raj tackrey
-
ఉద్ధవ్‌కు చెక్.. రాజ్‌ఠాక్రే సరికొత్త వ్యూహం..!
సాక్షి ముంబై : ఠాక్రే కుటుంబం నుంచి మరో వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నాడు. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే రాజకీయ అరంగ్రేటంకు అంతా సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తుండగా మరోవైపు అమిత్ సైతం రాజకీయాల్లో తనదైన ముద్రను వేసేందుకు సిద్దమవుతున్నాడు. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే జయంతి జనవరి 23వ తేదీన ముంబైలో జరగనున్న ఎమ్మెన్నెస్ మొట్టమొదటి మహా సమ్మేళనంలో అమిత్ రాజకీయాల్లో ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆదిత్యకు చెక్‌పెట్టేందుకే అమిత్‌ను తెరపైకి తీసుకువస్తున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నుంచే.. గత ఎన్నికల నుంచి అనేక రాజకీయ ఊహగానాలు కొనసాగుతున్నాయి. రాజ్ తన పార్టీ జెండాను మార్చేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు రాజ్ ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ బయటికి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో జరగబోయే మహా సమ్మేళనంలో రాజ్ ఠాక్రే పలు ప్రకటనలను చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తన కుమారున్ని రాజకీయాల్లోకి పూర్తిగా తీసుకువస్తారని ఎమ్మెన్నెస్ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ ఠాక్రే ఎంట్రీతో ఎమ్మెన్నెస్ పార్టీలో నూతన చైతన్యం వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ ఠాక్రే పలు స్థానిక సమస్యలపై గళమెత్తారు. అయితే అనంతరం మాత్రం ఆయన మళ్లీ పెద్దగా రాజకీయాల్లో కన్పించలేదు. 2015లోనే అమిత్ ఠాక్రే రాజకీయ అరంగేట్రం చేయనున్నారన్న వార్తలు వచ్చాయి. ముంబైలోని పర్యావరణ సమస్యలపై ఆయన గళమెత్తి రాజకీయాల్లోకి క్రియాశీలంగా రానున్నట్టు సంకేతాలిచ్చినప్పటికీ అలాంటిదేమి జరగలేదు. ఇప్పటికే శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే క్రియాశీలపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆదిత్య ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడమే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపొంది కేబినేట్ మంత్రిగా మారారు. మరోవైపు ఉద్దవ్ ఠాక్రే స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభోదన్ ఠాక్రే రెండో కుమారుడైన బాల్ ఠాక్రే మరాఠా భూమిపుత్రుల హక్కులను కాపాడేందుకు 1966లో శివసేన పార్టీని స్థాపించారు. అనంతరం పార్టీ ద్వారా బాల్ ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే, మనుమడు ఆదిత్య ఠాక్రేలు ఇప్పటికే రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అయితే ఉద్దవ్ ఠాక్రే నేతృత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్ ప్రారంభించారు. ఇప్పటి వరకు అమిత్ ఠాక్రే రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చారు. కానీ, ఇంకా దూరంగానే ఉన్నారు. అయితే తాజాగా మాత్రం ఆయన క్రియాశీలంగా రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిసింది. -
ఫడ్నవిస్‌తో రాజ్‌ఠాక్రే భేటీ..!
సాక్షి, ముంబై : సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలిచిన మహారాష్ట్రలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఫడ్నవిస్ నివాసంలో ఠాక్రే సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కూటమిగా ఏర్పడ్డ శివసేనకు చెక్ పెట్టేందుకు బీజేపీ, ఎమ్ఎన్ఎస్ కలుస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రానున్న జిల్లాపరిషత్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఎమ్ఎన్ఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని సమాచారం. దీనిపై చర్చించేందుకే రాజ్‌ఠాక్రే ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటి భేటీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
అయోధ్య తీర్పు: ‘కరసేవకుల కల సాకారం’
సాక్షి, ముంబై: అయోధ్య రామమందిర నిర్మాణం కోసం కరసేవకులు చేసిన పోరాటం వృథా కాలేదని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్పీ) చీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. అయోధ్య భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. ఈ మేరకు రాజ్ ఠాక్రే ట్విటర్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. బాలసాహెబ్ ఠాక్రే ఆలోచనలకు అనుగుణంగా నేడు తీర్పు వెలువడింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం కొరకు కరసేవకులు చేసిన పోరాటం వృథా కాలేదు. నేటికి పూర్తి ఫలితం లభించింది. సంతోషకరమైన వాతావరణంలో రామమందిర నిర్మాణాన్ని చేపడుతాం. దీనితో పాటు త్వరలోనే రామరాజ్యాన్నీ స్థాపిస్తాం.’ అంటూ ఠాక్రే ట్వీట్ చేశారు. కాగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పింది. MNS chief Raj Thackeray: I am happy today. All 'karsevaks' who gave sacrifices during the entire struggle..their sacrifice has not gone waste.Ram Temple must be constructed at the earliest. Along with Ram Temple, there should also be ‘Ram Rajya’ in the nation,that is my wish. pic.twitter.com/kUtg2cHTFN — ANI (@ANI) November 9, 2019 -
ఢంకా బజాయిస్తున్న రాజ్‌ఠాక్రే
ఆయన లోక్‌సభ బరిలో లేరు ఆయన పార్టీ కూడా ఎన్నికలకి దూరంగా ఉంది. అయినా ఆయన ప్రచార సభలకి జనం వెల్లువెత్తుతున్నారు. ఒక్కో మాట తూటాలా పేలుతుంటే ఈలలు, చప్పట్లతో సభలు మార్మోగిపోతున్నాయి. ఆయన లక్ష్యం ఒక్కటే. ప్రధానమంత్రి మోదీ మళ్లీ అధికారం చేపట్టకూడదు. ఒకప్పుడు మోదీకి వీరభక్తుడే. కానీ ఇప్పుడు శత్రువు. తన సరికొత్త ప్రచారంతో రాత్రికి రాత్రి మోదీకి పక్కలో బల్లెంలా మారారు. ఆయనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌ఠాక్రే. ఆయన చేస్తున్న ప్రచారం ఎలా ఉంది ? దాని ప్రభావం ఎంత ? అది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా లో హరిశాల్ అనే గ్రామం. అక్కడ ఓ భారీ ఎన్నికల బహిరంగ సభ జరుగుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోతోంది. తమ ప్రియ తమ నాయకుడు ఏం చెబుతారా అన్న ఆసక్తి అక్కడికొచ్చిన వారందరిలోనూ కనిపిస్తోంది. అప్పుడు వేదిక మీదకి వచ్చా రు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే. అప్పటికే ఆయన వెనకాలే భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంది. రాజ్‌ఠాక్రే వచ్చిన వెంటనే తన అనుచరుడిని ఉద్దేశించి ‘యే.. లగావోరే వీడియో’ (ఏయ్.. ఆ వీడియో ప్లే చెయ్యి) అని ఆదేశించగానే దానిని ప్లే చేస్తారు. ఆ తెర పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షమవుతారు. గత అయిదేళ్లలో ఆయన ఇచ్చిన హామీలు, ప్రకటిం చిన పథకాలు, పేపర్ క్లిప్పింగులు, అవి ఎంత విజయవంతమయ్యాయో స్వయంగా మోదీ చెప్పిన మాటలు, అన్నీ ఒక్కొక్కటికిగా వస్తూ ఉంటాయి. క్రమంగా వీడియో ఆగిపోతుంది. రాజ్‌ఠాక్రే మైక్ అందుకుంటారు. అప్పుడు మొదలవుతుంది ఆయన ప్రసంగం. సూటిగా సుత్తి లేకుండా . సింపుల్‌గా చెప్పాలంటే అది ప్రసంగం కాదు. అదొక రియాల్టీ చెక్. మోదీ చెప్పిన మాటల్లో నిజానిజాలెంతో సాక్ష్యాధారాలతో సహా చెప్పే ప్రయత్నం. మోదీ చెప్పిన ప్రతీ మాటకి రాజ్ ఠాక్రే నుంచి కౌంటర్ తూటాలా పేలుతుంది. మోదీ ఇచ్చిన హామీలు ఎలా గాల్లో కలిసిపోయాయో, మోదీ, షా ద్వయం ఎన్ని అబద్ధాలు చెప్పారో, ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారో గణాంకాలతో సహా వివరిస్తారు. 51 ఏళ్ల వయసులోనూ రాజ్ ఠాక్రే తన ప్రసంగాలతో జనంపై సమ్మోహనాస్త్రం వేస్తున్నారు. ప్రచారంలో నవపథం మహారాష్ట్రలో హరిశాల్ను మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా ప్రభుత్వం గతంలో ప్రకటించింది. మొదట ఆ వీడియోలో ప్రభుత్వం చేసిన ప్రకటన వస్తుంది. ఆ తర్వాత ఆ గ్రామంలో కరెంట్ లేక జనం పడుతున్న అవస్థలు, ఇంటర్నెట్ లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆ వీడియోలోనే చూపించారు. అంతేకాదు ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కూడా స్టేజ్ మీదకి తీసుకువచ్చారు. తమ గ్రామంలో అసలు పరిస్థితి ఎలా ఉందో ఆయన నోటివెంటే చెప్పించారు. ఇదంతా చూశాక కూడా మోదీకి ఓటు వెయ్యాలని మీరు భావిస్తున్నారా అని జనాన్ని సూటిగా ప్రశ్నిం చారు. మరాఠీ భాషలో చమత్కారాలని ఉపయోగిస్తూ మోదీపై వ్యంగ్యబాణాలు విసురుతారు. అవన్నీ జనం గుండెల్లోకి సూటిగా దూసుకుపోతున్నాయి. ముంబై, సోలాపూర్, లాతూర్, సతారా, పుణె ఇలా మహారాష్ట్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సరికొత్త ప్రచారంతో కొన్నేళ్లుగా నిస్తేజంగా ఉన్న రాజ్‌ఠాక్రే, ఆయన పార్టీ ఎంఎన్ఎస్కి మళ్లీ కొత్త జీవం వచ్చినట్టయింది. ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టగలరా ? రాజ్‌ఠాక్రే రూపొందించిన ఒక వీడియో క్లిప్‌కి వచ్చిన ప్రతిస్పందన చూసి కాషాయ శిబిరంలో కలవరం రేగుతోంది. తమకి అసలు సిసలు ప్రత్యర్థి కాంగ్రెస్, ఎన్సీపీ కూటమా ? లేదంటే రాజ్ ఠాక్రేయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరిశాల్ గ్రామంలో ఒక్క వారంలో 8 లక్షల 50వేలు టాయిలెట్లు నిర్మించామని మోదీ చెప్పిన విజువల్ బైట్ మొదట ప్లే అవుతుంది. దానికి గణాంకాలని హాస్యాన్ని కలగలిపి తిప్పి కొట్టారు రాజ్ ఠాక్రే. మోదీ అరచేతిలో ఎలా స్వర్గం చూపిస్తున్నారో సోదాహరణంగా చెబుతున్నారు. ‘‘ఒక్క వారంలో 8.50 లక్షల టాయిలెట్లు అంటే, ఒక నిమిషానికి 84 టాయిలెట్లు కట్టాలి. అంటే ప్రతీ అయిదు సెకన్లకి ఏడు టాయిలెట్లు కట్టారన్న మాట. ఇదెలా సాధ్యం అంటూ జనం చప్పట్ల మధ్య ప్రసంగాన్ని ముగించారు. ఈ ప్రచారం ప్రభావం ఎంత ? మహారాష్ట్ర మీడియా రాజ్ సభలకి అద్భుతమైన కవరేజ్ ఇస్తోంది. అదే సమయంలో మోదీ సభ లైవ్ వస్తున్నా కట్ చేసి మరీ రాజ్‌ఠాక్రే సభనే చూపిస్తున్నారంటే ఆయన చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం ఎంతలా జనంలోకి చొచ్చుకుపోయిందో అర్థమవుతుంది. జనానికి అర్థమయ్యేలా వీడియోలు రూపొందించడం చూసి ఆశ్చర్యపోయిన ఒక జర్నలిస్టు రాజ్‌ఠాక్రేతో మాట్లాడినప్పుడు మీడియా తాను చేయాల్సిన పని చేయకపోవడంతో తానే స్వయంగా ఈ తరహా ప్రచారానికి దిగానని సమాధానం ఇవ్వడం విశేషం. అయితే రాజ్ చేస్తున్న ప్రచారం ఎన్నికల్లో ఓట్లు వేసినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తన పెద నాన్న, మరాఠీ టైగర్ బాల్‌ఠాక్రే తనని శివసేనకు వారసుడిగా ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్న రాజ్‌ఠాక్రే అవి అడియాసలు కావడంతో 2006లో పార్టీకి గుడ్‌బై కొట్టేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొత్త పార్టీ పెట్టాక రాజ్‌ఠాక్రే చేసే రెచ్చగొట్టే ప్రసంగాలకు జనం మంత్రముగ్ధులయ్యారే తప్ప ఆయనకు ఓట్లు మాత్రం రాలలేదు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు సాధించిన ఎంఎన్ఎస్ 2014 అసెంబ్లీ ఒక్క సీటుకే పరిమితమైపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 11 సీట్లలో పోటీ చేస్తే 5శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ మాత్రం ఓట్లు కూడా రాలేదు. రాజ్‌ఠాక్రే జనాకర్షక నాయకుడే కానీ ఓట్లు రాబట్టే నాయకుడు కాదన్న పేరు కూడా ఉంది.. మరి ఈ సారి ఠాక్రే చేస్తున్న ఈ సరికొత్త ప్రచారం కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఏ మేరకు ఓట్ల పంట పండిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
మరో పుల్వామా ఘటన జరగొచ్చు..!
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలలోపు పుల్వామా ఉగ్రదాడి లాంటి ఘటన మరోకటి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. సైనికుల త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ లబ్ధికోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎంఎన్‌ఎస్పీ 13వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా శనివారం పార్టీ ముఖ్యనేతల సమావేశంలో రాజ్ ఠాక్రే మాట్లాడారు. పాక్‌పై మరోసారి దాడి చేసి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని మోదీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. గతంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పాక్‌పై మెరుపు దాడులు చేశారని అన్నారు. అంతకుమందే భారత ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా కలిసినట్లు ఠాక్రే గుర్తుచేశారు. భారత వైమానిక దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అమిత్ షా ఎలా ప్రకటిస్తారని, ఆయన ఏమైనా కో ఫైలట్టా అని ప్రశ్నించారు. పాక్‌తో ఉగ్రదాడి పొంచిఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించినప్పటికీ సరిహద్దుల్లో భద్రతను ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. -
రాజ్‌కీయం?!
ఎమ్మెన్నెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో తేలనున్న అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వైఖరి ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఏం చేయనున్నారు..? బీజేపీ అగ్రనేతల ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారా? అభ్యర్థులను ప్రకటించకుండా పరోక్షంగా ‘మహా’ కూటమికి సహకరించేందుకు సిద్ధమయ్యారా? లేకపోతే అభ్యర్థులను బరిలోకి దింపుతానని ప్రకటిస్తారా? అసలు రాజ్ నిర్ణయం ఎలా ఉండోబోతోంది? అసలు ఏం చేయబోతున్నారో? అనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆదివారంనాడు జరగనున్న ఎమ్మెన్నెస్ పార్టీ ఎనిమిదో వార్షికోత్సవంలో రాజ్‌ఠాక్రే దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని పార్టీ ఉపాధ్యక్షుడు వాగీశ్ సరస్వత్ శనివారం మీడియాకు తెలిపారు. ‘మాది రాజకీయ పార్టీ. అన్ని ఎన్నికలు మాకు ప్రధానమే. తమ పార్టీ కొంతమందికి మిత్ర మండల్ కాద’న్నారు. ఇప్పటికే రాజ్‌ఠాక్రేతో భేటీ గురించి బీజేపీ నాయకులు మీడియాకు వివరించారని తెలిపారు. అయితే ఎన్నికల్లో అనుసరించాల్సిన పద్ధతిపై ఇప్పటికే రాజ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ఆఫీస్ బేరర్లతో చర్చించారన్నారు. దీనిపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. కాగా, కొన్ని రోజుల క్రితం బీజేపీ నేతలు నితిన్ గడ్కారీ, వినోద్ తావ్డే, ముంబై బీజేపీ అధ్యక్షుడు అశీష్ షెలార్‌లు రాజ్‌ఠాక్రేను కలిసి లోక్‌సభకు అభ్యర్థులను బరిలోకి దింపవద్దని కోరారు. గతంలో జరిగిన అనుభవం దృష్ట్యా ఈసారి కాంగ్రెస్ కూటమిని దెబ్బకొట్టాలంటే పోటీకి దింపకపోవడమే మంచిదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అవసరమనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరిస్తామనే హామీ కూడా ఇచ్చారు. ఈ నెల 20న జరగనున్న విధాన మండలి ఎన్నికల్లో బీజేపీకి 12 మంది ఎమ్మెన్నెస్ ఎమ్మెల్యేలు మద్దతును కూడా ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఇదిలావుండగా 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ 12 లోక్‌సభ స్థానాలకు పోటీచేసింది. ముంబైలోని అన్ని స్థానాలతో పాటు ఠాణే, నాసిక్, పుణేలో బరిలోకి దిగిన ఎమెన్నెస్ అభ్యర్థులకు లక్షకు పైగా ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లను గెలుచుకుంది. మరాఠీ ఓట్లను చీల్చడం ద్వారా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి లబ్ధి చేకూరేలా వ్యవహరించిందని అప్పట్లో కాషాయకూటమి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏర్పాట్లు పూర్తి... ముంబైలో జరిగే పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవానికి నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రం నలుమూలాల నుంచి వచ్చే నేతలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు.