nashik municipal corporation
-
కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరైన ఎమ్మెన్నెస్
సాక్షి, ముంబై: నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ)లో రాజకీయ సమీకరణాలు ఒక్కసారి తారుమారు అయ్యాయి. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా (ఎమ్మెన్నెస్)తో బీజేపీ తెగతెంపులు చేసుకుంది. గతంలో ఎమ్మెన్నెస్, బీజేపీ మిత్రపక్షాలుగా ఏర్పడి ఎన్ఎంసీలో అధికారం చేజిక్కించుకున్నాయి. కానీ బీజేపీ ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకుని మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదర్చుకుంది. శివసేన మేయర్ పదవికి, బీజేపీ డిప్యూటీ మేయర్ పదవికి నామినేషన్లు వేశాయి. ఇక చేసేది లేక ఒంటరైన ఎమ్మెన్నెస్, శరద్ పవార్ నేతత్వంలోని నేషనలిస్టు కాంగ్రె స్ పార్టీ (ఎన్సీపీ)తో జతకడుతుందా..? అనేది తేలాల్సి ఉంది. ఎమ్మెన్నెస్ తరఫున నలుగురి నామినేషన్లు ఎన్ఎంసీకి ఈ నెల 12న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అండతో ఎమ్మెన్నెస్ అధికారం చేజిక్కించుకుంది. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లలో నాసిక్ ఒకటే ఎమ్మెన్నెస్ అధీనంలో ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా దూరం కావడంతో ఎమ్మెన్నెస్ ఇబ్బందుల్లో పడిపోయింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు మంగళవారం 11-2 గంటల మధ్య నామినేషన్లు వేయాలి. బీజేపీ తమతో జతకట్టడం లేదని తేలిపోయిన తర్వాత ఎమ్మెన్నెస్ తరఫున నల్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బీజేపీకి సంబంధించిన వారెవరు లేరు. కొద్ది సేపటికి బీజేపీ, శివసేన, ఆర్పీఐ కార్పొరేటర్లు భారీగా బలప్రదర్శన చేస్తూ కార్పొరేషన్ భవనానికి చేరుకున్నారు. మూడు గంటల్లోనే రాజకీయ సమీకరణాలు మారిపోవడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. నాసిక్‌లో ఆకస్మాత్తుగా చోటుచేసుకున్న పరిణామాల వల్ల పోటీ మరింత ఉత్కంఠకు దారితీసింది. ఎన్సీపీతో దోస్తీకి ప్రయత్నం.. ఎమ్మెన్నెస్ ఆధీనంలో ఉన్న ఒక్క కార్పొరేషన్ కూడా చేజారి పోవడం ఖాయమని తెలుస్తోంది. వచ్చే శాసన సభ ఎన్నికల్లో పరిణామాలు ఎలా ఉంటాయోనని ఎమ్మెన్నెస్‌కు దిగులు పట్టుకుంది. ఎలాగైన అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తెర వెనక నుంచి చక్రం తిప్పాలని యోచిస్తోంది. నాసిక్ కార్పొరేషన్లో ఎన్సీపీకి 20 మంది కార్పొరేటర్ల సంఖ్యా బలముంది. అధికారం కోసం ఎమ్మెన్నెస్ ఎన్సీపీతో జతకట్టే అవకాశాలు లేకపోలేదు. మరోపక్క 14 మంది సంఖ్యా బలం ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు తమ వైఖరి స్పష్టం చేయలేదు. బలాబలాలు ...... ఎమ్మెన్నెస్-39, శివసేన, ఆర్పీఐ-23, బీజేపీ-15, ఎన్సీపీ-20, కాంగ్రెస్-14, ఇండిపెండెంట్లు-6, మార్క్స్‌వాది కమ్యూనిస్టు పార్టీ -3, జనరాజ్య-2 ఇలా మొత్తం 122 స్థానాలున్నాయి. -
పనులు చకచకా..
