ముంబై : ఐదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్‌ఎన్‌ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలను తిడుతూనే వారిని కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ‘ న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో ఒక కొటేషన్ ఉంటుంది. ప్రజలు నన్ను ప్రధాన మంత్రి అని కాకుండా ప్రథమ సేవకుడిగా పిలవాలి అన్న నెహ్రూ ఆదర్శ వాక్యాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం మోదీ ప్రథమ సేవకుడికి బదులు ప్రధాన సేవకుడిని అని చెప్పుకొంటున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీని తిడుతూనే వారిని భలేగా కాపీ కొడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు.
నాందేడ్‌లో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే...నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళా భద్రత గురించి పట్టించుకోకుండా ప్రధానిగా మోదీ విఫలమయ్యారన్నారు. సైనికుల త్యాగాలను రాజకీయాలకు వాడుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నందుకు మోదీ సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. బీజేపీ, అమిత్ షా, మోదీలను దేశ రాజకీయాల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు. కాగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాజ్ ఠాక్రే పోటీ చేయడం లేదన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ, పాలక బీజేపీపై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇక రాజ్ ఠాక్రే కజిన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment