సాక్షి, ముంబై: నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు అభ్యర్థుల వెంట వచ్చిన శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) కార్యకర్తలు పరస్పరంగా దాడులకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. కార్యకర్తలు పరుగులు తీశారు. స్థానిక మింట్ రోడ్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం...దక్షిణ ముంబై లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఓల్డ్ కస్టమ్ హౌస్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం చేరుకున్నారు.
ఆ సమయంలో సావంత్ వెంట భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఎమ్మెన్నెస్‌కు చెందిన అభ్యర్థి ఆదిత్య శిరోడ్కర్ కూడా పార్టీ కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇంతలో ఆ గుంపులోంచి కొందరు ముర్దాబాద్ అని నినాదాలు చేశారు. ఆగ్రహంతో రెచ్చిపోయిన ఇరుపార్టీల కార్యకర్తలు తోపులాటకు దిగారు. తమ చేతిలో ఉన్న పార్టీ జెండా కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. చేతికందిన వస్తువులను విసురుకున్నారు. రాళ్లు కూడా రువ్వుకున్నారు. పరిస్థితులు చేజారిపోయేలా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అయినా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో లాఠీలు ఝుళిపించారు. తాత్కాలికంగా అక్కడ పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇరు పార్టీల మధ్య వాతావరణం మాత్రం వేడిగానే ఉంది.
ఎమ్మెన్నెస్ గుర్తింపుని రద్దు చేయాలి: శివసేన
రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ పార్టీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని శివసేన పార్టీ కార్యదర్శి, ఎంపీ అనిల్ దేశాయ్ డిమాండ్ చేశారు. పక్కా ప్రణాళికతో శివసేన కార్యకర్తలపై ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆయన గురువారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాను కలిసి జరిగిన విషయం తెలిపామని, దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారన్నారు. దేశాయ్ రాళ్లు, నీళ్ల బాటిళ్లు శివసైనికులపై విసిరారని, ఆ తర్వాత పోలీసులు చేసిన లాఠీచార్జిలో మహిళా కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు లేవని తెలిసే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అన్నారు. దక్షిణ ముంబై లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు బయట అరగంటపాటు వేచి ఉన్నామన్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పోలీసుల భద్రత అవసరమని తెలిపారు.
రియాల్టీ షోలా ఉంది: ఎన్సీపీ, కాంగ్రెస్
నామినేషన్ దాఖలు చేసే సమయంలో నగరంలోని ఎన్నికల కార్యాలయం ముందు శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ టెలివిజన్ రియాల్టీ షో తరహాలో ఉందని డీఎఫ్ కూటమి పేర్కొంది. అది వారి సిద్ధాంతాలను తెలియచేస్తుందని ఎంపీసీసీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ అన్నారు. కోట్లాడుకోవడం, రాళ్లు విసురుకోవడం వల్లే వారి పార్టీలు ఎలాంటివో అందరికి తెలస్తుందని చెప్పారు. ఠాక్రే సోదరులపై రాష్ట్ర ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జితేంద్ర ఆవాడ్ మండిపడ్డారు. ఆ రెండు పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ వారి సాంస్కృతిని తెలియజేస్తుందన్నారు.
బాహాబాహీ
Published Thu, Apr 3 2014 10:33 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement