ఆయన లోక్‌సభ బరిలో లేరు ఆయన పార్టీ కూడా ఎన్నికలకి దూరంగా ఉంది. అయినా ఆయన ప్రచార సభలకి జనం వెల్లువెత్తుతున్నారు. ఒక్కో మాట తూటాలా పేలుతుంటే ఈలలు, చప్పట్లతో సభలు మార్మోగిపోతున్నాయి. ఆయన లక్ష్యం ఒక్కటే. ప్రధానమంత్రి మోదీ మళ్లీ అధికారం చేపట్టకూడదు. ఒకప్పుడు మోదీకి వీరభక్తుడే. కానీ ఇప్పుడు శత్రువు. తన సరికొత్త ప్రచారంతో రాత్రికి రాత్రి మోదీకి పక్కలో బల్లెంలా మారారు. ఆయనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) అధినేత రాజ్‌ఠాక్రే. ఆయన చేస్తున్న ప్రచారం ఎలా ఉంది ? దాని ప్రభావం ఎంత ?
అది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా లో హరిశాల్ అనే గ్రామం. అక్కడ ఓ భారీ ఎన్నికల బహిరంగ సభ జరుగుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. తమ ప్రియ తమ నాయకుడు ఏం చెబుతారా అన్న ఆసక్తి అక్కడికొచ్చిన వారందరిలోనూ కనిపిస్తోంది. అప్పుడు వేదిక మీదకి వచ్చా రు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే. అప్పటికే ఆయన వెనకాలే భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంది. రాజ్‌ఠాక్రే వచ్చిన వెంటనే తన అనుచరుడిని ఉద్దేశించి ‘యే.. లగావోరే వీడియో’ (ఏయ్.. ఆ వీడియో ప్లే చెయ్యి) అని ఆదేశించగానే దానిని ప్లే చేస్తారు. ఆ తెర పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షమవుతారు.
గత అయిదేళ్లలో ఆయన ఇచ్చిన హామీలు, ప్రకటిం చిన పథకాలు, పేపర్ క్లిప్పింగులు, అవి ఎంత విజయవంతమయ్యాయో స్వయంగా మోదీ చెప్పిన మాటలు, అన్నీ ఒక్కొక్కటికిగా వస్తూ ఉంటాయి. క్రమంగా వీడియో ఆగిపోతుంది. రాజ్‌ఠాక్రే మైక్ అందుకుంటారు. అప్పుడు మొదలవుతుంది ఆయన ప్రసంగం. సూటిగా సుత్తి లేకుండా . సింపుల్‌గా చెప్పాలంటే అది ప్రసంగం కాదు. అదొక రియాల్టీ చెక్. మోదీ చెప్పిన మాటల్లో నిజానిజాలెంతో సాక్ష్యాధారాలతో సహా చెప్పే ప్రయత్నం. మోదీ చెప్పిన ప్రతీ మాటకి రాజ్ ఠాక్రే నుంచి కౌంటర్ తూటాలా పేలుతుంది. మోదీ ఇచ్చిన హామీలు ఎలా గాల్లో కలిసిపోయాయో, మోదీ, షా ద్వయం ఎన్ని అబద్ధాలు చెప్పారో, ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారో గణాంకాలతో సహా వివరిస్తారు. 51 ఏళ్ల వయసులోనూ రాజ్ ఠాక్రే తన ప్రసంగాలతో జనంపై సమ్మోహనాస్త్రం వేస్తున్నారు.
