రాజ్‌ఠాక్రే, శరద్‌పవార్(ఫైల్)
సాక్షి, ముంబై: రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో రహస్యంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో జతకట్టి 35–50 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేయాలని ఇప్పటి నుంచే ఎమ్మెన్నెస్ పార్టీ నాయకులు వ్యూహం పన్నుతున్నారు. అసెంబ్లీలో మద్దతిస్తే లోకసభ ఎన్నికల్లో ఇరుపార్టీల అభ్యర్థులున్న చోట ఎమ్మెన్నెస్ పోటీచేయకూడదని నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది.
కాంగ్రెస్‌తో కష్టమే..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వ్యతిరేక పార్టీలన్ని ఒకతాటిపైకి రావల్సిన అవసరం ఉందని ఉగాది రోజున శివాజీపార్క్ మైదానంలో జరిగిన మేళావాలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై దృష్టి సారించారు. ఉత్తర భారతీయులకు వ్యతిరేక పార్టీగా గుర్తింపు పొందిన ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అందుకు ప్రధాన కారణం ఎలాంటి ఎన్నికలైనా కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తర భారతీయులు, ముస్లింల ఓట్లతోనే విజయ ఢంకా మోగిస్తారు. దీంతో ఎమ్మెన్నెస్‌తో కాంగ్రెస్ జత కష్టమే.
కాగా, ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి పోటీ చేయడం, కొన్నింటిలో ఒంటరిగా బరిలోకి దిగడం లాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. దీంతో విభేదాలున్నా.. కాంగ్రెస్, ఎన్సీపీలతో రహస్యంగా పొత్తు పెట్టుకోవాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో 100–150 స్థానాల్లో పోటీ చేసే బదులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న 35–50 స్థానాలను ఎంపిక చేసుకుని అక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని ఎమ్మెన్నెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి పరోక్షంగా మద్దతు తీసుకునే అవకాశాలున్నాయి.
అసెంబ్లీలో సాయం చేస్తే.. లోకసభకు మద్దతు
ఇటీవల ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. అందులో 35–50 నియోజక వర్గాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు నాలుగు, ఐదో స్థానాల్లో ఉండగా, ఎమ్మెన్నెస్ రెండు, మూడో స్థానాల్లో నిలిచింది. ఈ స్థానాల్లో ఇరుపార్టీల సాయం తీసుకునే అవకాశాలున్నాయి. ముంబై, థానే, నాసిక్‌తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని నియోజక వర్గాలలో పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరయ్యే పనులు ప్రారంభించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒకే ఎమ్మెల్యేతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్సీపీతో రహస్యంగా జతకట్టి ఎక్కువ స్థానాలు గెలుపించుకునే ప్రయత్నం చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తే కాంగ్రెస్, ఎన్సీపీ ఫలితాలపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలా...? వద్దా..? అనే దానిపై రాజ్ ఠాక్రే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపార్టీలు ఎమ్మెన్నెస్‌కు పరోక్షంగా సహకరిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కూడా పరోక్షంగా సహకరించే అవకాశాలున్నాయి. లేదంటే ఐదు లేదా ఆరు లోక్‌సభ నియోజకవర్గాలలో ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలో దింపే ప్రయత్నం చేయనుంది. ఒకవేళ 2019లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌కు ఇరు పార్టీలు సహకరిస్తే బీజేపీ, శివసేనకు కొంత మేర నష్టం జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment