ప్రజల మనసులు గెలుచుకోండి..
సాక్షి, ముంబై: మనసులు గెలుచుకోండి .. ఓట్లు అవే పడతాయని (మన్ జింకా, మత్ అపోఆప్ పడ్‌తీల్) మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎన్నికల ఘోరపరాజయం అనంతరం రాజ్ ఠాక్రే పుణేలో పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పదాధికారులు, కార్యకర్తలతో శనివారం సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ ప్రణాళికలతోపాటు పదాధికారులు, కార్యకర్తలు ఎవరు ఎలా వ్యవహరించాలనే విషయంపై మాట్లాడారు. ముఖ్యంగా ఓట్లను దృష్టిలో ఉంచుకుని ప్రజల వద్దకి వెళ్లవద్దని, ముందు ప్రజల మనసులు గెల్చుకున్నట్టయితే, ఓట్లు అవే వస్తాయని హితబోధ చేశారు. పార్టీ కార్యకర్త, పదాధికారిగా కాకుండా ఓ మంచి పౌరునిగా ఆలోచించాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని సూచించారు.
పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు...
పార్టీ నియమాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. అనేక మంది తమ పనులను వదిలి ఇతరుల పనుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా శాఖాధ్యక్షుడు, పట్టణాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇలా పదవుల బట్టి ఎవరు ఏం చేయాలనేది ముందే పార్టీ సూచిస్తుంది.. వారి పరిధిని పాటిస్తూ ముందుకు పోతే సరిపోతుంది.. తప్పితే ఎవరైనా తమ పరిధిలోకి రాని విషయాల్లో జోక్యం చేసుకుంటూ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
జన్మదిన శుభాకాంక్షల హోర్డింగులు వద్దు..
ఇకపై పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తల జన్మదిన శుభాకాంక్షల హోర్డింగులు ఏర్పాటు చేయవద్దని రాజ్ ఠాక్రే ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడైన ఎమ్మెన్నెస్ పదాధికారుల జన్మదినోత్సవాల హోర్డింగ్‌లు కన్పిస్తే.. ఆ మరుసటి రోజే ఆ పదవిలో ఆ పదాధికారి ఉండరన్నారు. ‘ఇలా ఆర్భాటంగా మన పుట్టినరోజు హోర్డింగులు ఏర్పాటుచేసుకునే బదులు స్థానికంగా ఎవరైనా పుట్టినరోజు పండుగ జరుకుకుంటుంటే వారి వద్దకు వెళ్లి పార్టీ తరఫున ఒక బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిచూడండి.. మీపై ఆ కుటుంబానికి ఎంత అభిమానం పెంచుతుంది..’ అని సూచించారు. అలాగే పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆల్ దిబెస్ట్ చెప్పండి. ఇలాంటివి చేసేసమయంలో పార్టీ జెండాలు, బ్యానర్లు ఉపయోగించవద్దు.. షర్ట్‌కు పార్టీ చిహ్నం, పార్టీ పేరు స్ట్రిక్కర్ తగిలించుకుంటే సరిపోతుందని తెలిపారు.
ఇకపై నాకు నేరుగా ఈ-మెయిల్ చేయండి..
మహారాష్ట్రలోని పార్టీ కార్యకర్తలను అందరితో మాట్లాడేందుకు సాధ్యంకాదు. కాని రాష్ట్రంతోపాటు తమతమ ప్రాంతాల్లోని సమస్యలు, వాటికి ఏవైనా పరిష్కారాలుంటే ఎలా చేయవచ్చనే సూచనలు తదితరాన్ని నాకు నేరుగా పంపించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తాను ఛిౌ్ఛఛ్ట్ట్చ్జ్టిజ్చిఛిజ్ఛుట్చడఃజఝ్చజీ.ఛిౌఝ అనే ఈ-మెయిల్ అకౌంట్‌ను కొత్తగా ప్రారంభించినట్టు చెప్పారు. దీనిపై ఎవరైనా సరే కొత్త ఆలోచనలు, సలహాలు, సూచనలు అన్ని పంపవచ్చన్నారు. పార్టీకి, ప్రజలకు మేలుచేసే సూచనలను తప్పకుండా స్వీకరించి అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు.
తొందర్లోనే ప్రక్షాళన...
పుణే లో తొందర్లోనే పార్టీని ప్రక్షాళన చేయనున్నట్లు రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. పార్టీ నియమాలను ఉల్లంఘించిన కొందరిపై వేటువేయనున్నట్లు తెలిపారు. తొందర్లోనే పార్టీ పదాధికారుల కొత్త జాబితాను ప్రకటిస్తామని, అదేవిధంగా జాబితాతోపాటు ఎవరు ఏం చేయాలనే వారి వారి ప్రొటోకాల్స్‌ను కూడా వారికి తెలుపనున్నట్టు చెప్పారు. అప్పటివరకు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలని రాజ్ ఠాక్రే వారికి సూచించారు.