సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు కొత్త అభ్యర్థులకే ప్రాధ్యాన్యత ఇవ్వాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే యోచిస్తున్నారు. దీంతో లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువ ఉన్న కొత్త అభ్యర్థులతోపాటు సామాజిక రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న అభ్యర్థుల వేటలో పడ్డారు. అందులో భాగంగా రాజ్ ఠాక్రే జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. అక్కడి రాజకీయ వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.
ప్రత్యర్థి ఎవరూ, తమ పార్టీ నుంచి ఎవరికి అభ్యర్థిత్వం ఇస్తే ఫలితాలెలా ఉంటాయనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాగా ఉత్తర ముంబై నుంచి ఎమ్మెల్యే ప్రవీణ్ దరేకర్, ఈశాన్య ముంబై, దక్షిణ ముంబై నుంచి రామ్ కదం, బాలానాంద్‌గావ్కర్‌ను పోటీ చేయాలని రాజ్ ఠాక్రే చెప్పనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 16 నుంచి 18 స్థానాల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో అత్యధిక శాతం కొత్త వారికే ప్రాధాన్యత ఇవ్వాలని రాజ్ యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ జాబితాయే తరువాయి..
నాగపూర్: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు గాను రాష్ట్రంలో బీజేపీ, ఎన్సీపీ, ఆప్ వంటి పార్టీలు విదర్భలో తమ అభ్యర్థుల పేర్లను ఇప్పటికే ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఇంకా జాబితా విడుదలలో ఊగిసలాడుతోంది. ఈ రీజియన్‌లో ఉన్న 10 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా ఆయా పార్టీలు ప్రచారంలో ముందుకు దూసుకుపోతుండగా కాంగ్రెస్ కార్యకర్తల్లో మాత్రం నైరాశ్యం కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి ఈ ప్రాంతంలో ఇప్పటికే గుర్తింపు పొందిన నాయకులే అభ్యర్థులుగా ఉంటారనేది తెలిసిందే అయినా ఆ పార్టీ జాబితా విడుదల చేస్తేనే వారు ఎవరనేది స్పష్టమవుతుందని కార్యకర్తలు అంటున్నారు.
ఇతర పార్టీల విషయానికి వస్తే.. బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, ఎన్సీపీ నుంచి కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న వ్యక్తులు కాగా బీజేపీ నుంచి నవ్‌నీత్ కౌర్ రాణా (అమరావతి), కృష్ణారావు ఇంగిల్ (బుల్ధానా) పేర్లు వినిపించడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, గోండియా- భండారా నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీచేయనున్న ప్రఫుల్ పాటిల్‌కు బీజేపీ అభ్యర్థి నానా పటోల్, ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ మిశ్రా రూపంలో ప్రమాదం పొంచి ఉంది. నాగపూర్‌లో నితిన్ గడ్కరీకి సైతం విజయం అంత సులభం కాకపోవచ్చు.
ఇక్కడ నుంచి గత ఏడు పర్యాయాలుగా ఎంపీగా కొనసాగుతున్న విలాస్‌ముత్తెంవార్‌తోపాటు ఆప్ అభ్యర్థి అంజలీ దమనియా నుంచి గట్టిపోటీ ఎదుర్కోక తప్పదు. శివసేనకు పెట్టనికోటగా ఉన్న బుల్ధానా నియోజకవర్గంలో పాగా వేసేందుకు కృష్ణారావు ఇంగిల్‌కు ఎన్సీపీ ఇక్కడ టికెట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా చంద్రపూర్‌నుంచి ఆప్ అభ్యర్థిగా నిలబడుతున్న సమాజ సేవకుడు వామన్‌రావు చాతప్ విదర్భ ఉద్యమంలో భాగంగా నగరంలో గత ఏడాది నిర్వహించిన విదర్భ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా పాత్ర పోషించాడు. అలాగే ఆప్ అమరావతి అభ్యర్థిగా ప్రకటించిన భావ్నా వాస్నిక్ స్థానిక కళాశాలలో ప్రొఫెసర్‌గాపనిచేస్తున్నారు.
గెలుపుగుర్రాల కోసం ఎమ్మెన్నెస్ వేట..
Published Fri, Feb 28 2014 10:57 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement