జనజీవనంపై ప్రభావం కలగకుండా ఆందోళన చేయాలని ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు సూచించానని రాజ్‌ఠాక్రే చెప్పారు. కేవలం నిరసన తెలిపేందుకే తాము ఈ ఆందోళన చేస్తున్నామన్నారు. మరోవైపు 13 రకాల పన్నులతోపాటు టోల్ వసూలు చేస్తున్నారని, వీటిని ఎక్కడ వినియోగిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులు మౌలిక సదుపాయాల కోసం కాకుండా ఎన్నికల నిధి కోసమే కలెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు.
ఫిబ్రవరి 21న ర్యాలీ...
రాస్తారోకో ఆందోళన అనంతరం ఈ నెల 21వ తేదీన ముంబై గిర్‌గావ్ నుంచి మంత్రాలయం వరకు మహార్యాలీ నిర్వహిస్తామని రాజ్‌ఠాక్రే ప్రకటించారు. రాస్తారోకో ఆందోళన అనంతరం కూడా ప్రయోజనం లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాకపోతే మాత్రం ఇక ఊరుకోమని హెచ్చరించారు. ఎమ్మెన్నెస్ పార్టీ తనదైన శైలిలో ఆందోళనకు దిగుతుందన్నారు.
సీఎంకు సీట్ల పంపకాలే ముఖ్యం...
రాష్ట్రవ్యాప్తంగా సమస్యగా మారిన టోల్ అంశంపై చర్చలు జరపడంకంటే సీట్ల పంపకాలపైనే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆసక్తి చూపుతున్నారని రాజ్‌ఠాక్రే ఆరోపించారు. ఈ సమస్యకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. అయితే ఢిల్లీలో సీట్ల పంపకాల కోసం మాత్రం సమయం ఉందని ఎద్దేవా చేశారు.
పోలీసు బందోబస్తు
ఎమ్మెన్నెస్ రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికోసం సిబ్బంది సెలవులు కూడా రద్దు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేతోపాటు ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలకు పోలీసులు నోటీసులు పంపించారు. కాగా, రాజ్ ఠాక్రేకు శివాజీపార్క్ పోలీసు స్టేషన్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఆందోళన హింసాత్మకంగా మారితే దీనికి బాధ్యత మీదే ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ప్రజలు కూడా కొంత ఆయోమయంలో ఉన్నారు. దీంతో బుధవారం ఏమి జరగనుందనే విషయంపై అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది.
దూకుడే
Published Tue, Feb 11 2014 11:32 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement
Advertisement