సాక్షి ముంబై : ఠాక్రే కుటుంబం నుంచి మరో వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నాడు. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే రాజకీయ అరంగ్రేటంకు అంతా సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తుండగా మరోవైపు అమిత్ సైతం రాజకీయాల్లో తనదైన ముద్రను వేసేందుకు సిద్దమవుతున్నాడు. శివసేన అధినేత దివంగత బాల్ ఠాక్రే జయంతి జనవరి 23వ తేదీన ముంబైలో జరగనున్న ఎమ్మెన్నెస్ మొట్టమొదటి మహా సమ్మేళనంలో అమిత్ రాజకీయాల్లో ఎంట్రీ ఖాయమని తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న ఆదిత్యకు చెక్‌పెట్టేందుకే అమిత్‌ను తెరపైకి తీసుకువస్తున్నారని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల నుంచే..
గత ఎన్నికల నుంచి అనేక రాజకీయ ఊహగానాలు కొనసాగుతున్నాయి. రాజ్ తన పార్టీ జెండాను మార్చేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు రాజ్ ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ బయటికి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో జరగబోయే మహా సమ్మేళనంలో రాజ్ ఠాక్రే పలు ప్రకటనలను చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. తన కుమారున్ని రాజకీయాల్లోకి పూర్తిగా తీసుకువస్తారని ఎమ్మెన్నెస్ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ ఠాక్రే ఎంట్రీతో ఎమ్మెన్నెస్ పార్టీలో నూతన చైతన్యం వస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు పరిశీలిస్తే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అమిత్ ఠాక్రే పలు స్థానిక సమస్యలపై గళమెత్తారు. అయితే అనంతరం మాత్రం ఆయన మళ్లీ పెద్దగా రాజకీయాల్లో కన్పించలేదు. 2015లోనే అమిత్ ఠాక్రే రాజకీయ అరంగేట్రం చేయనున్నారన్న వార్తలు వచ్చాయి. ముంబైలోని పర్యావరణ సమస్యలపై ఆయన గళమెత్తి రాజకీయాల్లోకి క్రియాశీలంగా రానున్నట్టు సంకేతాలిచ్చినప్పటికీ అలాంటిదేమి జరగలేదు.
ఇప్పటికే శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే క్రియాశీలపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఆదిత్య ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడమే కాకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలుపొంది కేబినేట్ మంత్రిగా మారారు. మరోవైపు ఉద్దవ్ ఠాక్రే స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభోదన్ ఠాక్రే రెండో కుమారుడైన బాల్ ఠాక్రే మరాఠా భూమిపుత్రుల హక్కులను కాపాడేందుకు 1966లో శివసేన పార్టీని స్థాపించారు. అనంతరం పార్టీ ద్వారా బాల్ ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే, బాల్ ఠాక్రే కుమారుడు ఉద్దవ్ ఠాక్రే, మనుమడు ఆదిత్య ఠాక్రేలు ఇప్పటికే రాజకీయంగా క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. అయితే ఉద్దవ్ ఠాక్రే నేతృత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్ ప్రారంభించారు. ఇప్పటి వరకు అమిత్ ఠాక్రే రాజకీయాల్లోకి వచ్చినట్టే వచ్చారు. కానీ, ఇంకా దూరంగానే ఉన్నారు. అయితే తాజాగా మాత్రం ఆయన క్రియాశీలంగా రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment