ఎమ్మెన్నెస్, ఆప్‌లకు మొండిచేయి
సాక్షి ముంబై: రాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)లకు ప్రజలు మొండిచేయి చూపారు. రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆప్ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు తమ సత్తా చాటుతామని పేర్కొన్న రాజ్ ఠాక్రే పార్టీ ఎమ్మెన్నెస్ కూడా ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్, ఆప్ అభ్యర్థులు ప్రభావం చూపుతారని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అసలు వీరి ప్రభావమే కనిపించలేదు. మరోవైపు ఎస్‌పీ, బీఎస్‌పీల ప్రభావం కూడా ఎక్కడా కానరాలేదు.
బోణీ చేయని ఎమ్మెన్నెస్...
ముంబైతోపాటు రాష్ట్రంలోని మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎమ్నెన్నెస్ పోటీ చేసింది. గతంలో ఖాతా తెరవలేకపోయినపార్టీకి ఈ సారి గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసింది. అయితే ప్రజలు మాత్రం ఎమ్మెన్నెస్‌ను ఆదరించకపోగా కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా గల్లంతైనట్టు సమాచారం. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారంలో ఎమ్మెన్నెస్ ఉన్నప్పటికీ అక్కడ పెద్దగా అభివృద్ధి పనులేవీ చేయలేదని, అన్నిపార్టీల్లాగానే హామిలిచ్చిందనే ఆరోపణలున్నాయి. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో కనిపించిందని కొందరు పేర్కొంటున్నారు. నాసిక్‌లో ఎమ్మెన్నెస్ అభ్యర్థి ప్రదీప్ పవార్ ఎలాంటి ప్రభావం చూపలేదు. మరోవైపు ముంబైలో కూడా బాలానాందగావ్కర్‌తోపాటు ప్రముఖ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు.
ఖాతా తెరవని ఆప్...
తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ ప్రభావం కూడా కనిపించలేదు. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం కారణంగా కనీసం ఒకటిరెండైనా సీట్లు దక్కుతాయని భావించారు. అయితే ప్రముఖ అభ్యర్థులంతా పరాజయం పాలయ్యారు. ముఖ్యంగా మేథా పాట్కర్, మీరా సాన్యాల్, మయాంక్ గాంధీ, అంజలి దమానియా, విజయ్ పాండరేలు బరిలోకి దిగినా ఉపయోగం లేకుండాపోయింది.