నాసిక్: వచ్చే ఏడాది జూలై 14 నుంచి జరగనున్న కుంభమేళాకు నాసిక్‌ను సమాయత్తం చేస్తున్నారు. మేళాకు సంబంధించి జిల్లాలో 96 అభివృద్ధి పనులకు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) ఇప్పటికే రూ. 442.11 కోట్ల విలువైన 18 పనులను ప్రారంభించింది. మరో రూ.94.43 కోట్ల విలువైన 11 పనులు టెండర్ల స్థాయిలో ఉన్నాయి. మేళా పనులకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ శాఖల నుంచి జనవరి 16వ తేదీన ఎన్ఎంసీ కమిషనర్ సంజయ్ ఖందారే నివేదికలను అడిగి తెప్పించుకున్నారు. వాటి ననుసరించి వివరాలిలా ఉన్నాయి..కుంభమేళాకు సంబంధించిన 96 పనులను వివిధ శాఖలకు కేటాయించారు. కాగా, రూ.442.11 కోట్లు విలువైన 18 పనులను ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించగా పనులు జరుగుతున్నాయి. వీటిలో రూ.427.62 కోట్ల విలువైన 15 పనులు రోడ్లకు సంబంధించిన కాగా, గోదావరిపై రూ.6.13 కోట్ల విలువైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రూ.8.36 కోట్ల విలువైన మరో రెండు పనులు డ్రైనేజీకి సంబంధించిన వి. కాగా, మరో 11 పనులు టెండర్ల స్థాయిలో ఉన్నాయి. వీటిలో నీటి సరఫరా శాఖకు సంబంధించి రూ.60.97 కోట్ల విలువైన పనులు, గోదావరిపై రూ.15.29 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు వంతెన ల నిర్మాణ పనులు, రూ.14.17 కోట్ల విలువైన మరో మూడు మురికినీటి శుద్ధీకరణ పనులు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ మార్చి చివరి వరకు రూ.152.94 కోట్ల అంచనా వ్యయంతో 17 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో సాధూగ్రామ్ కోసం రూ.82.70 కోట్ల విలువైన పనులు, రూ.30 కోట్ల ఖర్చుతో రోడ్డు నిర్మాణం, రూ.10 కోట్లతో తాత్కాలిక పార్కింగ్, టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు, నీటి సరఫరా శాఖకు సంబంధించి రూ.6.79 కోట్ల విలువ చేసే డ్రైనేజీ పనులున్నాయి. అలాగే వైద్య సేవలకు సంబంధించి రూ.1.5 కోట్ల పనులు, విద్యుత్ శాఖకు సంబంధించి రూ.2.10 కోట్ల అంచనావ్యయంతో రెండు పనులు చేపట్టాల్సి ఉంది. దీంతోపాటు అగ్నిమాపక విభాగం కోసం రూ.15.33 కోట్లతో ఐదు పనులు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ కుంభమేళాకు సంబంధించి నిర్మాణానికి 15 నుంచి 18 నెలల సమయం పట్టే రోడ్లు, డ్రైనేజీలు, వంతెనలు వంటి పనులను ఇప్పటికే మొదట చేపట్టాం. పది నెలలు అంతకంటే తక్కువ సమయం అవసరమయ్యే పనులను వచ్చే ఏడాది మేళా ప్రారంభమయ్యేనాటికి పూర్తిచేస్తామ’ని అన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో కుంభమేళాపై గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర అత్యున్నత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాసిక్ జిల్లాలో కుంభమేళా నిమిత్తం రూ.2,378.71 కోట్ల పనులను ఆమోదించారు. ఇందులో ఎన్ఎంసీ కోసం రూ.1,052.61కోట్ల పనులు కేటాయించారు. -
రాజ్‌పై బీజేపీ కన్నెర్ర
నాసిక్: వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధిపతి రాజ్‌ఠాక్రే నాసిక్‌లో శనివారం నిర్వహించిన భూమిపూజను బీజేపీ బహిష్కరించింది. నాసిక్‌లో 2015లో నిర్వహించే కుంభమేళా కోసం చేపట్టిన రోడ్డు నిర్మాణం/వెడల్పు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాసిక్ మేయర్ యతిన్ వాఘ్, ఎమ్మెన్నెస్ శాసనసబ్యులు వసంత్ గిటే, ఉత్తమ్ ధిక్లే, నితిన్ భోసాలే, పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఎమ్మెన్నెస్ బీజేపీ కూటమి నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) అధికార ంలో ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని రాజ్ తీవ్రంగా విమర్శించడంతో స్థానిక బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. నాసిక్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజ్ మాట్లాడుతూ ‘బీజేపీ తన పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించగానే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే బాగుండేది. ప్రధాని అభ్యర్థిగా మారిన తరువాత ఆయన కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా యావత్ దేశ హితవు గురించి ఆలోచించాలి. ప్రధాని అంటే దేశ హితవు గురించి ఆలోచించాలి. కేవలం తన రాష్ట్రానికే పరిమితం కాకూడదు. ఇటీవల ముంబైలో సభ నిర్వహించిన మోడీ గుజరాత్ ప్రజల గొప్పదనం, సర్దార్ వల్లబాయి పటేల్ త్యాగాలను కొనియాడుతూ ప్రసంగించారు. మరి ఛత్రపతి శివాజీ ప్రాధాన్యం గురించి ఎందుకు మాట్లాడలేదు ?’ అని అన్నారు. రాజ్ విమర్శలపై బీజేపీ నాసిక్ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ సవాజీ మాట్లాడుతూ ‘ఏకపక్ష నిర్ణయాలు, విమర్శలతో ఇబ్బందిపెడుతున్న ఎమ్మెన్నెస్‌కు మద్దతు ఉపసంహరించుకోవాలని కోరుతూ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కు ప్రతిపాదన పంపించాం. నాసిక్ కార్పొరేషన్‌లోనూ ఎమ్మెన్నెస్ ఎవరినీ సంప్రదించకుం డానే నిర్ణయాలు తీసుకుంటోంది. అభివృద్ధి ప్రాజెక్టుల విషయాల్లో అది మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే భూమి పూజను బహిష్కరించాం’ అని సవాజీ వివరించారు.