ముంబై: మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలూ ఉన్నందునా.. రాజకీయ స్థిరత్వం కోసం పావులు కదుపుతోంది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్(మధ్య ముంబై)లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్.. గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు.
రాజ్‌థాక్రేకు గత నెలలో సర్జరీ జరిగింది. అలాగే షిండే వర్గంతో పొత్తు సమయంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవికి సుముఖత వ్యక్తం చేశారు ఫడ్నవీస్. ఆ సమయంలో ఫడ్నవీస్ త్యాగాన్ని కొనియాడాడు రాజ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే..
మొదటి నుంచి ఎంఎన్‌ఎస్.. బీజేపీకి మద్దతుదారు పార్టీనే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది ఎంఎన్‌ఎస్. అలాగే త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకోవైపు మంత్రి వర్గ కూర్పు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది.
కేబినెట్‌లో చోటు!
మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కొనసాగేందుకు అవసరమైన మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో షిండే వర్గంతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఎంఎన్‌ఎస్ మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు ఉన్నది ఒక్క సీటే అయినా.. కేబినెట్‌లో స్థానం ద్వారా మరింత మచ్చిక చేసుకోవాలని బీజేపీ-షిండే వర్గం భావిస్తోంది.
ఎంఎన్‌ఎస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్‌ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్‌కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. అయితే.. ఇదికాకుండా మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచింది.
రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్‌లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇస్తే.. ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాలి. దీంతో బీజేపీ ఆఫర్‌పై రాజ్ థాక్రే పార్టీ వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment