సాక్షి, ముంబై: రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటమికి, శివసేన, బీజేపీ, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) నేతృత్వంలోని మహాకూటమికి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే నివాసమైన కృష్ణకుంజ్‌లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో జనసురాజ్య పార్టీ, పీడబ్ల్యూపీ, ఇతర పార్టీల నాయకులు దాదాపు గంటకుపైగా రాజ్ ఠాక్రేతో చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలాఉండగా బీజేపీ నాయకుడు నితిన్ గడ్కారి ఇటీవల రాజ్‌తో భేటీ కావడం, లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పోటీ చేయకూడదని, ఒకవేళ పోటీచేస్తే సాధ్యమైనంత తక్కువ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాలని విజ్ఞప్తి చేయడం తె లిసిందే. దీనిపై రాజ్ ఎలా స్పందిస్తారనే దానిపై ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు అటు వివిధ పార్టీ నాయకుల్లో ఇదివరకే ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీపై విభిన్న కథనాలు కూడా వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పీడబ్ల్యూపీకి చెందిన జయంత్ పాటిల్, జన సురాజ్య పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి వినయ్, అపూర్వ హిరే తదితర నాయకులు రాజ్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చర్చల అనంతరం జనసురాజ్య పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి వినయ్ కోరే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, ఎన్సీపీ (డీఎఫ్) కూటమి అవినీతి పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగెత్తిపోయారని, దీంతో ప్రజలు డీఎఫ్, కాషాయ మహాకూటమికి ప్రత్యామ్నాయ పార్టీ కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
దీంతో ఇరు కూటములకు దీటుగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రాథమికంగా చర్చించినట్లు కోరే వివరించారు. మూడో ఫ్రంట్‌లోకి మరికొన్ని పార్టీలు చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వాటి పేర్లు సరైన సమయంలో వెల్లడిస్తామన్నారు. కాగా, ఈ కూటమి ఏర్పాటు సాకారమైతే డీఎఫ్, కాషాయ కూటములకు ఇబ్బందికరమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మూడో కూటమి!?
Published Fri, Mar 7 2014 10:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement