మాంసం అమ్మకాల్లో 'మహా సేన'
ముంబయి: దేశ వాణిజ్య రాజధానిలో మాంసం లొల్లి ముదురుతోంది. ఓ పక్క జైనులు పవిత్రంగా భావించే ఆ ఎనిమిది రోజులు మాంసం అమ్మాకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకోగా దానిని శివసేన పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే. అయితే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మాత్రం శివసేన కంటే మరో అడుగు మందుకేసి ఏకంగా మాంసం అమ్మకాలను స్వయంగా గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. ముంబయి దాదార్ లోని అగర్ బజార్వద్ద తన పార్టీకి చెందిన కార్యకర్తలతో ప్రత్యేక మాంసం విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయిస్తానని చెప్పింది.
దీంతో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుని మరింత వివాదంగా మారే అవకాశం ఉంది. జైనులు పవిత్రంగా భావించే పర్యుషాన్ సందర్భంగా తొలుత ఎనిమది రోజులపాటు మాంసం విక్రయాలు నిషేధించాలని భావించారు. అయితే, పలు వర్గాల అభిప్రాయాలు తీసుకొని మొత్తం నాలుగు రోజులు నిషేధం విధించారు. అయినప్పటికీ ఈ నిర్ణయంపై కూడా పలు రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శివసేన పార్టీ అయితే.. ఎవరేం తినాలో చెప్పే హక్కు ఏ ఒక్కరికీ లేదని బీజేపీ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించగా.. ఇప్పుడు ఎమ్మెన్నెస్ మరో అడుగు ముందుకేసింది.