సాక్షి, ముంబై: టోల్ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరూ టోల్ చెల్లించవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పేర్కొన్నారు. ‘టోల్’ను నిరసిస్తూ బుధవారం రాస్తారోకో, ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై గురువారం ఉదయం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో సహ్యాద్రి అతిథి గృహంలో భేటీ అయ్యారు. అనంతరం తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
టోల్ అంశంపై తాము తెలిపిన అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యంగా సమస్యపై ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే పరిష్కారం చూపిస్తామని హామి ఇచ్చారని చెప్పారు. అయినా ఇచ్చిన హామిని నెరవేరుస్తూ నిర్ణయం వచ్చేంత వరకు టోల్ కట్టవద్దన్న తమ ఆందోళన కొనసాగిస్తామని, ఎవరూ టోల్ చెల్లించవద్దని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎవరైనా బలవంతంగా టోల్ చెల్లించమని చెబితే ఆ కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీనికి తమను దోషులుగా చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మూసి వేయనున్న 28 టోల్ నాకాలు!
ఎమ్మెన్నెస్ డిమాండ్ మేరకు రాష్ట్రంలో 28 టోల్ నాకాలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి హామి ఇచ్చారని రాజ్‌ఠాక్రే చెప్పారు. వీటిలో ప్రజాపన్నుల శాఖ నిర్మించినవి 22 ఉండగా ఎమ్‌ఎస్‌ఆర్‌డీసీకి చెందినవి 6 ఉన్నాయన్నారు. ఇవన్నీ బీఓటీ పద్ధతిలో నిర్మించారు. అయితే రూ.10 కోట్ల లోపు ఉన్నప్పటికీ బీఓటీ పద్ధతిలో నిర్మించడంపై రాజ్‌ఠాక్రే నిరసన వ్యక్తం చేశారు. ఓ పక్క పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో ఇలాంటి వాటికి టోల్ వసూలు చేయడంలేదని, అదే మన రాష్ట్రంలో వసూలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపామన్నారు.
ఇందులో కొన్ని తప్పులు జరిగాయని సీఎం అంగీకరించినట్లు చెప్పారు. అదే విధంగా టోల్ ద్వారా వసూలైన వాటన్నింటికీ పారదర్శకత ఉంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. దాంతోపాటు టోల్ నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మినహాయించాలని కోరామని, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, ఏ విషయమై తొందర్లోనే నిర్ణయం తీసుకుంటామన్నారని రాజ్‌ఠాక్రే తెలిపారు.
మహార్యాలీ వాయిదా..
21న నిర్వహించాలనుకున్న మహా ర్యాలీ వాయిదా వేసినట్టు రాజ్ ఠాక్రే ప్రకటించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో వాయిదా వేశామని, అయితే హామీలను నెరవేర్చకపోతే మళ్లీ తాము ఆందోళన విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో తనతోపాటు విలేకరులు, ఇతర మంత్రులు, అధికారులు కూడా ఉన్నారని చెప్పారు. అందరి సమక్షంలో ఈ చర్చలు, నిర్ణయాలు జరిగాయన్నారు.
నాలుగు గంటల్లో 4వేల కోట్ల నష్టం
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే నేతృత్వంలో చేసిన రాస్తారోకో ఆందోళన నాలుగు గంటల్లో ముగిసినా ఆర్థిక దృష్టి కోణంతో ఆలోచిస్తే మాత్రం భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని తెలిసింది. ఎమ్మెన్నెస్ ఆందోళన హింసాత్మకంగా మారే అవకాశాలున్నాయని భావించిన అనేక వ్యాపారాలు నిలిచిపోయాయి. మరోవైపు రాస్తారోకో కారణంగా అనేక మంది పర్యాటకుల తమ టూర్లు రద్దు చేసుకున్నారు. అనేక మంది షాపు, రోడ్లపై నడిచే చిరువ్యాపారులు కూడా దుకాణాలు మూసి ఇంట్లో కూర్చునేందుకు ఇష్టపడ్డారు. పరిణామంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ రాస్తారోకో ఆందోళన కారణంగా సుమారు రూ.4 వేల కోట్ల నష్టం వాటి ల్లిందని అంచనా.
హింసాత్మక సంఘటనలు జరగకపోయినా..
ముఖ్యంగా బుధవారం ఎమ్మెన్నెస్ చేపట్టిన ఆందోళనలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎక్కడా పెద్దగా హింసాత్మక సంఘటనలు జరగలేదు. అయినప్పటికీ ఆర్థికంగా మాత్రం భారీ నష్టం వాటిల్లింది. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎమ్మెన్నెస్ పార్టీ ప్రభావమేనని అనేక మంది చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెన్నెస్ చేసిన ఆందోళనలు దాదాపు అన్ని హింసాత్మకంగానే మారాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులతోపాటు ప్రజల, ప్రైవేట్ ఆస్తులకు కూడా వీరి ఆందోళన సమయంలో నష్టం వాటిల్లింది.
దీంతో అనేక మంది ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే పుణేలో రాస్తారోకో, ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించగానే ముందు జాగ్రత్త చర్యలపై దృష్టిపెట్టారు. అనేక మంది పనులు వాయిదా వేసుకున్నారు. ఇక ట్రావెల్స్ అసోసియేషన్స్ నుంచి అందిన వివరాల మేరకు అనేక టూర్స్ కంపెనీలు తమ పర్యటలను రద్దు చేశాయి. బాంబే గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఏకంగా ఎమ్మెన్నెస్ రాస్తారోకోకు మద్దతు పలికింది. దీంతో కేవలం గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ నిలిచిపోవడంతోనే సుమారు రూ.700 కోట్ల నష్టం వాటిల్లింది. ఎమ్మెన్నెస్ రాస్తా రోకో ఆందోళన కారణంగా అనేక రకాలుగా సుమారు రూ.4 వేల కోట్ల నష్టం వాటిల్లింది.
విధానం మారాలి
Published Thu, Feb 13 2014 11:08 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement
Advertisement