సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి నకిలీ ఫేస్ బుక్ పేజీ సృష్టించాడు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనపై బురద జల్లేందుకు చేస్తున్న అజ్ఞాత వ్యక్తి ప్రయత్నాలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మహాత్మ పులే పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఎఫ్ అకౌంట్ ఆధారంగా కేసును ఛేదించేందుకు కృషి చేస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
రాజ్ ఠాక్రే పేరుతో ఎఫ్‌బీ అకౌంటే లేదు
‘రాజ్ ఠాక్రే పేరుతో ఇంతవరకు ఫేస్ బుక్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. అయినప్పటికీ ఆయన పేరుతో నకిలీ అకౌంట్ తెరిచి అందులో రాజ్ ఠాక్రే తన కార్యకర్తలకు సూచనలిస్తున్నట్లు వ్యాఖ్యలు రాస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని బట్టి ఇది నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ అని స్పష్టమైందని’ ఎమ్మెన్నెస్ ఐటీ వింగ్ కల్యాణ్ కార్యదర్శి కాసం శేఖ్ అన్నారు. అజ్ఞాత వ్యక్తులు ఠాక్రే పేరు చెడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేశారు. ఫేస్ బుక్‌ను లైక్‌చేసిన వ్యక్తులతో సంప్రదిస్తూ తను రాజ్ ఠాక్రేనని మోసం చేస్తున్నారని శేఖ్ అన్నారు. రాష్ట్రం అభివృద్థి చెందాలంటే నిధుల అవసరం ఎంతైనా ఉంది.
అందుకు దాతలు విశాల హృదయంతో విరాళాలు అందజేసేందుకు ముందుకు రావాలని రాజ్ పిలుపునిచ్చినట్లు ఫేజ్ బుక్‌లో వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ పేరు, రాజ్ ఠాక్రేను కావాలనే బద్నాం చేసేందుకు కుట్రపన్నారని, ఈ వివాదం మరింత ముదరక ముందే ఆజ్ఞాత వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని శేఖ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ ఈ పేజీని అనేక మంది లైక్ చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ బోయిర్ పోలీసుల దృిష్టికి తీసుకెళ్లారు.
ఠాక్రే ప్రతిష్ఠకు భంగం కల్గించేందుకే..
శాసన సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో నకిలీ అకౌంట్ తెరిచి రాజ్ ఠాక్రే ప్రతిష్టకు భంగం వాటిళ్లే ప్రయత్నం కొందరు కావాలనే చేస్తున్నారని ఎమ్మెన్నెస్ కల్యాన్ నగర అధ్యక్షుడు రవీంద్ర బోంస్లే ఆరోపించారు. ఎన్నికల సమయంలో యువతను ఆకట్టుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను ఆశ్రయిస్తాయి.
అందులో ఇలాంటి తప్పుడు సందేశాలుంటే ఓటర్లు పొరబడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం అందరి వద్ద ఆధునిక సెల్‌ఫోన్లు ఉన్నాయి. అందులో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఇలాంటి సైట్లవల్ల ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. ముందు జాగ్రత్తగా పోలీసులు ఇలాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించి నకిలీ, నాయకుల ప్రతిష్టకు భంగం వాటిళ్లజేసే సైట్లను వెంటనే తొలగించాలని బోంస్లే కోరారు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పేరుతో నకిలీ ఫేస్ బుక్ పేజీ తయారు చేసిన గుర్తుతెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనపై బురద జల్లేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ మహాత్మ పులే పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
రాజ్‌ఠాక్రే పేరుతో ‘నకిలీ ఎఫ్‌బీ’ హల్‌చల్
Published Tue, Sep 16 2014 10:36 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM
Advertisement
Advertisement