Kumbh mela works
-
Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు?
జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన ఆలయాలు, ఆశ్రమాలకు మరమ్మతులు చేశారు. కొన్ని చోట్ల కారిడార్లు నిర్మించారు. శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే, మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మైమరచిపోవడం ఖాయమనినిపించేలా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని భరద్వాజ ఆశ్రమం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పర్యాటక శాఖ కారిడార్‌ను నిర్మించింది. ఈ కారిడార్‌కు ఇరువైపులా మహర్షి భరద్వాజునికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఈ ఆశ్రమానికి వచ్చిన చిత్రాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సీతారాములకు ఇక్కడి నుండే భరద్వాజ మహర్షి చిత్రకూట్‌కు వెళ్లే మార్గం చూపాడని చెబుతారు. అలాగే లంకలో విజయం సాధించిన శ్రీరాముడు ఇక్కడికి వచ్చి భరద్వాజుని ద్వారా సత్యనారాయణుని కథను విన్నాడని చెబుతారు. ఇలాంటి ఎన్నో పురాణగాథలు ప్రయాగ్‌రాజ్‌తో ముడిపడి ఉన్నాయి.ఈ ప్రదేశానికున్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మ దేవుడు ఈప్రాంతాన్ని తీర్థరాజం అని పిలిచాడని చెబుతారు. దీని అర్థం అన్ని పుణ్యక్షేత్రాలకు రాజు. ఈ ప్రదేశాన్ని వేదపురాణాలు, రామాయణం, మహాభారతాలలో ప్రయాగగా పేర్కొన్నారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగలోని గంగా యమునా తీరంలో స్నానం చేస్తే కోట్లాది అశ్వమేధ యాగాల ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ తీర్థరాజం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శేష భగవానుని సూచనల మేరకు బ్రహ్మ దేవుడు అన్ని తీర్థయాత్రల పుణ్యాన్ని తూచాడు. తీర్థ ప్రదేశాలు, ఏడు సముద్రాలు, ఏడు ఖండాలు ఒక వైపు ఉంచారు. మరోవైపు తీర్థరాజం ప్రయాగను ఉంచారు. ఈ నేపధ్యంలో తీర్థరాజం ప్రయాగ అత్యంత బరువుతో భూమిని తాకిందట.కాగా పర్యాటక శాఖ ప్రయాగ్‌రాజ్‌లో పలు ఆలయాల పునరుద్ధరణకు ఎర్ర ఇసుకరాయిని వినియోగించింది. ఇవి ఎంతో మన్నికైన రాళ్లుగా గుర్తింపుపొందాయి. మరోవైపు స్థానిక అధికారులు కుంభమేళా సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల్లో 10 సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన బుక్లెట్లను భక్తులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు.ఇది కూడా చదవండి: World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది? -
అర్థ, పూర్ణ, మహాకుంభమేళాల్లో తేడాలేమిటి?.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా ఈనెల(జనవరి)లోనే జరగనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. మహాకుంభమేళా 2025, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈసారి మహాకుంభమేళాను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు చేయనున్నారు.కుంభమేళా అనేది అర్థకుంభమేళా, పూర్ణకుంభమేళా, మహాకుంభమేళా అనే వర్గాలుగా జరుగుతుంటుంది. ఈ మూడూ వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలోని నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంటుంది. వీటిలో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్‌లున్నాయి. కుంభమేళా సమయంలో భక్తులు గంగా, గోదావరి, క్షిప్రా నదులలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లలో మాత్రమే జరుగుతుంది. ఈ అర్థకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమ తీరంలో జరుగుతుంది.గతంలో అంటే 2013లో పూర్ణకుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మరో పూర్ణ కుంభమేళా వచ్చింది. అయితే దీనికి మహాకుంభమేళా అనే పేరుపెట్టారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో 12 సార్లు పూర్ణ కుంభమేళా జరిగిన దరమిలా ఇప్పుడు మరోమారు జరుగుతున్నందున దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుండగా, 12 పూర్ణకుంభమేళాల తరువాత మహాకుంభమేళా వస్తుంది. ఇది కూడా చదవండి: భోపాల్ దుర్ఘటన: 40 ఏళ్ల తర్వాత విషపూరిత వ్యర్థాల తరలింపు -
పనులు చకచకా..
నాసిక్: వచ్చే ఏడాది జూలై 14 నుంచి జరగనున్న కుంభమేళాకు నాసిక్‌ను సమాయత్తం చేస్తున్నారు. మేళాకు సంబంధించి జిల్లాలో 96 అభివృద్ధి పనులకు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎంసీ) ఇప్పటికే రూ. 442.11 కోట్ల విలువైన 18 పనులను ప్రారంభించింది. మరో రూ.94.43 కోట్ల విలువైన 11 పనులు టెండర్ల స్థాయిలో ఉన్నాయి. మేళా పనులకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ శాఖల నుంచి జనవరి 16వ తేదీన ఎన్ఎంసీ కమిషనర్ సంజయ్ ఖందారే నివేదికలను అడిగి తెప్పించుకున్నారు. వాటి ననుసరించి వివరాలిలా ఉన్నాయి..కుంభమేళాకు సంబంధించిన 96 పనులను వివిధ శాఖలకు కేటాయించారు. కాగా, రూ.442.11 కోట్లు విలువైన 18 పనులను ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించగా పనులు జరుగుతున్నాయి. వీటిలో రూ.427.62 కోట్ల విలువైన 15 పనులు రోడ్లకు సంబంధించిన కాగా, గోదావరిపై రూ.6.13 కోట్ల విలువైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రూ.8.36 కోట్ల విలువైన మరో రెండు పనులు డ్రైనేజీకి సంబంధించిన వి. కాగా, మరో 11 పనులు టెండర్ల స్థాయిలో ఉన్నాయి. వీటిలో నీటి సరఫరా శాఖకు సంబంధించి రూ.60.97 కోట్ల విలువైన పనులు, గోదావరిపై రూ.15.29 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు వంతెన ల నిర్మాణ పనులు, రూ.14.17 కోట్ల విలువైన మరో మూడు మురికినీటి శుద్ధీకరణ పనులు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ మార్చి చివరి వరకు రూ.152.94 కోట్ల అంచనా వ్యయంతో 17 పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. వీటిలో సాధూగ్రామ్ కోసం రూ.82.70 కోట్ల విలువైన పనులు, రూ.30 కోట్ల ఖర్చుతో రోడ్డు నిర్మాణం, రూ.10 కోట్లతో తాత్కాలిక పార్కింగ్, టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు, నీటి సరఫరా శాఖకు సంబంధించి రూ.6.79 కోట్ల విలువ చేసే డ్రైనేజీ పనులున్నాయి. అలాగే వైద్య సేవలకు సంబంధించి రూ.1.5 కోట్ల పనులు, విద్యుత్ శాఖకు సంబంధించి రూ.2.10 కోట్ల అంచనావ్యయంతో రెండు పనులు చేపట్టాల్సి ఉంది. దీంతోపాటు అగ్నిమాపక విభాగం కోసం రూ.15.33 కోట్లతో ఐదు పనులు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంసీ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ కుంభమేళాకు సంబంధించి నిర్మాణానికి 15 నుంచి 18 నెలల సమయం పట్టే రోడ్లు, డ్రైనేజీలు, వంతెనలు వంటి పనులను ఇప్పటికే మొదట చేపట్టాం. పది నెలలు అంతకంటే తక్కువ సమయం అవసరమయ్యే పనులను వచ్చే ఏడాది మేళా ప్రారంభమయ్యేనాటికి పూర్తిచేస్తామ’ని అన్నారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో కుంభమేళాపై గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర అత్యున్నత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాసిక్ జిల్లాలో కుంభమేళా నిమిత్తం రూ.2,378.71 కోట్ల పనులను ఆమోదించారు. ఇందులో ఎన్ఎంసీ కోసం రూ.1,052.61కోట్ల పనులు కేటాయించారు.