తేల్చండి | Uddhav asks BJP to clarify its stand on Raj Thackeray | Sakshi
Sakshi News home page

తేల్చండి

Published Tue, Mar 11 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

Uddhav asks BJP to clarify its stand on Raj Thackeray

ముంబై: రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)తో ఉన్న సంబంధాలపై స్పష్టత ఇవ్వాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే బీజేపీని కోరారు. వాళ్లు కావాలో, మేం కావాలో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగానే మీరు ఇతరుల మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభ అభ్యర్థులు, పార్టీ ఆఫీస్ బేరర్లతో మంగళవారం సమావేశం అయిన అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ తీసుకునే నిర్ణయాలకు ఎవరూ బాధ్యులో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల గురించి రాజ్‌తో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ చర్చలు జరిపిన నేపథ్యంలో అగ్రహాంతో ఉన్న ఉద్ధవ్‌ఠాక్రేను బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పంపిన రాజీవ్ ప్రతాప్ రూడీ బృందం కలిసింది.

 ఈ సందర్భంగా ఉద్దవ్ బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్‌ఠాక్రే పేరును ఉచ్ఛరించకుండానే అధికారంలో ఉండేందుకు కొంత మంది ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే, అతని బృంద సభ్యులతో శివసేనకు మంచి సత్సంబంధాలున్నాయని తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులు మధ్యలో దూకి ఆ ఘనతను సొంతం చేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటానికి మద్దతు అవసరమైతే ఎవరినైనా కలుపుకొని పోతారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్, రాజీవ్‌గాంధీ మద్ధతుతో మాజీ ఫ్రధాని చంద్రశేఖర్ మాదిరిగా వ్యవహరిస్తారా అని బీజేపీని నిలదీశారు.

 ఇంకా అవసరమనుకుంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా తీసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ అలా జరిగితే కేజ్రీవాల్‌కు, బీజేపీకి ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. హిందూత్వ అంశంపై బీజేపీతో జట్టుకట్టామని, వారు సంక్షోభంలో ఉన్న సమయంలో వారి వెంటే నడిచామని, అయితే బీజేపీ ఇప్పుడు ఎందుకు దారి తప్పుతోందనని ఆయన నిలదీసే ప్రయత్నం చేశారు. రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పొత్తుపై బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడతానని అన్నారు.

 ప్రధానిగా నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతామని, అయితే లోక్‌సభ ఎన్నికల్లో శివసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్న ఉద్ధవ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెళ్లారు. నమ్మకమైన మిత్రపక్షంగానే శివసేనను ఎప్పుడూ బీజేపీ చూస్తుందని ఒప్పించానని ఉద్ధవ్‌తో భేటీ అనంతరం ఫడ్నవిస్ మీడియాకు తెలిపారు.
 
 డర్మీ రేసు మొదలైంది
 సాక్షి, ముంబై: ఎన్‌డీఏ కూటమి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చేందుకు డర్బీ రేస్ మొదలైందని సామ్నా సంపాదకీయంలో రాజ్‌ఠాక్రే తీరును విమర్శించారు.  మోడీని తప్పుబట్టిన వారే నేడు అడగకుండానే మద్దతు ప్రకటిస్తున్నారని రాజ్‌ఠాక్రేకు చురకలంటించారు.  శివసేన, బీజేపీ, ఆర్‌పీఐ, స్వాభిమానీ పార్టీల మహాకూటమిలో చిచ్చుపెట్టేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శివసేన-బీజేపీల బంధం చాలా ఏళ్ల నుంచి ఉందని, తమల్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

 ‘హిందూత్వం అంశంపై శివసేన, బీజేపీలు ఒక్కటయ్యాయి. ఈ కూటమిని విడగొట్టేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారు. హిందువుల ఓట్లు చీల్చి లబ్ధిపొందాలని భావిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాల్లో కుటుంబాల్లో కూడా కలహాలు పెట్టార’ని ఉద్ధవ్ ఆరోపించారు. అయినా మహాకూటమికి వచ్చిన ఇబ్బందేమీ లేదన్నారు. అనేక విషయాలపై విభేదాలు వచ్చినా పొత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. మోడీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు.  
 
 తెరపైకి మూడో ఫ్రంట్
 ముంబై: రాష్ట్రంలో మూడో కూటమి ఏర్పాటుకు సన్నాహలు మొదలయ్యాయి. ఎన్‌డీఏలోకి ఎమ్మెన్నెస్ రాకను శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చిన్నచితక పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఎదగాలని రాజ్‌ఠాక్రే భావిస్తున్నారని ఊహగానాలు వస్తున్నాయి. ఈ మేరకు పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ (పీడబ్ల్యూపీ), జనసూర్య శక్తి పార్టీ, జయంత్ పాటిల్, వినయ్ కోరే, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అపూర్వ హిరాయ్ చర్చలు జరిపారు. ఈ విషయాన్ని పీడబ్ల్యూపీ నాయకుడు ఎస్‌వీ దేశ్‌ముఖ్ మంగళవారం మీడియాకు తెలిపారు. మా సిద్ధాంతాలు విభిన్నంగా ఉన్నా, రెండు అంశాల్లో మాత్రం ఒకే విధంగా ఉన్నామని వివరించారు. ఎమ్మెన్నెస్ ఏజెండాలో ఉన్న రాష్ట్ర అభివృద్ధితో పాటు మరాఠీయులకు ప్రాధాన్యత విషయాలు కూడా తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. దీనిపై జయంత్ పాటిల్ మరోకసారి రాజ్‌తో ఏటీ అవుతారన్నారు. రాయ్‌గఢ్, మావల్, కొల్హాపూర్‌తో పాటు లాతూర్, ఉస్మానాబాద్ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement