సినిమా చిత్రీకరణలో సహ నటులు, దర్శకుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తనుశ్రీ దత్తా పలువురు బాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేశారు. నటుడు నానా పటేకర్, దర్శకులు వివేక్ అగ్నిహోత్రి, రాకేష్ సారంగ్, కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యా, నిర్మాత సామీ సిద్దిఖీలపై ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, నానాపై ఆరోపణలు మానుకోవాలని వచ్చిన ఒత్తిడులకు తలొగ్గొలేదని ఆమె మంగళవారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నానాపై ఆరోపణలు చేయొద్దని రాజ్‌థాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్‌ఎస్) నాయకులు తనను బెదిరించారని తనుశ్రీ పత్రికాముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు.
కాగా, తనుశ్రీ వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఇంటి చుట్టూ 24 గంటల పోలీస్ ప్రొటెక్షన్ కల్పించింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర హోంమంత్రి దీపక్ కేస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. తనుశ్రీ విజ్ఞప్తి మేరకు రక్షణ కల్పించామని అన్నారు. ఈ చర్యను నానా పటేకర్‌కు వ్యతిరేకమైందిగా భావించొద్దని అన్నారు. ఇదిలాఉండగా.. బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో-12వ సీజన్‌లో తనుశ్రీ పాల్గొనబోతోందనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఎన్‌ఎస్ స్పందించింది. తనుశ్రీకి బిగ్‌బాస్ ఆహ్వానం పలకకూడదంటూ ఎంఎన్‌ఎస్ యూత్‌వింగ్ నేతలు కార్యక్రమ నిర్వాహకులకు లెటర్ ఇచ్చారు. తమపై బెదిరింపు ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. బిగ్‌బాస్ షోలో తనుశ్రీ పాల్గొంటే చోటుచేసుకునే పరిణామాలకు ఎంఎన్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం ఉండబోదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment