సాక్షి, ముంబై: నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ మేరకు బీజేపీ నాయకులు చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెన్నెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వసంత్ గీతే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాసిక్ కార్పొరేషన్‌లోని 18 మంది కార్పొరేటర్లు కూడా గీతే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాసిక్ కార్పొరేషన్‌లో ఎమ్మెన్నెస్ అధికారంలో కొనసాగుతోంది. ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే కార్పొరేషన్‌లో ఎమ్మెన్నెస్ అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం గీతే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆయనతో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలు, తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాజ్‌ఠాక్రే పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాని ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీనుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఎమ్మెన్నెస్‌లో ప్రముఖ నాయకుడైన ప్రవీణ్ దరేకర్ కూడా బీజేపీ బాటలో ఉన్నట్లు గత వారం వార్తలు వచ్చాయి.
తాజాగా గీతే పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినప్పుడు తన పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీని వీడిపోనని ప్రకటించారు. కాని కొద్ది సేపటిలోనే ఆయన బీజేపీతో సంప్రదింపులు జర్పుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, నాసిక్‌లోని అనేక మంది కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యకర్తలు బీజేపీ బాటలో ఉన్నారని బీజేపీ ఉత్తర మహారాష్ట్ర చీఫ్ విజయ్ సానే అన్నారు. ఈ విషయంపై రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సానే పేర్కొన్నారు.
ఇటీవల రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన రాజ్ ఠాక్రేతో అనేక మంది కార్యకర్తలు, పదాధికారులు మీకు అండగా మేమున్నామంటూ ఆయనకు మనోధైర్యాన్ని నూరిపోశారు. కాని వారం రోజులైన గడవకముందే వలసలకు సిద్ధం కావడం రాజ్ ఠాక్రేకు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కార్పొరేషన్‌లో ఎన్నెమ్మెస్‌కు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే బీజేపీకి 18, ఎన్సీపీకి 20, కాంగ్రెస్, 13, శివసేన,ఆర్పీఐ కూటమికి 23 మంది సభ్యులున్నారు.
ఎమ్మెన్నెస్‌లో బీజేపీ ముసలం
Published Mon, Nov 3 2014 11:27 PM | Last Updated on Mon, Oct 8 2018 6:02 PM
Advertisement
Advertisement