అరే చూస్తావేంటి చేరిపో! | Mumbai: Maharashtra Navnirman Sena Kicks Off Membership Drive | Sakshi
Sakshi News home page

అరే చూస్తావేంటి చేరిపో!

Published Tue, Mar 16 2021 2:17 PM | Last Updated on Tue, Mar 16 2021 2:21 PM

Mumbai: Maharashtra Navnirman Sena Kicks Off Membership Drive - Sakshi

సాక్షి, ముంబై: తరుచూ పరాజయాలతో కుంగిపోతున్న రాజ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన (ఎమ్మెన్నెస్‌) పార్టీ సభ్యత్వ నమోదుకు కొత్త నినాదం అందుకుంది. ‘అరె బగ్తాయ్‌ కాయ్‌ సామీల్‌ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త నినాదంతో ముందుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 9తో ఎమ్మెన్నెస్‌ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరా లు పూర్తయింది. ఈ సుదీర్గ కాలంలో, అనేక రాజకీయ పరిణామాలతో పార్టీ ఇంతవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా చేపడుతున్న ఈ కార్యక్ర మానికి సోషల్‌ మీడియాలో యువతను ఆకుట్టకునే విధంగా ప్రకటన ఇచ్చింది అందులో ‘అరె బగ్తాయ్‌ కాయ్‌ సామీల్‌ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త పంథాతో ఎన్నికల ముందుకు వెళ్లనున్నారు. 
 
త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు.. 
పుణే, నాసిక్, ఔరంగాబాద్, కల్యాణ్‌–డోంబివలి, మీరా–భాయందర్‌ కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలను రాజ్‌ఠాక్రే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కోల్పోయిన పార్టీ పూర్వ వైభవాన్ని మళ్లీ తెచ్చేందుకు ఎంతో కృషి, పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే ఆయన ఈ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. ఆ కార్పొరేషన్ల పరిధిలోని సంబంధిత పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. అక్కడి రాజకీయ వాతావరణం, ఏ పార్టీకి ఎక్కువ పట్టు ఉంది...? తమ పార్టీకి అవకాశాలెలా ఉన్నాయి...? ఎన్నికలు జరిగితే ఫలితాలెలా ఉంటాయి...?  తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు సభ్యత్వ నమోదు పథకానికి శ్రీకారం చుట్టారు. అందుకు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటనలిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా నియోజకవర్గాల ప్రజల వరకు చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో సోషల్‌ మీడియా సాయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెన్నెస్‌లో సభ్యత్వం ఎలా తీసుకోవాలో అందులో వివరాలు పెట్టారు.

ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని తమ పార్టీ కార్యకర్తలుగా చేర్చుకోవాలనే ప్రయత్నం చేయనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, పని చేస్తున్న ప్రముఖులను కూడా ఇందులో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే నెల 24వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది.  ఇదిలాఉండగా ఏటా పార్టీ అవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించే రాజ్‌ఠాక్రే ఈ సారి రద్దు చేశారు. సభలో పార్టీ పదాధికారులకు, కార్యకర్తలకు వివిధ అంశాలపై మార్గదర్శనం, పార్టీ దిశనిర్ధేశం చేస్తారు. కానీ, ఈ సారి కరోనా వైరస్‌ కారణంగా పార్టీ అవిర్భావ వేడుకలు నిర్వహించలేదు. అందుకు సోషల్‌ మీడియా ద్వారా తమ సందేశాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల చెంతకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. 


ప్రారంభంలో ఘనంగా.. 
అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్‌ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్‌ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్‌ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్‌ మిగిలారు.

ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్‌ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్‌ ఠాక్రే చేస్తున్నారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.

చదవండి:
ఊపిరి ఉన్నంతవరకు బీజేపీపై పోరు

హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర హెచ్చరికలు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement