bal thakre
-
ముంబైలో బాల్ ఠాక్రే - ఇందిరా గాంధీ పోస్టర్లు..
ముంబై : శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సర్కార్ మహారాష్ట్రలో గురువారం కొలువుతీరనున్న నేపథ్యంలో ముంబైలో సేన వ్యవస్ధాపకులు బాల్ ఠాక్రే, దివంగత ప్రధాని ఇందిరా గాంధీల పోస్టర్లు వెలిశాయి. బాలాసాహెబ్ స్వప్నం ఫలించింది ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికుడని ఈ పోస్టర్లపై రాసిఉంది. గతంలో బాల్ ఠాక్రే, ఇందిరాగాంధీ భేటీ అయిన చిత్రాలతో కూడిన ఈ పోస్టర్‌ను శివసేన భవన్‌కు సమీపంలో ఏర్పాటు చేశారు. రెండు భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల అధినేతలను ఒక్కటి చేస్తున్న ఈ పోస్టర్లను అందరూ ఆశ్చర్యంగా తిలకిస్తుండటం విశేషం. మరోవైపు శివసేన అధిపతి బాల్ ఠాక్రే ఇందిరా గాంధీ విధానాలకు సంఘీభావం తెలిపేవారని, పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ను ఆయన సమర్ధించారని శివసేన నేతలు గుర్తుచేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవగా ఆమె నిర్ణయాన్ని బాల్ ఠాక్రే సమర్ధించారు. 1966లో శివసేనను స్ధాపించిన బాల్ ఠాక్రే పార్టీ విధానాలకు అద్దంపట్టేలా సామ్నా పత్రికను నెలకొల్పారు. 2012లో 86 ఏళ్ల వయసులో ఆయన మరణించేంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ సైతం ఇప్పటివరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
వారంతా మట్టిలో కలిసిపోయారు
- సామ్నాలో సేన విమర్శనాస్త్రం ముంబై: మాజీ మిత్రుడు బీజేపీపై శివసేన విమర్శలు రోజు రోజుకూ పదునెక్కుతున్నాయి. హిందూత్వ కోసం నిలిచింది తమ నాయకుడు బాల్ ఠాక్రే మాత్రమేనని, ఇతరులంతా ఆ అంశాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని బీజేపీని ఉద్దేశించి విమర్శించింది. మహారాష్ట్రను స్వాధీనం చేసుకోవాలని వచ్చిన వారందరూ ఇక్కడి మట్టిలో సమాధి అయ్యారని హెచ్చరించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం బాల్ ఠాక్రే అని తెలిపింది. రాష్ట్రంలో అక్టోబర్ 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటమని శివసేనశనివారం తన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. ‘‘ఔరంగజేబు లేదా అఫ్జల్ ఖాన్, ఎవరైనా సరే స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన వారందరూ ఇక్కడ సమాధి అయ్యారు లేదా అంతరించిపోయారు’’ అని సామ్నా వ్యాఖ్యానించింది. శివాజీ మహరాజ్ తరువాత బాల్‌ఠాక్రే మాత్రమే ఇక్కడ చరిత్ర సృష్టించారని తెలిపింది. శివాజీ హిందవీ స్వరాజ్యను స్థాపించారని, కానీ ఈ దేశంలో హిందూత్వ జెండాను ఎగురవేయాలని దివంగత శివసేన అధినేత నిర్ణయించారని పేర్కొంది. కొందరు రాజకీయ నాయకులు రామ నామం జపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సామ్నా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశంలో, మహారాష్ట్రలో హిందూత్వను వ్యాపింపచేయడానికి బాల్ ఠాక్రే ఎన్నో దాడులను ఎదుర్కొన్నారంది. ఆ ఫలితాలనే నేడు ఢిల్లీ, మహా రాష్ట్రలో చవిచూస్తున్నామని పేర్కొంది. బీజేపీపై విమర్శలు సంధిస్తూ, ఔరంగజేబు ఇక్కడి మరాఠా పాలకులను కూలదోసేందుకు మహారాష్ట్రలో తిష్టవేశాడని, కానీ సఫలం కాలేకపోయాడని వ్యాఖ్యానించింది. జయించాలని వచ్చిన ఔరంగజేబు మట్టికరుచుకుపోయాడని తెలిపింది. మహారాష్ట్ర ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాల కోసం నిలిచిందని, రాజకీయ ప్రయోజనాల కోసం హిందూత్వను ఎన్నడూ ప్రయోగించలేదని పేర్కొంది. -
శత్రువులను చేరదీయొద్దు
సాక్షి, ముంబై: ‘మా శత్రువులను మీరు చేర్చుకోవద్దు.. మీ శత్రువులను మేం చేర్చుకోం..’ అనే నినాదంతో ఇకపై ముంద డుగు వేయాలని బీజేపీ, శివసేన ఒప్పందం చేసుకున్నాయి. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేను ఎవరైతే ఇబ్బందులకు గురిచేశారో వారిని బీజేపీలో చేర్చుకోవద్దని, అదే విధంగా ఎవరైతే బీజేపీని ఇబ్బందుల్లో పెడుతున్నారో వారిని తమ పార్టీలోకి చేర్చుకోబోమని శివసేన చేసిన ప్రతిపాదనకు బీజేపీ నాయకులు సై అన్నారు. శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘సేనా భవన్’ ఈ ఒప్పందానికి వేదికగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి..... శివసేన తమ ప్రధాన మిత్రపక్షమైన బీజేపీతో సేవాభవన్లోగురువారం సాయంత్రం సమావేశం నిర్వహించింది. ఇరు పార్టీల నాయకులు దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిపారు. సమావేశం అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే బీజేపీలో చేరనున్నట్లు గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఒకవేళ ఆయనకు చేరాలని ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం చేర్చుకోదని కుండబద్దలు కొట్టారు. రాణే అంశానికి తాము ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. శివసేన, బీజేపీలు కేవలం అధికారం కోసం కూటమిగా ఏర్పడలేదు. ఇరు పార్టీల ఆశయాలు, ఒకే విధమైన ఆలోచనలు కావడంతో కలిసి కొనసాగుతున్నామన్నారు. దీంతో ఇరు పార్టీలను ఇబ్బందులకు గురిచేసిన వారికి కూటమిలో స్థానం లేదన్నారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. వివిధ పార్టీలకు చెందిన అనేక మంది దిగ్గజాలు, వారి అనుచరులు కాషాయ కూటమిలో చేరుతున్నారని, దీంతో మహాకూటమి మరింత బలపడుతోందని ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్‌కు విదర్భ రీజియన్‌లో అతి సన్నిహితుడైన కిశోర్ కన్హేరే,నాసిక్‌కు చెందిన ప్రముఖ సమాజ సేవకుడు రాజాభావు వాజే తమ అనుచరులతో శివసేనలో చేరారని అన్నారు. అయితే వీరంతా గతంలో శివసేనకుగాని, బీజేపీకిగాని ఇబ్బందులు కల్గించలేదని గుర్తు చేశారు. -
శివాలెత్తిస్తా
శివసేనకు వ్యతిరేకంగా అభ్యర్థులను దింపుతామని రాజ్‌ఠాక్రే ప్రకటన సాక్షి, ముంబై: రాజ్‌కీయం మొదలైంది. పెదనాన్న బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీయే లక్ష్యంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే లోక్‌సభ కదనరంగంలోకి దూకుతామని ప్రకటించారు. ఠాణేలోని షణ్ముఖానందహాల్ లో ఆదివారం ఉదయం ఆ పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాకూటమిలోని బీజేపీ పోటీచేసే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టబోమని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేందుకు మద్దతిస్తామని సభాముఖంగా ప్రకటించి కాషాయ కూటమిలోనే కలకలం రేపారు. బీజేపీతో మైత్రికి సై అంటూనే, దాని మిత్రపక్షమైన శివసేనతో రాజ్ ఆడుతున్న రాజకీయ చదరంగం ఎటువైపు మలుపులు తిరుగుతుందోనన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగేలా చేయడంలో సఫలీకృతమయ్యారు. అయితే గతంలో మాదిరిగానే ఈసారీ మరాఠీ ఓటర్లు తమవైపు వస్తారనే గట్టి నమ్మకంతో ఉన్న రాజ్‌ఠాక్రే ఇలా బహిరంగంగా శివసేనను లక్ష్యంగా చేసుకొని దూకుడు పెం చడం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందోనన్న మీమాంస ఆ పార్టీలోనూ కనబడుతోంది. కావాలనే శివసేన పార్టీని లక్ష్యంగా చేసుకొని రాజ్‌ఠాక్రే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజల్లోకి శివసైనికు లు తీసుకెళ్లగలిగితే ఎమ్మెన్నెస్ పార్టీకి కొంతలో కొంతైనా దెబ్బతీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మరాఠీ ఓటర్ల లో గట్టి పట్టున్న శివసేన పార్టీని కూకటి వేళ్లతో పెకలించడం అంత సులభం కాదని అంటున్నారు. బాల్‌ఠాక్రే మరణానంతరం శివసేన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్‌ఠాక్రే ఈసారి ఎలాగైనా లోక్‌సభ ఎన్నికల్లో ‘మహా’ కూటమిని గెలిపిం చాలన్న కసితో ఉన్నారు. అయితే గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థులను బరిలోకి దింపొద్దని మహాకూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాజ్‌ఠాక్రేను కోరింది. దీనిపై ఉద్ధవ్‌ఠాక్రే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా రాజ్‌ఠాక్రే నిర్ణయం మహా కూటమిలోనూ భేదాభిప్రాయాలకు దారి తీయొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరింత వైరం... రాజ్‌ఠాక్రే తాజా ప్రకటనతో శివసేన వర్గాల్లో గుబు లు మొదలైంది. బీజేపీ అభ్యర్థులు పోటీచేసే నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను బరిలోకి దింపబోమని రాజ్ స్పష్టం చేసి సోదరుడితో మరింత వైరం పెంచుకున్నారు. గతంలో ఠాక్రే సోదరుల మధ్య పెరిగిన వైరాన్ని, దూరాన్ని తగ్గించేందుకు అనేక మంది దిగ్గజాలు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. చివరకు బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత ఇద్దరూ ఒకటవుతారని అందరూ భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. తాజాగా రాజ్ చేసిన ప్రకటన ఠాక్రేల మధ్య మరింత దూరాన్ని పెంచేదిగా ఉంది. ఇది సేనా నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా శివసేనపై లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే శాసనసభ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది. దీంతో శివసేన భవిత అంధకారంలో పడిపోయింది. కాగా, శివసేన, బీజేపీ, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) నేతృత్వంలోని మహాకూటమిలోకి ఇటీవల స్వాభిమాని శేత్కరి సంఘటన అధ్యక్షుడు, కొల్హాపూర్ ఎంపీ రాజు శెట్టి చేరారు. దీంతో మహా కూటమి మరింత బలపడిందని భావిస్తున్న తరుణంలో రాజ్ ఠాక్రే నిర్ణయం పరోక్షంగా దెబ్బతీసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మహాకూటమి లో శివసేన, బీజేపీ ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకా రం శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తే ఆ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. గతంలో కూడా ఇదే ఫార్ములాను అవలంభిం చారు. ఆ ప్రకారం ఒక టర్మ్ శివసేన అభ్యర్థి ముఖ్యమంత్రిగా కొనసాగారు. కానీ ఇప్పు డు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెన్నెస్ వల్ల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం శాసనసభ ఎన్నికలపై కూడా పడే అవకాశముంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నిక ల్లో బీజేపీకే ఎక్కువ స్థానాలు వస్తే ఒప్పందం ప్రకా రం శివసేన నుంచి ముఖ్యమంత్రి పీఠం చేజారిపోవడం ఖాయం. మూడు పర్యాయాలుగా రాష్ట్రా న్ని ఏలుతున్న కాంగ్రెస్‌ను ఈసారి ఎలాగైనా గద్దె దింపి, అసెంబ్లీ భవనంపై కాషాయ జెండా రెపరెపలాండించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న శివసేనకు రాజ్ కారణంగా చివరకు నిరాశే మిగిలే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
పులికి ఘన నివాళి
సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన బాలాసాహెబ్ ఠాక్రే ప్రథమ వర్ధంతిని శివసేన అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహిం చిన శివాజీపార్క్ మైదానం ‘బాల్‌ఠాక్రే అమర్ రహే’ నినాదాలతో ఆదివారం హోరెత్తింది. ఉద యం నుంచే నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వచ్చిన శివసైనికులు, తమ ప్రియతమ నాయకుడు బాల్ ఠాక్రేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించిన శివాజీపార్క్ మైదానంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసి పోయాయి. శివాజీపార్క్ మైదానం ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న మీనాతాయి ఠాక్రే విగ్రహాన్ని భారీగా పూలతో అలంకరిం చారు. శివసైనికులు ముందుగా మీనాతాయి విగ్రహానికి నివాళులర్పించి ఠాక్రే స్మారకం వద్దకు వెళ్లా రు. మైదానమంతా జనసంద్రంగా మారింది. 1966 లో శివసేనను స్థాపించిన బాల్‌ఠాక్రే దానిని మహా రాష్ట్రలో బలమైన రాజకీయశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత నవంబర్ 17న మరణించారు. భారీగా ప్రముఖుల రాక శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రశ్మి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్మారకం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సేన సీని యర్ నాయకులు, కార్పొరేటర్లతోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, కూతురు సుప్రియా సుళే, గవర్నర్ కె.శంకరనారాయణన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి, కేం ద్ర, రాష్ట్ర మంత్రులు హాజరై ఠాక్రేకు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వర్ధంతికి హాజరుకాకపోవడం గమనార్హం. అభిమానుల సందడి.. రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు, ఠాక్రే అభిమానులు శనివారం సాయంత్రం నుంచి ముంబైకి తరలిరావడం మొదలుపెట్టారు. తదనంతరం బాంద్రాలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీ బంగ్లాకు చేరుకున్నారు. చాలా మంది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే శివాజీపార్క్ మైదానానికి చేరుకుని క్యూలో నిలబడ్డారు. నివాళులర్పించే బోర్డులు, ప్లెక్సీలు.. ఠాక్రేకు నివాళులర్పించడానికి అమర్చిన బోర్డులు, ఫ్లెక్సీలు ముంబైలో చాలాచోట్ల దర్శనమిచ్చాయి. ‘శివ్తీర్థ్’ వద్ద ఉన్న శివాజీ విగ్రహం పక్కన 20 అడుగుల వెడల్పు, 40 అడుగులు పొడవుతో ఠాక్రే స్మారకం ‘స్మృతి ఉద్యాన్’ను బీఏంసీ ఏర్పాటు చేసింది. దీనిని 15 రకాల పూలు,మొక్కలతో అలంకరించారు. భారీగా పోలీసు బందోబస్తు వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ముంబై పోలీసుశాఖ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. రద్దీని నియంత్రించేందుకు శివ్తీర్థ్ వద్ద ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌రూం, రెండు వాచ్టవర్లు ఏర్పాటు చేశారు. 650 మంది కానిస్టేబుళ్లు, 225 మంది మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది పోలీసు అధికారులు, నలుగురు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ పోలీసు కమిషనర్లను నియమించారు. అలాగే స్టేట్ రిజర్వుడు పోలీసులకు చెందిన మూడు బెటాలియన్లు, అల్లర్ల నియంత్రణకు రెండు బెటాలియన్లు, ఐదు కంబాట్ వాహనాలతో భద్రత ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు.... వర్ధంతిని పురస్కరించుకుని శివసేన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. పలుచోట్ల రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించింది. శివసేన సినిమా యూనియన్ ఆధ్వర్యంలో దాని సభ్యులకు రూ.రెండు లక్షల పాలసీ ఉచితంగా ఇచ్చారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్త్‌కార్డులు అందజేస్తామని సేవ వర్గాలు తెలిపాయి. మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం : ఉద్ధవ్ శివాజీపార్క్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సాయంత్రమే ఉద్ధవ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మేయర్ బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయారని, రాష్ట్ర పాలనలో మార్పు కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిలోని శివసేన, బీజేపీ, ఆర్పీఐకి అనుకూల వాతావరణం ఉందన్నారు. ఈసారి తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చెరకు రైతులకు గిట్టుబాటు ధర కావాలని కొద్ది రోజులుగా స్వాభిమాన్ శేత్కారి సంఘటన నాయకుడు, ఎంపీ రాజుశెట్టి చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. ఠాక్రే చేసిన పనులు, మార్గదర్శకాలు భావితరానికి ఎంతో దోహదపడతాయని వ్యాఖ్యానించారు. -
అన్ని ప్రాంతాల్లోనూ ఠాక్రే విగ్రహాలు
సాక్షి, ముంబై: దివంగత నాయకుడు బాల్‌ఠాక్రే విగ్రహాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కనిపించనున్నాయి. వీధుల్లో కాకపోయినా శివసేన కార్యాలయాలన్నింటిలోనూ స్థాపించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికపై పనులు కొనసాగుతున్నట్టు సమాచారం. శివసేన ఎంపీ అనీల్ దేశాయి ముంబైలో శుక్రవారం జరిగిన ‘మార్మిక్’ వారపత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరికొన్ని నెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ విగ్రహాలు ఓటర్లపై కొంతమేరకైనా ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజల మనసులపై చెరగని ముద్రవేసిన బాల్‌ఠాక్రే హిందూ హృదయ సామ్రాట్గానూ గుర్తింపు పొందారు. శివసేన కార్యకర్తలతోపాటు పార్టీలకతీతంగా రాష్ట్రంలోని చాలా మంది నాయకులు కూడా ఆయన్ను అభిమానిస్తారు. కనుసైగలతోనే ఠాక్రే అందరినీ శాసించేవారని అనుచరులు చెబుతారు. ఆయన ప్రసంగాల నుంచి వచ్చే వాగ్భాణాలు ప్రత్యర్థుల గుండెల్లోకి చొచ్చుకుపోయేవని శివసేన సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. అందుకే ఠాక్రే వారసత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలనూ శివసేన తీసుకుంటోంది. విగ్రహాలు అంతటా ప్రతిష్ఠిస్తే కార్యకర్తలకు మరింత గౌరవంతోపాటు పార్టీ బలోపేతమవుతోందని సేన నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు శివసేన శాఖల్లో కేవలం ఛత్రపతిశివాజీ మహారాజు విగ్రహాలు ఉండేవి. ఇక నుంచి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం పక్కనే బాల్‌ఠాక్రే విగ్రహాలు కూడా దర్శనమివ్వనున్నాయి.