ఓటర్లను ఏ మాత్రం ప్రభావితం చేయని రాజ్ ప్రసంగాలు
మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన తనయుడు అమిత్ ఠాక్రేకూ తప్పని ఓటమి
అసెంబ్లీ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడింది. మహా వికాస్ ఆఘాడి, మహాయుతి కూటములకు చెందిన వెన్నుపోటుదార్లకు (గద్దార్‌లకు) ఓటు వేయవద్దని, ఒకసారి తమ పార్టీకి అవకాశమిచ్చి చూడాలని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగ్గా, శనివారం ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర రాజకీయరంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న ఎమ్మెన్నెస్ చీఫ్ ఆశలు అడియాశలయ్యాయి. పార్టీ తరపున ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోగా మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన తన తనయుడు అమిత్ ఠాక్రేను కూడా గెలిపించుకోలేకపోయారు. దీంతో రాజ్ వైఖరి,ఆయన తనయుడు అమిత్ ఓటమిపై సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.
పార్టీ గుర్తు రద్దయ్యే అవకాశం...
దాదాపు 18 ఏళ్ల కిందట హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలవడంతో రాజ్ ఠాక్రే పరువు, పార్టీ ప్రతిష్ట నిలబడ్డాయి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజు పాటిల్ కూడా ఓటమిపాలయ్యారు.
ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిగా పేరుగాంచిన బాలా నాంద్‌గావ్కర్ శివ్డీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాంద్‌గావ్కర్ గెలుపు కోసం ప్రచారం ముగింపు చివరి రోజున అంటే గత సోమవారం శివ్డీలో ప్రత్యేకంగా ఓ సభ కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెన్నెస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అంతేగాకుండా ఈ ఎన్నికల్లో కనీసమాత్రం ఓట్లు కూడా రాకపోవడంతో పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశముందని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తును రద్దుచేసే అవకాశం కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మాటలకు ఓట్లు రాలవని...
రాజ్ ఠాక్రే ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ఇసుకవేస్తే రాలనంతమంది ప్రజలు ఆ సభలకు హాజరవుతారు. ఆయన మాటతీరు, ప్రముఖ రాజకీయ నాయకుల మాటలను అనుకరించే (మిమిక్రీ) విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో రాజ్ ప్రసంగం వినేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. అయితే మాటలకు ఓట్లు రాలవని ప్రతి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌కు రుజువవుతూనే ఉంది. ఫలితంగా ఓటింగ్ శాతం నెమ్మదిగా దిగజారుతూ వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా అధికసంఖ్యలో సీట్లను చేజిక్కించుకోవాలని భావించిన రాజ్‌ఠాక్రే గెలిచే అవకాశాలున్నాయని భావించిన 128 స్ధానాల్లో తమ అభ్యర్ధులను పోటీలో నిలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్ధులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: మహారాష్ట్రలో సకుటుంబ సపరివార రాజకీయం
అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ తరపున గతంలో చేపట్టిన అనేక ఆందోళనల గురించి ప్రతీ సభలో వివరించారు. వీటినే ప్రధాన ప్రచార ఆ్రస్తాలుగా మలచుకున్నారు. టోల్ మాఫీ, రైల్వే ఉద్యోగాల భర్తీలో భూమిపుత్రులకు జరిగిన అన్యాయం, మసీదుల వద్దనున్న లౌడ్‌స్పీకర్లలోంచి పెద్ద శబ్దంతో వినిపించే నమాజ్‌కు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా వినిపించాలన్న ఆందోళన.. ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని తన ప్రసంగాల్లో వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను తొలగిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఇలా అనేక హామీలిచ్చారు. కాని అవేమి ఓటర్లకు రుచించలేదని శనివారం వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment