సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత నెలలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు.
అంతేగాకుండా డిసెంబరు 5–9 తేదీల మధ్య ఏదో ఒకరోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని శిందే, ఫడ్నవీస్ సంకేతాలిచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రత్యక్షంగా ఈ ముహూర్తం కూడా దాటిపోయే అవకాశం ఏర్పడింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఇంతవరకు శిందే, ఫడ్నవీస్ మధ్య సాధారణ చర్చగాని, సమావేశంగాని జరగలేదు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తిరుగుబాటు లేదా దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలరోజులకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వారికి ఆవకాశం దొరకకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది.
ముఖ్యంగా అప్పట్లో ఏక్‌నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆ విధంగా తనతో వచ్చిన ఎమ్మెల్యేలందరికీ శిందే హామీ కూడా ఇచ్చారు. కానీ ఆ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి మళ్లీ సొంత గూటి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) లోకి చేరే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షో¿భంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని శిందే, ఫడ్నవీస్ ప్రకటించి అసంతృప్తులందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. కానీ అసంతృప్తులకు హామీ ఇచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తోంది.
అసెంబ్లీ సమావేశాలకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి. కానీ ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. కనీసం శిందే, ఫడ్నవీస్ మధ్య చర్చ కూడా జరగడం లేదు. శిందే, ఫడ్నవీస్ ఆదివారం నాగ్‌పూర్–షిర్డీ హై స్పీడ్ కారిడార్‌పై ట్రయల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఫడ్నవీస్ ఢిల్లీ వెళతారని తెలిసింది. ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నాగ్‌పూర్ పర్యటనకు వస్తున్నారు. ఆ సమయంలో నాగ్‌పూర్‌లో మెట్రో రైలు మార్గం, దివంగత బాల్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ నాగ్‌పూర్–షిర్డీ మొదటి దశ 520 కిలోమీటర్ల మేర మార్గాన్ని మోడీ ప్రారంభిస్తారు. దీంతో మోడీ పర్యటన నేపధ్యంలో శిందే, ఫడ్నవీస్ ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతాయి. దీన్ని బట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని స్పష్టమవుతోంది.
కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు...
అసెంబ్లీ శీతాకాల సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని, రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులేతో శిందే సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనుమతి కోసం వేచి ఉండకుండా, కూటమి భాగస్వాములు ఇద్దరూ కలిసి కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించవచ్చని నిర్ణయించారు. ‘శిందే తిరుగుబాటులో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయకుంటే.. విస్తరణలో తమ పేర్లు చేర్చకుంటే ఆందోళనకు దిగుతామని కొందరు హెచ్చరించారు.
అసంతృప్త ఎమ్మెల్యేలను కేటాయింపుల ద్వారా శాంతింపజేయడమే సీఎం శిందే ముందున్న తక్షణ సమస్య’’ అని పేరు వెల్లడించని ఒక బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితమే తొలి మంత్రివర్గ విస్తరణ జరిగినా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు ఇంకా కేటాయించలేదు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలపై గరిష్ట శాఖల భారం ఉంది. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ విధానాలపై, పరిపాలన అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. శిందే, ప్రముఖ మంత్రులతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అందువల్లనే విస్తరణలను ఆలస్యం చేయడంపై వారు చాలా ఆలోచిస్తున్నారు’’ అని ఆ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు.
కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులను కేటాయిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడ్డట్టేనని శిందే సన్నిహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇంతకుముందు క్రీమ్ పోర్ట్‌ఫోలియోలను డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. మంత్రి పదవి లభించని పక్షంలో బోర్డులతో సరిపెట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల పోటీ తగ్గుతుంది. కాబట్టి తర్వాత, పోర్ట్‌ఫోలియోలను పంపిణీ చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం మాకు సమస్య కాదు. ఇది పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహం’ ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment