పార్టీ గుర్తు మార్చే పనిలో ఎంఎన్ఎస్!
ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో రాజ్‌ఠాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎంఎన్ఎస్) కొత్త పార్టీ గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ పార్టీ గుర్తుగా రైలింజన్‌ను దాదాపు ఖరారు చేసినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎన్ఎస్ పార్టీ మహారాష్ట్రలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 13 స్థానాలు సాధించిన ఎంఎన్ఎస్, 2013లో మాత్రం కేవలం ఒక స్థానం సాధించి పూర్తిగా చతికలపడిన విషయం తెలిసిందే.
పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికే గుర్తు మారుస్తున్నారని పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ కారణాలు మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆర్టిస్టులపై నిషేధం విషయంలో ఎంఎన్ఎస్ నేతలు వీరంగం సృష్టించారు. థియేటర్ల యాజమాన్యాన్ని బెదిరించడం, బాలీవుడ్ దర్శకనిర్మాతలను హెచ్చరిస్తూ వ్యవహారాన్ని పెద్దది చేయడంతో.. ఇండస్ట్రీకి చెందిన కొందరు ఏకంగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆశ్రయించారు. చివరికి కరణ్ జోహర్ తీసిన మూవీ విడుదలై రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. పార్టీ గుర్తు మార్చితే.. బీఎంసీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఫేట్ మారుతుందో లేదో తెలియాలంటే ఆ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.