ప్రచారంలో నవపథం
మహారాష్ట్రలో హరిశాల్‌ను మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మొదట ఆ వీడియోలో ప్రభుత్వం చేసిన ప్రకటన వస్తుంది. ఆ తర్వాత ఆ గ్రామంలో కరెంట్ లేక జనం పడుతున్న అవస్థలు, ఇంటర్నెట్ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆ వీడియోలోనే చూపించారు. అంతేకాదు ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కూడా స్టేజ్ మీదకి తీసుకువచ్చారు. తమ గ్రామంలో అసలు పరిస్థితి ఎలా ఉందో ఆయన నోటివెంటే చెప్పించారు. ఇదంతా చూశాక కూడా మోదీకి ఓటు వెయ్యాలని మీరు భావిస్తున్నారా అని జనాన్ని సూటిగా ప్రశ్నిం చారు. మరాఠీ భాషలో చమత్కారాలని ఉపయోగిస్తూ మోదీపై వ్యంగ్యబాణాలు విసురుతారు. అవన్నీ జనం గుండెల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయి. ముంబై, సోలాపూర్, లాతూర్, సతారా, పుణె ఇలా మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సరికొత్త ప్రచారంతో కొన్నేళ్లుగా నిస్తేజంగా ఉన్న రాజ్‌ఠాక్రే, ఆయన పార్టీ ఎంఎన్‌ఎస్‌కి మళ్లీ కొత్త జీవం వచ్చినట్టయింది.
ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టగలరా ?
రాజ్‌ఠాక్రే రూపొందించిన ఒక వీడియో క్లిప్‌కి వచ్చిన ప్రతిస్పందన చూసి కాషాయ శిబిరంలో కలవరం రేగుతోంది. తమకి అసలు సిసలు ప్రత్యర్థి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమా ? లేదంటే రాజ్ ఠాక్రేయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరిశాల్ గ్రామంలో ఒక్క వారంలో 8 లక్షల 50వేలు టాయిలెట్లు నిర్మించామని మోదీ చెప్పిన విజువల్ బైట్ మొదట ప్లే అవుతుంది. దానికి గణాంకాలని హాస్యాన్ని కలగలిపి తిప్పి కొట్టారు రాజ్ ఠాక్రే. మోదీ అరచేతిలో ఎలా స్వర్గం చూపిస్తున్నారో సోదాహరణంగా చెబుతున్నారు. ‘‘ఒక్క వారంలో 8.50 లక్షల టాయిలెట్లు అంటే, ఒక నిమిషానికి 84 టాయిలెట్లు కట్టాలి. అంటే ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టారన్న మాట. ఇదెలా సాధ్యం అంటూ జనం చప్పట్ల మధ్య ప్రసంగాన్ని ముగించారు.
ఈ ప్రచారం ప్రభావం ఎంత ?
మహారాష్ట్ర మీడియా రాజ్ సభలకి అద్భుతమైన కవరేజ్ ఇస్తోంది. అదే సమయంలో మోదీ సభ లైవ్ వస్తున్నా కట్ చేసి మరీ రాజ్‌ఠాక్రే సభనే చూపిస్తున్నారంటే ఆయన చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం ఎంతలా జనంలోకి చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. జనానికి అర్థమయ్యేలా వీడియోలు రూపొందించడం చూసి ఆశ్చర్యపోయిన ఒక జర్నలిస్టు రాజ్‌ఠాక్రేతో మాట్లాడినప్పుడు మీడియా తాను చేయాల్సిన పని చేయకపోవడంతో తానే స్వయంగా ఈ తరహా ప్రచారానికి దిగానని సమాధానం ఇవ్వడం విశేషం. అయితే రాజ్ చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఓట్లు వేసినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన పెద నాన్న, మరాఠీ టైగర్ బాల్‌ఠాక్రే తనని శివసేనకు వారసుడిగా ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్న రాజ్‌ఠాక్రే అవి అడియాసలు కావడంతో 2006లో పార్టీకి గుడ్‌బై కొట్టేశారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొత్త పార్టీ పెట్టాక రాజ్‌ఠాక్రే చేసే రెచ్చగొట్టే ప్రసంగాలకు జనం మంత్రముగ్ధులయ్యారే తప్ప ఆయనకు ఓట్లు మాత్రం రాలలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు సాధించిన ఎంఎన్‌ఎస్ 2014 అసెంబ్లీ ఒక్క సీటుకే పరిమితమైపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేస్తే 5శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు కూడా రాలేదు. రాజ్‌ఠాక్రే జనాకర్షక నాయకుడే కానీ ఓట్లు రాబట్టే నాయకుడు కాదన్న పేరు కూడా ఉంది.. మరి ఈ సారి ఠాక్రే చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఏ మేరకు ఓట్ల పంట పండిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment