సాక్షి, ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే బీజేపీకి భారీ షాకిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ తమ పార్టీ పోటీచేయడం లేదని మంగళవారం ప్రకటించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ద్వయానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. బీజేపీని ఓడించడమే తమ అంతిమ లక్ష్యమంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. మోదీ, షా ఇద్దరూ దేశంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నారు..అందుకే వారిద్దర్నీ పక‍్కకు తొలగించాల్సి ఉందన్నారు. దీనికోసం బీజేపీని ఓడించాలని ఎంఎన్‌ఎస్ శ్రేణులకు థాకరే పిలుపునిచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని స్పష‍్టం చేశారు.
బాంద్రాలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన బీజేపీ కొత్తగా ప్రారంభించిన మై భీ చౌకీదార్ ప్రచారం ప్రహసనమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో పార్టీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న ప్రచారమని విమర్శించారు. అసలు ఎన్నికలు నేపాల్లో జరుగుతున్నాయా లేక భారతదేశంలోనా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు దేశానికి, నరేంద్రమోదీ, అమిత్‌షా ద్వయానికి మధ్య జరుగుతున్నవని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించటం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై కూడా థాకరే విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment