సాక్షి, ముంబై: మరికొన్ని నెలల్లో నిర్వహించబోయే శాసనసభ ఎన్నికల్లో తను స్వయంగా పోటీ చేస్తానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటించారు. సైన్-పన్వేల్ రహదారిపై ఉన్న సోమయ్య గ్రౌండ్‌లో శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో బహిరంగసభ నిర్వహించారు. ఇందులో ప్రసంగించిన రాజ్ పోటీపై స్వయంగా ప్రకటన చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాజయాన్ని చవిచూడడం తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణను వెల్లడించేందుకు ఆయన ఈ సభ ద్వారా ప్రజల ముందుకు వచ్చారు.
సభలో ఆయన ఏం మాట్లాడుతారనేదానిపై ఎమ్మెన్నెస్ కార్యకర్తలు, ప్రజల్లో ఆసక్తి కనిపించింది. అందరూ ఊహించిన విధంగా ప్రతిపక్ష నాయకులపై ఘాటైన విమర్శలు సంధించలేదు. గతంలో మాదిరిగా తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా సాధారణ ప్రసంగంతోనే సభ ముగించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో భారీగా సీట్లు వచ్చాయని, పెద్ద సంఖ్యలో తమ పార్టీ అభ్యర్థులు గెలిచారని (పరోక్షంగా శివసేనను లక్ష్యంగా చేసుకుని) కొందరు విర్రవీగుతున్నారు. నరేంద్ర మోడీ వల్లే వారికి గెలుపు సాధ్యమయింది. మోడీ ప్రధాన మంత్రి అయినందుకు మనస్ఫూర్తిగా ఆయనను అభినందిస్తున్నాను. ఈ ఎన్నికల్లో ప్రజలు మోడీ మాట విన్నారు.
ఆయన పేరు మీదే ఓటు వేశారు. ఒకవేళ మోడీ లేకుంటే బీజేపీకి మిత్రపక్షంగా (శివసేన పేరు ఉచ్చరించకుండా) ఉన్న పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చేవా..?’ అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఒక్కస్థానం గెలుచుకోకపోవడంతో ఇక పార్టీ జెండా ఎత్తేసినట్లేనని ప్రతిపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే. వీటిపై రాజ్ స్పందిస్తూ ‘ఈ రోజు జరిగిన సభకు హాజరైన భారీ జనాన్ని చూస్తే తెలియడం లేదా...? జెండా ఎత్తేసే పార్టీ అయితే ఇంత పెద్ద సంఖ్యలో జనం వచ్చేవారా..?’ అని నిలదీ శారు. ఓటమికి ఎమ్మెన్నెస్ భయపడబోదని, అందరూ పరాజయాల నుంచి నేర్చుకుని పైకి వస్తారని వ్యాఖ్యానించారు. తనకు పరాజయం కొత్త కాదని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుంటానని అన్నారు. బంతిని ఎంత వేగంతో నేలపై కొడితే అంతే వేగంతో పెకైగురుతుందని, ఎమ్మెన్నెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడు ఓడినా వచ్చే శాసనసభ ఎన్నికల్లో బంతిలాగే పైకి లేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతీ ఎన్నిక ద్వారా ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకోవచ్చని, దాని ప్రకారం రాజకీయాల్లో ముందుకు సాగుతామని అన్నారు. నాసిక్‌లో ఓటమిపై స్పం దించారు. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎమ్మెన్నెస్ అధికారంలో ఉంది. అయితే స్థానికంగా అభివృద్ధి పనులు చేయకపోవడం వల్లే ఎమ్మెన్నెస్ పార్టీ అభ్యర్థి గెలవలేకపోయాడని ప్రతి పక్షాల అభ్యర్థులు విమర్శించారు. దీనిపై రాజ్ మాట్లాడుతూ ‘మేం అధికారంలోకి వచ్చి కేవలం రెండు సంవత్సరాలే అయింది. గత 20,30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయని మీరేందుకు నిలదీయరు...? రెండేళ్లలో మేం ఏం చేయగలుతాం.... మమ్మల్నే ఎందుకు లక్ష్యంగా చేస్తారు’ అని విపక్షాలపై మండిపడ్డారు. తమ పార్టీ అభ్యర్థులకు ఓటువేసిన ప్రజలందరికీ అభినందనలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్నందున, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరవ్వాలని రాజ్‌ఠాక్రే పిలుపునిచ్చారు.
ఎన్నికలకు రెడీ
Published Sun, Jun 1 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 8:10 AM
Advertisement
Advertisement