సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పార్టీ నేతలు, కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే నడుంబిగించారు. ఇందుకోసం ఈ నెల 31న నగరంలోని సోమయ్య మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిద్వారా వారిలో నూతనోత్సాహం నింపాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోర పరాభవంతో ఆ పార్టీ పదాధికారులు, అభ్యర్థులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ బహిరంగసభ ద్వారా వారిని ఓదార్చడంతోపాటు మరోసారి బలాన్ని నిరూపించే ప్రయత్నం చేయనున్నారు. ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునివ్వనున్నారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ పది స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. అయితే ఏ ఒక్క స్థానంలో గెలవలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులకు లక్షల్లో ఓట్లు వచ్చాయి. అప్పట్లో ఓడిపోయిన నియోజకవర్గాలలో అత్యధిక శాతం ఎమ్మెన్నెస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారనే ధీమా కనిపించింది. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ప్రచార సభల్లో రాజ్‌ఠాక్రే అందరిని విమర్శించి ఎంతో ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. అయినా పరిస్థితులు అనుకూలించలేదు.
ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోకపోవడమే కాకుండా గతసారితో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఎమ్మెన్నెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘రాజ్‌గఢ్’లో అభ్యర్థులతో మంగళవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఎన్నికల ఓటమిపై ఆరా తీశారు. ఓడిపోయిన అభ్యర్థులందరూ సమగ్ర నివేదిక తయారుచేసి ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 31న జరిగే బహిరంగ సభలో ఓటమి ఫలితాలపై విశ్లేషణ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పరాజయం సంఘటనను మర్చిపోయి త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యేలా రాజ్‌ఠాక్రే సాధారణ కార్యకర్త మొదలుకుని పదాధికారులకి మనోధైర్యాన్ని నూరిపోయనున్నారు.
ఇదిలాఉండగా పుణేలోని ఖడక్‌వాస్లా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్ వాంజలే మృతి చెందారు. దీంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఔరంగాబాద్‌లోని కన్నడ్ ఎమ్మెల్యే హర్షవర్థన్ జాదవ్ ఎమ్మెన్నెస్‌తో తెగతెంపులు చేసుకున్నారు. ఇక ఎమ్మెన్నెస్‌కు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సదరు 11 శాసనసభ నియోజక వర్గాలలో ఎమ్మెన్నెస్ ప్రాబల్యం తగ్గినట్లు తెలిసింది. దీంతో రాజ్ నేతృత్వంపై అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నెల 31న జరిగే బహిరంగ సభలో రాజ్‌ఠాక్రే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై అందరి దృష్టి ఉంది.
31న ముంబైలో రాజ్ బహిరంగసభ
Published Wed, May 21 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement