దేశాన్ని లూఠీ చేసిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్సు గల్లంతవుతుందని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ఠాక్రే జోస్యం చెప్పారు.
పింప్రి, న్యూస్‌లైన్: దేశాన్ని లూఠీ చేసిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్సు గల్లంతవుతుందని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ఠాక్రే జోస్యం చెప్పారు. పుణేలోని డెక్కన్ జింఖానా సమీపంలో సోమవారం సాయంత్రం ఎమ్మెన్నెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ...దేశ ప్రజలు ఇక కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంటి దారి పట్టడం ఖాయమని అన్నారు. దేశంలో సుస్థిర పాలన కావాలంటే ఒక్క నరేంద్ర మోడీవల్లే సాధ్యమని ఉద్ఘాటించారు. గుజరాత్ అభివృద్ధి చూసి ఓటేయ్యాలని మోడీ చెప్పడంలో విశ్వాసం ఉందని, ఆ నమ్మకం, విశ్వాసంతో పనిచేసే చురుకైన ప్రధానే తమకు కావాలని పిలుపునిచ్చారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకుల కల్లబొల్లి కబుర్లకు ప్రజలు మోసపోవద్దని, వారిచ్చే డబ్బులు పుచ్చుకుని ఓటు మాత్రం విశ్వాసపాత్రుడైన వ్యక్తికే వేయాలని సూచించారు. ‘దేశంలో ైరె తుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. వారి సమస్యలు పరిష్కరించే నాధుడే లేడు. అవినీతి ద్వారా కాంగ్రెస్ పేరు ప్రతిష్టలు బాగా పెరిగాయి. అయినప్పటికీ మళ్లీ వారికే టికెటు ఇవ్వడమంటే అవినీతిని మరింత ప్రోత్సహించడమేన’ని దుయ్యబట్టారు. ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, పుణే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వజిత్ కదం ప్రజలను లూఠీ చేశారని, వీరికి పార్లమెంట్ మెట్లు ఎక్కే అర్హత లేదని అన్నారు.
కదం తండ్రి సాంగ్లీ ఎంపీ కావడం, స్థానికేతరుడైన కదంకు పుణే నుంచి అభ్యర్థిత్వం ఇవ్వడమంటే పుణేలో కాంగ్రెస్‌కు అభ్యర్థుల కొరత ఉందని తెలుస్తోందన్నారు. కాంగ్రెస్ అవినీతి భాగోతానికి తెరదించాలంటే ఎమ్మెన్నెస్ అభ్యర్థి దీపక్ పాయ్‌గుడేను అధిక మెజార్టీతో గెలిపించాలని పుణే ప్రజలకు పిలుపునిచ్చారు. దీపక్‌ని గెలిపిస్తే పుణేని అన్ని విధాలా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని హామీని ఇచ్చారు.
ఎమ్మెన్నెస్‌లో చేరిన పలువురు నేతలు ...
రాజ్‌ఠాక్రే సమక్షంలో శివసేన ఎంపీ గజానన్ బాబర్, విద్యార్థి సేనా మాజీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు సారంగ్ కమ్లేకర్, నగర శివసేన మాజీ ఉపాధ్యక్షుడు రోమి సంధు, మాజీ కార్పొరేటర్లు ప్రకాశ్ బాబర్, జిల్లా సేన పార్టీ ప్రముఖులు రాందాస్ ధన్వట్, దయానంద్ ఇర్కల్ తదితరులు చేరారు.
ఏక్‌వీర దేవిని దర్శించుకున్న రాజ్‌ఠాక్రే
ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ముందు తన ఆరాధ్య దైవమైన లోనావాలా, కార్లా గుహలో ఉన్న ఏక్‌వీర దేవిని దర్శించుకున్నారు. రాజ్ ఠాక్రే వెంట ఎమ్మెల్యే జయంత్ పాటిల్, మావల్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి లక్ష్మణ్ జగ్తాప్, రమేశ్ కదం, ఎంపీ గజానన్ బాబర్, అమెయ్ బోప్కర్, భాపు బేగడే తదితరులు కూడా వెళ్లారు.