సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ నాకాల అంశంపై బుధవారం రాస్తారోకో, ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పుణేలోని ఆదివారం రాత్రి జరిగిన బహిరంగ సభలో రాజ్ ఠాక్రే ప్రసంగిస్తూ టోల్‌కు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంతోపాటు పారదర్శకత తేవాలని, ముఖ్యంగా ఈ విషయంపై అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసింది. టోల్ అంశంపై అన్ని ప్రశ్నలకు సమాధానం తెలిపేంతవరకు తాము ఆందోళన చేస్తామన్నారు. ఇందులో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో ఆందోళన చేపట్టనున్నామని ధైర్యం ఉంటే ప్రభుత్వం తనను అరెస్టు చేయాలని ఆయన సవాల్ విసిరిన సంగతి విధితమే.
ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు నోటీసులు
ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ కార్యకర్తలను ముందే అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఒకటి రెండు ప్రాంతాల్లో కొందరు ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిసింది. అందిన వివరాల మేరకు ఉస్మానాబాద్ జిల్లాలో పోలీసులు ఎమ్మెన్నెస్ కార్యకర్తలకు సోమవారం ఉదయం నోటీసులు పంపించారు.
రాస్తారోకో సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలా చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు తమదైన పద్ధతిలో ముందుగా కొందరు ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడం, అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయని కొందరు పేర్కొంటున్నారు.
యేణేగురా టోల్‌నాకా మూసివేత
ఉస్మానాబాద్ జిల్లాలోని యేణేగురా టోల్‌నాకాను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు సోమవారంమూసివేయించారు. పుణేలో ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే టోల్ విధానంలో మార్పులు చేయడంతోపాటు అక్రమంగా వసూళ్లు చేస్తున్న టోల్‌నాకాలకు వ్యతిరేకంగా రాస్తారోకోలు చేయనున్నట్టు ప్రకటించారు.
ఉస్మానాబాద్ జిల్లాలోని యేణేగురా టోల్‌నాకా వద్ద 2011 వరకు టోల్ వసూలు చేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ ఇంకా వసూలు చేస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు సోమవారం ఆ టోల్‌నాకాను మూసివేయించారు.
ఎమ్మెన్నెస్‌పై డేగకన్ను
Published Mon, Feb 10 2014 11:39 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement
Advertisement