సాక్షి, ముంబై: నెల రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణకుæ ఎట్టకేలకు ముహూర్తం లభించింది. శిందే, ఫడ్నవీస్ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం ప్రస్తుతం మినీ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ నివాసమైన రాజ్ భవన్‌లో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన 18–20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
ఆ తరువాత మరోదశలో శిందే, ఫడ్నవీస్ వర్గంతోపాటు భాగస్వామ్య చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అందుకోసం రాజ్ భవన్‌లోని సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అంతేగాకుండా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేతలు, పదాధికారులు, శివసైనికులు, మద్దతుదారులు రాజ్‌భవన్‌కు వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, రాజ్ భవన్ వచ్చే మార్గంలో, పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం పూర్తికాగానే ఈ నెల 10–17 తేదీల మధ్య వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ రూపొందించడంలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ నిమగ్నమైంది. త్వరలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తుది షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయనుంది. ఇదిలాఉండగా మంత్రివర్గంలో స్ధానం లభించిన ఇరు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలందరూ సోమవారం రాత్రి వరకు ముంబైకి చేరుకోవాలని సమాచారం పంపించారు.
సీనియర్లకు పెద్దపీట..
బీజేపీ నుంచి ఇదివరకు మంత్రులుగా పనిచేసిన అనుభవం, పాత ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో మళ్లీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత కొత్త ముఖాలకు అవకాశమివ్వనున్నట్లు తెలిసింది. ఏక్‌నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకున్న తరువాత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫడ్నవీస్ శిందే నివాసమైన నందన్‌వన్ బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ సుమారు గంటన్నరకుపైగా మంత్రివర్గ విస్తరణపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావీయకుండా సోమవారం రాత్రే మంత్రివర్గ విస్తరణ చేపట్టి, ఆ తరువాత ప్రమాణ స్వీకారం చేయించాలని శిందే, ఫడ్నవీస్ భావించారు. కాని ఇంత తక్కువ సమయంలో తమ తమ నియోజక వర్గాలలో నివాసముంటున్న ఇరు వర్గాల ఎమ్మెల్యేలందరినీ ముంబైకి రప్పించడం సా«ధ్యం కాదని గుర్తించారు. చివరకు మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు.
చదవండి: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..
ఎట్టకేలకు విస్తరణ కొలిక్కి...
గత నెలలో శివసేన పార్టీలో అసంతృప్తితో ఉన్న ఏక్‌నాథ్ శిందే 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుచేసి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు, మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత జూన్ 30న ఏక్‌నాథ్ శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ప్రక్రియ చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే.
కాని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెల మీద వారం రోజులు కావస్తున్నప్పటికీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంపై మహావికాస్ ఆఘాడికి చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారం చేజారిపోవడంతో ఇప్పటికే మహా వికాస్ ఆఘాడి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి వర్గంలో శిందే, ఫడ్నవీస్ ఇద్దరే ఉన్నారని, ప్రభుత్వ పాలన ఇద్దరి చేతుల మీదుగానే కొనసాగుతుందని దుయ్యబట్టసాగారు. సంబంధిత శాఖల మంత్రులు, జిల్లా ఇంచార్జి మంత్రులు లేక ప్రభుత్వ పనులు కుంటుపడుతున్నాయి. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, వరద బాధితులకు సాయం, పంటల నష్టానికి చేపట్టాల్సిన పంచనామ పనులు పూర్తికావడం లేదని ప్రతిపక్షాలు పనిగట్టుకుని మరీ దుమ్మెత్తి పోస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు త్వరలో ఉంటుందనే సమాధానమిస్తున్నారే తప్ప ముహూర్తం ఖరారు చేయడం లేదు. కాగా తిరుగుబాటు శిందే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యే సస్పెన్షన్ కేసు సుప్రీం కోర్టులో పెండింగులో ఉంది. తీర్పు తరుచూ వాయిదా పడుతుండడం వల్లే మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా వేస్తున్నారని ఆరోపించసాగారు. తాజాగా ఆగస్టు 8న జరగాల్సిన విచారణ మళ్లీ ఆగస్టు 12కు వాయిదా పడింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ మళ్లీ వాయిదా వేస్తుండవచ్చని మహావికాస్ ఆఘాడి నేతలు భావించారు.
అయితే సుప్రీం కోర్టు తీర్పుకు, మంత్రివర్గ విస్తరణకు ఎలాంటి సంబం«ధం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తీర్పు వెలువడే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకూడదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఎట్టకేలకు శిందే, ఫడ్నవీస్ మంగళవారం ముహూర్తం ఖరారుచేసి గత నెల రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.
ప్రమాణ స్వీకారంలో అగ్రస్ధానంలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు..
ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం: దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్, జయ్‌కుమార్ రావల్, రాథాకృష్ణ విఖే పాటిల్, ప్రవీణ్ దరేకర్, రవీంద్ర చవాన్, నితేష్ రాణే, గిరీష్ మహాజన్, సుధీర్ మునగంటివార్, సంజయ్ కుటే ఉన్నారు. వీరిలో ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది మంగళవారం తేలనుంది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గం: గులాబ్‌రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, దాదా భుసే, అబ్దుల్ సత్తార్, శంభురాజ్ దేశాయ్, సంజయ్ శిర్సాట్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment