కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరైన ఎమ్మెన్నెస్ | MNS gives solo performance in municipal corporation elections | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరైన ఎమ్మెన్నెస్

Published Tue, Sep 9 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

MNS gives solo performance in municipal corporation elections

సాక్షి, ముంబై: నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంసీ)లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారి తారుమారు అయ్యాయి. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్)తో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. గతంలో ఎమ్మెన్నెస్, బీజేపీ మిత్రపక్షాలుగా ఏర్పడి ఎన్‌ఎంసీలో అధికారం చేజిక్కించుకున్నాయి. కానీ బీజేపీ ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకుని మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదర్చుకుంది. శివసేన మేయర్ పదవికి, బీజేపీ డిప్యూటీ మేయర్ పదవికి నామినేషన్లు వేశాయి. ఇక చేసేది లేక  ఒంటరైన ఎమ్మెన్నెస్, శరద్ పవార్ నేతత్వంలోని నేషనలిస్టు కాంగ్రె స్ పార్టీ (ఎన్సీపీ)తో జతకడుతుందా..? అనేది తేలాల్సి ఉంది.

 ఎమ్మెన్నెస్ తరఫున నలుగురి నామినేషన్లు
 ఎన్‌ఎంసీకి ఈ నెల 12న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అండతో ఎమ్మెన్నెస్ అధికారం చేజిక్కించుకుంది. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో నాసిక్ ఒకటే ఎమ్మెన్నెస్ అధీనంలో ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా దూరం కావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు మంగళవారం 11-2 గంటల మధ్య నామినేషన్లు వేయాలి.

 బీజేపీ తమతో జతకట్టడం లేదని తేలిపోయిన తర్వాత ఎమ్మెన్నెస్ తరఫున నల్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీజేపీకి సంబంధించిన వారెవరు లేరు. కొద్ది సేపటికి బీజేపీ, శివసేన, ఆర్పీఐ కార్పొరేటర్లు భారీగా బలప్రదర్శన చేస్తూ కార్పొరేషన్ భవనానికి  చేరుకున్నారు. మూడు గంటల్లోనే రాజకీయ సమీకరణాలు మారిపోవడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. నాసిక్‌లో ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల పోటీ మరింత ఉత్కంఠకు దారితీసింది.

 ఎన్సీపీతో దోస్తీకి ప్రయత్నం..
 ఎమ్మెన్నెస్ ఆధీనంలో ఉన్న  ఒక్క కార్పొరేషన్ కూడా చేజారి పోవడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే శాసన సభ ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉంటాయోనని ఎమ్మెన్నెస్‌కు దిగులు పట్టుకుంది. ఎలాగైన అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తెర వెనక నుంచి చక్రం తిప్పాలని యోచిస్తోంది. నాసిక్ కార్పొరేషన్‌లో ఎన్సీపీకి 20 మంది కార్పొరేటర్ల సంఖ్యా బలముంది. అధికారం కోసం ఎమ్మెన్నెస్ ఎన్సీపీతో జతకట్టే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క 14 మంది సంఖ్యా బలం ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు తమ వైఖరి స్పష్టం చేయలేదు.

 బలాబలాలు ......
 ఎమ్మెన్నెస్-39, శివసేన, ఆర్పీఐ-23, బీజేపీ-15, ఎన్సీపీ-20, కాంగ్రెస్-14, ఇండిపెండెంట్లు-6, మార్క్స్‌వాది కమ్యూనిస్టు పార్టీ -3, జనరాజ్య-2 ఇలా మొత్తం 122 స్థానాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement