నాసిక్: వచ్చే ఏడాది జూలై 14 నుంచి జరగనున్న కుంభమేళాకు నాసిక్‌ను సమాయత్తం చేస్తున్నారు. మేళాకు సంబంధించి జిల్లాలో 96 అభివృద్ధి పనులకు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్‌ఎంసీ) ఇప్పటికే రూ. 442.11 కోట్ల విలువైన 18 పనులను ప్రారంభించింది. మరో రూ.94.43 కోట్ల విలువైన 11 పనులు టెండర్ల స్థాయిలో ఉన్నాయి.
మేళా పనులకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ శాఖల నుంచి జనవరి 16వ తేదీన ఎన్‌ఎంసీ కమిషనర్ సంజయ్ ఖందారే నివేదికలను అడిగి తెప్పించుకున్నారు. వాటి ననుసరించి వివరాలిలా ఉన్నాయి..కుంభమేళాకు సంబంధించిన 96 పనులను వివిధ శాఖలకు కేటాయించారు. కాగా, రూ.442.11 కోట్లు విలువైన 18 పనులను ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించగా పనులు జరుగుతున్నాయి. వీటిలో రూ.427.62 కోట్ల విలువైన 15 పనులు రోడ్లకు సంబంధించిన కాగా, గోదావరిపై రూ.6.13 కోట్ల విలువైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.
రూ.8.36 కోట్ల విలువైన మరో రెండు పనులు డ్రైనేజీకి సంబంధించిన వి. కాగా, మరో 11 పనులు టెండర్ల స్థాయిలో ఉన్నాయి. వీటిలో నీటి సరఫరా శాఖకు సంబంధించి రూ.60.97 కోట్ల విలువైన పనులు, గోదావరిపై రూ.15.29 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు వంతెన ల నిర్మాణ పనులు, రూ.14.17 కోట్ల విలువైన మరో మూడు మురికినీటి శుద్ధీకరణ పనులు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ మార్చి చివరి వరకు రూ.152.94 కోట్ల అంచనా వ్యయంతో 17 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో సాధూగ్రామ్ కోసం రూ.82.70 కోట్ల విలువైన పనులు, రూ.30 కోట్ల ఖర్చుతో రోడ్డు నిర్మాణం, రూ.10 కోట్లతో తాత్కాలిక పార్కింగ్, టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు, నీటి సరఫరా శాఖకు సంబంధించి రూ.6.79 కోట్ల విలువ చేసే డ్రైనేజీ పనులున్నాయి.
అలాగే వైద్య సేవలకు సంబంధించి రూ.1.5 కోట్ల పనులు, విద్యుత్ శాఖకు సంబంధించి రూ.2.10 కోట్ల అంచనావ్యయంతో రెండు పనులు చేపట్టాల్సి ఉంది. దీంతోపాటు అగ్నిమాపక విభాగం కోసం రూ.15.33 కోట్లతో ఐదు పనులు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ కుంభమేళాకు సంబంధించి నిర్మాణానికి 15 నుంచి 18 నెలల సమయం పట్టే రోడ్లు, డ్రైనేజీలు, వంతెనలు వంటి పనులను ఇప్పటికే మొదట చేపట్టాం.
పది నెలలు అంతకంటే తక్కువ సమయం అవసరమయ్యే పనులను వచ్చే ఏడాది మేళా ప్రారంభమయ్యేనాటికి పూర్తిచేస్తామ’ని అన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో కుంభమేళాపై గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర అత్యున్నత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాసిక్ జిల్లాలో కుంభమేళా నిమిత్తం రూ.2,378.71 కోట్ల పనులను ఆమోదించారు. ఇందులో ఎన్‌ఎంసీ కోసం రూ.1,052.61కోట్ల పనులు కేటాయించారు.
పనులు చకచకా..
Published Sat, Feb 1 2014 5:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
Advertisement
Advertisement