ముంబై: నగరవాసుల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషిచేస్తోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఆయన బుధవారం ఎలివేటెడ్ రోడ్డును ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘ ఈ 2.2 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇకపై పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హై వే నుంచి నేరుగా అంధేరీలోని ఛత్రపతి శివాజీ (సహార్) అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-2కు ముంబైకర్లు నేరుగా చేరుకోవచ్చు’నని అన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఇటీవల ఈస్టర్న్ ఫ్రీవేను, తర్వాత టెర్మినల్-2ను ప్రారంభించిందని, ఇప్పుడు ఎలివేటెడ్ రోడ్డు సేవలను అందజేస్తోందని తెలిపారు.
ఈ ప్రాజెక్టుల వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోడ్డు వల్ల సుమారు 30 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుందని ఆయన వివరించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎంఎంఆర్‌డీఏ) సంయుక్తంగా పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాయని సీఎం చెప్పారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి ఫేజ్ పనులను వచ్చే నెలాఖరుకల్లా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామన్నారు. అలాగే శాంతాక్రజ్-చెంబూర్ లింక్ రోడ్డుపై మరో రెండు, మూడు వారాల్లో వాహనాల రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే కొలాబా-సీప్జ్ మధ్య మూడో మెట్రో పనులను సైతం త్వరలోనే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి
Published Wed, Feb 12 2014 10:56 PM | Last Updated on Mon, Oct 8 2018 6:14 PM
Advertisement