పార్లమెంట్‌లో మరాఠీయుల ఆత్మగౌరవం వినిపించే ఎంపీనే లేరన్న రాజ్‌ఠాక్రే
సాక్షి, ముంబై: పార్టీ స్థాపించిన తొలినాళ్లలో వినిపించిన భూమి పుత్రుల నినాదాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. మరాఠీయుల ఆత్మగౌరవం గురించి పార్లమెంట్‌లో మాట్లాడేందుకు ఏ ఒక్క ఎంపీ కూడా లేరని అన్నారు. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్మెన్నెస్ అభ్యర్థి రాజు పాటిల్‌కు మద్దతుగా కల్వాలోని మనీష్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ప్రచారసభలో రాజ్‌ఠాక్రే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...వలసవాదులు తలదాచుకునేందుకు ఎంపిక చేసుకుంటున్న ప్రాంతాల్లో ఠాణే జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు ఠాణే పేరు పూర్తిగా చెడగొట్టాయని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఒక్క బిల్డర్‌ను కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా పూర్తిగా అడ్డుకట్టవేస్తామని హామీ ఇచ్చారు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో మరాఠీయులు ఆత్మగౌరవం వినిపించేందుకు ఎమ్మెన్నెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చాటింపు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోందని రాజ్‌ఠాక్రే ఆరోపించారు. ఒక్క పుణేలోనే 1.25 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని, దీన్ని ప్రజాస్వామ్యమంటారా..? అని ఆయన నిలదీశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను గొరంతలు, కొండంతలుగా చూపిస్తున్న హిందీ, ఇంగ్లీష్ చానళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా టీఆర్పీని పెంచుకునేందుకు తన ఇంటర్వ్యూని ఇతర భాషల్లోకి అనువధించి తప్పుగా ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన మోడీ దేశానికి కూడా సుపరిపాలన అందించగలరన్న ధీమాను వ్యక్తం చేశారు.
అందుకే ఆయన ప్రధాని అయ్యేందుకు మద్దతు పలికామన్నారు. మహారాష్ట్ర గురించి సమగ్ర సమాచారం తెలిసిన మోడీ వస్తే రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళుతుందన్నారు. మోడీకి మద్దతు తన వ్యక్తిగత విషయమని, ఇతరులెందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘పీడబ్ల్యూడీ మంత్రి ఛగన్ భుజబల్ పదవీ కాంక్ష ఉంది. అప్పట్లో శరద్ పవార్ పదవి ఎర చూపగానే శివసేన నుంచి ఎన్సీపీకి వెళ్లారు. బాల్‌ఠాక్రేకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోంమంత్రి పదవి రాగానే బాల్‌ఠాక్రేను అరెస్టు చేయాలనుకున్నారు. ఇలాంటి వ్యక్తిని మాతోశ్రీ బంగ్లాకు ఉద్ధవ్‌ఠాక్రే విందుకు ఆహ్వానిం చార’ని అన్నారు. అదే తాను పార్టీని వీడితే బాల్‌ఠాక్రేకు వెన్నుపోటు పొడిచానని ఉద్ధవ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.
తెరపైకి మళ్లీ భూమిపుత్రుల నినాదం
Published Mon, Apr 21 2014 10:50 PM | Last Updated on Mon, Oct 8 2018 6:14 PM
Advertisement
Advertisement