ఠాక్రేలు మళ్లీ కలిశారు..!
ముంబై: శివసేనను వీడి వేరుకుంపటి పెట్టుకున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మళ్లీ ఆ పార్టీకి దగ్గరవుతున్నారా? బీజేపీపై తరచూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీతో పొత్తు కారణంగా తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని రగిలిపోతున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశంకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబైలోని దాదర్లో నివసిస్తున్న రాజ్ ఠాక్రే శుక్రవారం బాంద్రాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి ఆయన్ను కలిసినట్టు సమాచారం. శివసేన, ఎంఎన్ఎస్ల మధ్య సయోధ్య కుదరనుందని, వచ్చే ఏడాది జరిగే ముంబై కార్పొరేషన్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజ్ ఠాక్రే.. శివసేన వ్యవస్థాపకుడు, దివంగత నేత బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడు. ఒకప్పుడు రాజ్ ఠాక్రే శివసేనలో చురుగ్గా పనిచేశారు. వారసత్వ రేసులో విభేదాలు రావడంతో 2006లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే ఏడాది మార్చిలో ఎంఎన్ఎస్ను స్థాపించారు. ఇక శివసేన చీఫ్గా బాల్ ఠాక్రే వారసుడిగా ఆయన కుమారుడు ఉద్ధవ్ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత భిన్నధ్రువాలుగా ఉంటున్న ఠాక్రేలు మళ్లీ కలిసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.