ముంబై: తనుశ్రీ దత్త, నానా పటేకర్‌ల వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. కొందరు బాలీవుడ్ ప్రముఖులు తనుశ్రీకి మద్దుతుగా నిలువగా మరికొందరు ఈ విషయంపై మాట్లాడానికి ఆసక్తి కనబరచడం లేదు. కాగా, పదేళ్ల కిందట ప్లీజ్ హార్న్ ఓకె చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై వేధింపులకు దిగాడని తనుశ్రీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి మేనకా గాంధీ కూడా తనుశ్రీకి మద్దుతుగా పలు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో తనుశ్రీ మాట్లాడుతూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్) నాయకులు తనపై దాడి చేశారని ఆరోపించారు. నానా విషయంలో తనపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె వ్యాఖ్యనించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఎంఎన్‌ఎస్ తీవ్రంగా ఖండించిది. ఎంఎన్‌ఎస్ పార్టీ నాయకులు అమేయ కోప్కర్ మాట్లాడుతూ.. తనుశ్రీ వ్యాఖ్యల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ఆమెపై ఎంఎన్‌ఎస్ కార్యకర్తలు ఎవరు దాడి చేయలేదని స్పష్టం చేశారు. తనుశ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని.. కానీ తాము దానికి అవకాశం ఇవ్వదలుచుకోలేదని తెలిపారు.
నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన తరువాత తనుశ్రీ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో వివాదాలు కేంద్రంగా నడిచే బిగ్‌బాస్ రియాల్టీ షోలోకి తనుశ్రీని తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఎంఎన్‌ఎస్‌పై తప్పడు వ్యాఖ్యలు చేసిన తనుశ్రీని బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు షో నిర్వహకులకు హెచ్చరికలు జారీచేశారు. ఈ మేరకు ఎంఎన్‌ఎస్ యువజన విభాగానికి చెందిన నేతలు బుధవారం లోనవాలాలోని బిగ్‌బాస్ సెట్‌కు వెళ్లి నిర్వహకులకు ఓ లేఖను అందజేశారు. ఒకవేళ తనుశ్రీని హౌస్‌లోకి తీసుకుంటే హింస చోటుచేసుకుంటుందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా హిందీ బిగ్‌బాస్ 12వ సీజన్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment