ఇద్దరు ఠాక్రేలు యుద్ధానికి సిద్ధం
ఇద్దరు ఠాక్రేలు యుద్ధానికి సిద్ధం
Published Mon, Jun 2 2014 10:54 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
మహారాష్ట్రలో ఠాక్రే కుటుంబం తొలిసారి ముఖాముఖి ఎన్నికల పోరుకు సిద్ధం అవుతోంది. ఆదివారం బాలాసాహెబ్ ఠాక్రే మేనల్లుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని, తమ పార్టీ తరఫున తానే ముఖ్యమంత్రినని ప్రకటించారు.
ఆ ప్రకటన వెలువడి 24 గంటలు కాకుండానే శివసేన అధినేత, బాలాసాహెబ్ పుత్రుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా ముఖ్యమంత్రి సీటు మీద టవలేశారు. ఉద్ధవ్ ఎన్నికల్లో పోటీచేస్తారని, పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయనేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రకటించారు.
ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో బిజెపి-శివసేన కూటమి 42 సీట్లు గెలిచింది. బిజెపికి 23, శివసేనకి 18 సీట్లు వచ్చాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పది చోట్ల పోటీ చేసి, అన్నిటా డిపాజిట్లు కోల్పోయింది.
అయితే మహారాష్ట్ర రాజకీయాల్లో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న సామెత అక్షరాలా నిజమౌతోంది. ఇద్దరు ఠాక్రేల కొట్లాట బిజెపికి చావులా తయారైంది. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కొట్టి, ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకోవాలన్న బిజెపి ఇప్పుడు ఈ ఇద్దరి కొట్లాటతో ఇరకాటంలో పడింది. మరో వైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోనూ శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్, కూతురు సుప్రియా సులేల మధ్య ఎత్తులు పై ఎత్తులు నడుస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది.
Advertisement