సాక్షి, ముంబై: దేశ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని బీజేపీ ప్రమోట్ చేసిన విధంగానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజ్‌ఠాక్రే పేరుకు ప్రచారం కల్పించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పరాజయంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై చర్చించేందుకు యశ్వంత్ చవాన్ ఆడిటోరియంలో గురువారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రాజ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును బీజేపీ ప్రకటించినట్టుగా ముఖ్యమంత్రిగా రాజ్‌ఠాక్రేను ప్రకటించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ముందుకు వెళ్లేందుకు ఇదే మంచి మార్గమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేకు తెలియజేస్తామని ఎమ్మెల్యే ప్రవీణ్ దరేకర్ పేర్కొన్నారు. అయితే ఈ సమావేశానికి రాజ్‌ఠాక్రే హాజరుకాలేదు.
అందరి దృష్టి మే 31పై...
ముంబైలో రాజ్‌ఠాక్రే మే 31వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రిగా రాజ్‌ఠాక్రేను ప్రకటించాలన్న పదాధికారులు, కార్యకర్తల డిమాండ్‌పై ఆయన ఏమి మట్లాడతారన్న దానిపై అనేక మందిలో ఉత్కంఠ కనిపిస్తోంది. దీంతో రాజ్ బహిరంగ సభపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.
రాజ్ నిర్ణయంపై ఉత్కంఠ...
రాష్ట్ర కీలకనాయకునిగా ఎదిగే దిశగా పయనిస్తున్న రాజ్‌ఠాక్రేకు లోకసభ ఎన్నికల ఫలితాలు ఆందోళనలో పడేశాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని పదాధికారులు, కార్యకర్తల కోరికపై అధికారికంగా ప్రకటన వెలుపడుతుందా, లేదా అనేది వేచిచూడాల్సిందే. అయితే గత చరిత్రను పరిశీలిస్తే 2002 సంవత్సరంలో రాజ్‌ఠాక్రే సీఎం పదవి చేపట్టాలని ఉందని చెప్పి రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టించారు. అయితే తాజాగా పరిస్థితి ఎలా ఉండనుందనే దానిపై అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆయనలోని హుందాతనం, దూకుడు స్వభావం మాట్లాడే శైలి బాల్‌ఠాక్రే మాదిరేనని చె ప్పేవారు ఉన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలలో శివసేనతో పాటు ఇతర పార్టీల ఆధిపత్యాన్ని అధిగమించుతారని కొందరు వాదిస్తున్నారు. శివసేన ప్రారంభంలో లేవనెత్తిన మరాఠీ కార్డుతో ఎమ్మెన్నెస్ ముందుకు సాగుతోంది. దీనిపై అనేక తర్జనబర్జనలు జరుగుతున్నా ఆయన మాత్రం ఇదే అజెండాతో ముందుకు సాగుతున్నారు.
ఎమ్మెన్నెస్ సీఎం అభ్యర్థిగా రాజ్!
Published Thu, May 22 2014 10:32 PM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM
Advertisement