Vasant gite
-
ఎమ్మెన్నెస్‌లో బీజేపీ ముసలం
సాక్షి, ముంబై: నాసిక్ నగరంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ మేరకు బీజేపీ నాయకులు చాపకింద నీరులా పని చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెన్నెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వసంత్ గీతే సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ నాయకులతో సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాసిక్ కార్పొరేషన్‌లోని 18 మంది కార్పొరేటర్లు కూడా గీతే బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాసిక్ కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారంలో కొనసాగుతోంది. ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే కార్పొరేషన్లో ఎమ్మెన్నెస్ అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం గీతే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనతో సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికలు, తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రాజ్‌ఠాక్రే పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగినప్పుడు 13 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాని ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీనుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఎమ్మెన్నెస్‌లో ప్రముఖ నాయకుడైన ప్రవీణ్ దరేకర్ కూడా బీజేపీ బాటలో ఉన్నట్లు గత వారం వార్తలు వచ్చాయి. తాజాగా గీతే పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్లుగా భావిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసినప్పుడు తన పార్టీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, పార్టీని వీడిపోనని ప్రకటించారు. కాని కొద్ది సేపటిలోనే ఆయన బీజేపీతో సంప్రదింపులు జర్పుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదిలా ఉండగా, నాసిక్‌లోని అనేక మంది కార్పొరేటర్లు, పదాధికారులు, కార్యకర్తలు బీజేపీ బాటలో ఉన్నారని బీజేపీ ఉత్తర మహారాష్ట్ర చీఫ్ విజయ్ సానే అన్నారు. ఈ విషయంపై రాష్ట్రస్థాయి నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సానే పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన రాజ్ ఠాక్రేతో అనేక మంది కార్యకర్తలు, పదాధికారులు మీకు అండగా మేమున్నామంటూ ఆయనకు మనోధైర్యాన్ని నూరిపోశారు. కాని వారం రోజులైన గడవకముందే వలసలకు సిద్ధం కావడం రాజ్ ఠాక్రేకు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, కార్పొరేషన్లో ఎన్నెమ్మెస్కు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే బీజేపీకి 18, ఎన్సీపీకి 20, కాంగ్రెస్, 13, శివసేన,ఆర్పీఐ కూటమికి 23 మంది సభ్యులున్నారు. -
సేనలో సర్దుకున్న విభేదాలు
సాక్షి ముంబైః మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)లో నెలకొన్న విభేదాలకు ఎట్టకేలకు సోమవారం తెరపడింది. ఎమ్మెన్నెస్‌లో తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న వసంత్ గీతే ఎట్టకేలకు మనసు మార్చుకున్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ప్రకటించడంతోపాటు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. తన సూచనల ప్రకారం నాసిక్ కార్పొరేషన్లో పదవులు కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉనా, ఠాక్రేతో భేటీ అయ్యాక చల్లబడ్డారు. దీంతో నాసిక్ లో గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధం అంతమయింది. మరికొన్ని నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్ ఠాక్రేకు ఈ పరిణామం సంతోషం కలిగిస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకుడైన నాసిక్ ఎమ్మెల్యే గీతే గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విషయం విధితమే. నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ పదవుల కేటాయింపుపై ఆయన నిరసన వ్యక్తంచేశారు. ఇది జరిగిన అనంతరం ఇటీవలే జరిగిన లోకసభ ఎన్నికల్లో ఎంతో పట్టుందని భావించిన నాసిక్‌లో ఎమ్మెన్నెస్ ఘోరపరాజయం చవిచూడాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్ ఠాక్రే వసంత్ గీతేను కొంత దూరంగా ఉంచడం ప్రారంభించారు. పార్టీ నిర్ణయాలు తీసుకోవడంపై అవినాశ్ అభ్యంకర్కు బాధ్యతలు అప్పగించారు. ఇలా పరోక్షంగా ఎమ్మెల్యే ఉత్తమరావ్ ఢికలేను ప్రోత్సహించడంతో ఆయన ప్రత్యర్థి అయిన గీతేలో అసంతృప్తి అధికమయింది. ఈ నేపథ్యంలో నాసిక్‌కు చెందిన కొందరు పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలతోపాటు ఆయన పార్టీని వీడనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. రాజ్ ఠాక్రే అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో గీతేతోపాటు ఆయన సన్నిహితులు హాజరుకాలేదు. అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నందునే గీతే సమావేశానికి రాలేదని పలువురు నాయకులు అనుకున్నారు. దీంతో గీతేతోపాటు ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేయడం ఖాయమని భావించారు. అదేవిధంగా ఆయన బీజేపీలో చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాజ్ ఠాక్రే నాసిక్‌లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకే గీతే వివాదం తీవ్రరూపం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకొని స్వయంగా రంగంలోకి దిగారు. వసంత్ గీతేను బుజ్జగించేందుకుగా నితిన్ సర్దేశాయ్, ప్రవీణ్ దరేకర్, దీపక్ పాయిగడేను గీతే నివాసానికి పంపించారు. వీరి భేటీ అనంతరం ఒక్కసారిగా ఆయనలో మార్పు కన్పించింది. ‘పార్టీపై నిరసన వ్యక్తం చేయడానికే సమావేశానికి రాలేదన్న పుకార్లుఅబద్ధం. నా కాలికి గాయంకారణంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పడంతో సమావేశానికి వెళ్లలేదు’ అని వివరణ ఇచ్చారు. పార్టీ వీడనున్నట్టు మీడియాలో వస్తున్న కథనాలను అవాస్తమని స్పష్టం చేశారు. ఎమ్మెన్నెస్‌లో ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తనకు పార్టీపై ఎందుకు అసంతృప్తి ఉంటుందని మీడియాను ప్రశ్నించారు.