
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్‌ఎన్‌ఎస్) కార్యకర్తలను చిరువ్యాపారులు శనివారం చితక్కొట్టారు. రాజ్ ఠాక్రే పార్టీకి చెందిన 15 మంది కార్యకర్తలు నగరంలోని మలడ్ రైల్వే స్టేషన్ వద్ద దురాక్రమణలను పరిశీలించేందుకు వెళ్లారు. రైల్వే స్టేషన్ పరిధిలోని భూమిలో అక్రమంగా నిలిపిన దుకాణాలను తొలగించాలని వారికి చెప్పారు. దీంతో ఆగ్రహించిన 100 మంది చిరు వ్యాపారులు వారిపై రాడ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ నిరుపమ్ మలడ్ రైల్వే స్టేషన్ పరిధిలోని చిరు వ్యాపారులతో సమావేశమైన తర్వాత వారు దాడికి పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది.
చిరు వ్యాపారుల దాడిలో ఓ ఎమ్‌ఎన్‌ఎస్ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్‌ఎన్‌ఎస్) దురాక్రమణకు గురైన రైల్వే స్థలాలపై ప్రచార కార్యక్రమాలను ఆపబోమని పేర్కొంది.