ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా ఈనెల(జనవరి)లోనే జరగనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. మహాకుంభమేళా 2025, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈసారి మహాకుంభమేళాను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు చేయనున్నారు.
కుంభమేళా అనేది అర్థకుంభమేళా, పూర్ణకుంభమేళా, మహాకుంభమేళా అనే వర్గాలుగా జరుగుతుంటుంది. ఈ మూడూ వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలోని నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంటుంది. వీటిలో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్‌లున్నాయి. కుంభమేళా సమయంలో భక్తులు గంగా, గోదావరి, క్షిప్రా నదులలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.
ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లలో మాత్రమే జరుగుతుంది. ఈ అర్థకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమ తీరంలో జరుగుతుంది.
గతంలో అంటే 2013లో పూర్ణకుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మరో పూర్ణ కుంభమేళా వచ్చింది. అయితే దీనికి మహాకుంభమేళా అనే పేరుపెట్టారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో 12 సార్లు పూర్ణ కుంభమేళా జరిగిన దరమిలా ఇప్పుడు మరోమారు జరుగుతున్నందున దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుండగా, 12 పూర్ణకుంభమేళాల తరువాత మహాకుంభమేళా వస్తుంది.
ఇది కూడా చదవండి: భోపాల్ దుర్ఘటన: 40 ఏళ్ల తర్వాత విషపూరిత వ్యర్థాల తరలింపు
Comments
Please login to add a commentAdd a comment