సాక్షి, ముంబై: ఇరువర్గాల మధ్య మత ఘర్షణలు సృష్టించి ఇళ్లకు నిప్పంటించే హిందుత్వం తమది కాదని, ఇంట్లో పొయ్యి వెలిగించే హిందుత్వమని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఉద్ఘాటించారు. ముంబైలోని బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్ (బీకేసీ) మైదానంలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగసభలో ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రతిపక్ష బీజేపీ నేతల వ్యవహార శైలి, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు, లౌడ్‌స్పీకర్లు, హనుమాన్ చాలీసా పఠనంపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలకు, ఆరోపణలకు సభ ద్వారా ఒకేసారి ధీటుగా సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఉద్ధవ్ మాట్లాడుతూ, కాశ్మీర్‌లో పండితులను హతమారుస్తున్నారు. అక్కడ వారికి భద్రతలేదు. కానీ ఇక్కడ ఊరికే తిరుగుతూ రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసే వారికి మాత్రం కేంద్రం వై–ప్లస్ భద్రతా ఎలా కల్పిస్తుందని రాజ్ ఠాక్రే పేరు ఉచ్ఛరించకుండా పరోక్షంగా ప్రశ్నించారు. కాషాయ రంగు క్యాప్ (టోపీ)లు ధరించిన వారిని హిందూత్వవాదులంటున్నారు. మరి ఆర్‌ఎస్‌ఎస్ క్యాప్‌ల రంగు నల్లగా ఎలా ఉంటుందని నిలదీశారు.
బాబ్రీ మసీదు కూల్చిన సమయంలో శివసేన ఎక్కడుందని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి పాత వీడియోలు చూడాలని హితవు పలికారు. బాబ్రీ మసీదు కూల్చడానికి దేవేంద్ర ఫడ్నవీస్ పైకెక్కే ప్రయత్నం చేస్తే ఆయన బరువుకే అదే కూలుతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మేం ఓపిక, సంయమనం పాటిస్తున్నామంటే అసమర్ధులమని దాని అర్ధం కాదు... మా జోలికి వస్తే దయా దాక్షిణ్యం చూపించకుండా వచ్చిన దారిలోనే పరుగెత్తిస్తామని సీఎం హెచ్చరించారు.
మా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు..
మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగదని, త్వరలోనే కూలిపోతుందని కొద్ది నెలలుగా బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, కానీ మా ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొనసాగుతుందని, మరో 20 ఏళ్ల వరకు మహావికాస్ ఆఘాడి ప్రభుత్వమే రాష్ట్రాన్ని ఏలుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా గడ్డుకాలంలో సైతం పేదలకు ఉచితంగా ‘శివ్ భోజన్’ థాలి (రైస్ ప్లేట్) అందించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆ పథకం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాంటి ప్రయత్నం ఏ రాష్ట్ర పభుత్వం చేయలేదని గుర్తు చేశారు. వెనకాముందు ఆలోచించకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని బీజేపీపై నిప్పులు చెరిగారు.
ప్రస్తుతం సభ జరుగుతున్న స్ధలంలో అంటే బీకేసీ మైదానంలో బుల్లెట్ ట్రైన్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్–ముంబై మధ్య నడిపే ప్రతిపాదన సిద్ధమైతోంది. ఈ బుల్లెట్ ట్రైన్ ఎవరికి కావాలి? ఇది ముంబైని విడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఉద్ధవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా సభా వేదికపై పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే, ఎంపీ సంజయ్ రావుత్, ఏక్‌నాథ్ షిందే, సుభాష్ దేశాయ్, అరవింద్ సావంత్, లీలాధర్ ఢాకే, అనీల్ పరబ్, వినాయక్ రావుత్, గులాబ్‌రావ్ పాటిల్, పలువురు ఎంపీలు, మంత్రులు ఉన్నారు.
కాగా, మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేసిన తరువాత బహిరంగ సభ జరగడం ఇదే ప్రథమం. దీంతో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. కొన్ని ఎకరాల బీకేసీ మైదానమంతా అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. పార్కింగ్ స్థలంలో చోటు లభించకపోవడంతో రోడ్లపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు తలప్రాణం తోకకు వచ్చింది. సభ పూర్తిగా విజయవంతం కావడంతో శివసేన కార్యకర్తలు, నేతలు సంతోషం వ్యక్తం చేశారు.
ముంబైని మహారాష్ట్ర నుంచి విడదీసే కుట్ర
ఫడ్నవీస్ వ్యాఖ్యలను బట్టి దేశ ఆర్థిక రాజధాని ముంబైని రాష్ట్రం నుంచి విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోందని, కానీ వారి ప్రయత్నాలను తిప్పి కొట్టనిదే రాష్ట్ర ప్రజలు, శివసైనికులు ప్రశాంతంగా ఉండరని హెచ్చరించారు. రాజ్ ఠాక్రేను మున్నాబాయి ఎంబీబీఎస్ చిత్రంలో సంజయ్ దత్‌తో ఆయన పోల్చారు. రాజ్ ఠాక్రే మున్నాబాయి లాంటి వాడని, ఆయన మెదడులో కెమికల్ సమస్య రావడంవల్లే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడని పేరు ఉచ్ఛరించకుండా ఆరోపించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో శివసేన, బీజేపీ మధ్య విభేదాలు తలెత్తాయి. చివరకు మిత్రపక్షాలుగా ఉన్న ఇరు పార్టీలు విడిపోయాయి.
అక్టోబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఎదురైన చేదు అనుభవాల గురించి ఉద్ధవ్ వివరించారు. తెల్లవారుజామున ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసిందో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ‘మీరు చేస్తే తప్పు లేదు. మేం చేస్తే మోసమా’ అంటూ అన్ని పార్టీలను నిలదీశారు. మీలాగా మేం గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ప్రమాణ స్వీకారం చేయలేదని, బహిరంగంగా అందరి సమక్షంలో ప్రభుత్వం ఏర్పాటుచేసి ప్రమాణ స్వీకారం చేశామని ఉద్ధవ్ గుర్తు చేశారు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే నేడు బీజేపీ–ఎన్సీపీ చెట్టాపట్టాలేసుకుని రాష్ట్రాన్ని ఏలేవారని దుయ్యబట్టారు. అధికారం లేకపోయేసరికి బీజేపీ నేతలు మతితప్పి ఇష్టమున్నట్లు ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తామెన్నడూ అలా వ్యవహరించలేదన్నారు. అలా వ్యవహరించడం శివసేన సంస్కృతి కాదని, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇలా ప్రవర్తించడం నేర్పలేదని స్పష్టం చేశారు.
శివాజీ ఏలిన మహారాష్ట్ర ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం కొందరు చేస్తున్నారని అన్నారు. బీజేపీ వ్యతిరేకులపై కేంద్రం ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తోంది. ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం వెనుకపడ్డారు. ఒకవేళ దావుద్ బీజేపీలో చేరితే మంత్రి పదవి కూడా ఇచ్చేందుకు వెనకాడరని ఆయన ధ్వజమెత్తారు. హిందూత్వాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను రెచ్చగొడుతున్న నాయకుల ముసుగులను తొలగిస్తామని హెచ్చిరించారు.
Comments
Please login to add a commentAdd a comment