సాక్షి, ముంబై: రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన బాలాసాహెబ్ ఠాక్రే ప్రథమ వర్ధంతిని శివసేన అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం నిర్వహిం చిన శివాజీపార్క్ మైదానం ‘బాల్‌ఠాక్రే అమర్ రహే’ నినాదాలతో ఆదివారం హోరెత్తింది. ఉద యం నుంచే నగరంతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వచ్చిన శివసైనికులు, తమ ప్రియతమ నాయకుడు బాల్ ఠాక్రేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించిన శివాజీపార్క్ మైదానంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసి పోయాయి. శివాజీపార్క్ మైదానం ప్రధాన ప్రవేశద్వారం వద్ద ఉన్న మీనాతాయి ఠాక్రే విగ్రహాన్ని భారీగా పూలతో అలంకరిం చారు.
శివసైనికులు ముందుగా మీనాతాయి విగ్రహానికి నివాళులర్పించి ఠాక్రే స్మారకం వద్దకు వెళ్లా రు. మైదానమంతా జనసంద్రంగా మారింది. 1966 లో శివసేనను స్థాపించిన బాల్‌ఠాక్రే దానిని మహా రాష్ట్రలో బలమైన రాజకీయశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమించారు. అనారోగ్యం కారణంగా ఆయన గత నవంబర్ 17న మరణించారు.
భారీగా ప్రముఖుల రాక
శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రశ్మి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు స్మారకం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. సేన సీని యర్ నాయకులు, కార్పొరేటర్లతోపాటు ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, కూతురు సుప్రియా సుళే, గవర్నర్ కె.శంకరనారాయణన్, బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్.కె.అద్వానీ, గోపీనాథ్ ముండే, ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషి, కేం ద్ర, రాష్ట్ర మంత్రులు హాజరై ఠాక్రేకు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వర్ధంతికి హాజరుకాకపోవడం గమనార్హం.
అభిమానుల సందడి..
రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు, ఠాక్రే అభిమానులు శనివారం సాయంత్రం నుంచి ముంబైకి తరలిరావడం మొదలుపెట్టారు. తదనంతరం బాంద్రాలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీ బంగ్లాకు చేరుకున్నారు. చాలా మంది ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకే శివాజీపార్క్ మైదానానికి చేరుకుని క్యూలో నిలబడ్డారు.
నివాళులర్పించే బోర్డులు, ప్లెక్సీలు..
ఠాక్రేకు నివాళులర్పించడానికి అమర్చిన బోర్డులు, ఫ్లెక్సీలు ముంబైలో చాలాచోట్ల దర్శనమిచ్చాయి. ‘శివ్‌తీర్థ్’ వద్ద ఉన్న శివాజీ విగ్రహం పక్కన 20 అడుగుల వెడల్పు, 40 అడుగులు పొడవుతో ఠాక్రే స్మారకం ‘స్మృతి ఉద్యాన్’ను బీఏంసీ ఏర్పాటు చేసింది. దీనిని 15 రకాల పూలు,మొక్కలతో అలంకరించారు.
భారీగా పోలీసు బందోబస్తు
వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ముంబై పోలీసుశాఖ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసింది. రద్దీని నియంత్రించేందుకు శివ్‌తీర్థ్ వద్ద ప్రత్యేకంగా ఒక కంట్రోల్‌రూం, రెండు వాచ్‌టవర్లు ఏర్పాటు చేశారు. 650 మంది కానిస్టేబుళ్లు, 225 మంది మహిళా కానిస్టేబుళ్లు, 50 మంది పోలీసు అధికారులు, నలుగురు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లు, ఇద్దరు డిప్యూటీ పోలీసు కమిషనర్లను నియమించారు. అలాగే స్టేట్ రిజర్వుడు పోలీసులకు చెందిన మూడు బెటాలియన్లు, అల్లర్ల నియంత్రణకు రెండు బెటాలియన్లు, ఐదు కంబాట్ వాహనాలతో భద్రత ఏర్పాటు చేశారు.
సేవా కార్యక్రమాలు....
వర్ధంతిని పురస్కరించుకుని శివసేన అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. పలుచోట్ల రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించింది. శివసేన సినిమా యూనియన్ ఆధ్వర్యంలో దాని సభ్యులకు రూ.రెండు లక్షల పాలసీ ఉచితంగా ఇచ్చారు. వాళ్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా హెల్త్‌కార్డులు అందజేస్తామని సేవ వర్గాలు తెలిపాయి.
మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం : ఉద్ధవ్
శివాజీపార్క్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సాయంత్రమే ఉద్ధవ్ పర్యవేక్షించారు. అనంతరం ఆయన మేయర్ బంగ్లాలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయారని, రాష్ట్ర పాలనలో మార్పు కావాలని కోరుకుంటున్నారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో మహాకూటమిలోని శివసేన, బీజేపీ, ఆర్పీఐకి అనుకూల వాతావరణం ఉందన్నారు. ఈసారి తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చెరకు రైతులకు గిట్టుబాటు ధర కావాలని కొద్ది రోజులుగా స్వాభిమాన్ శేత్కారి సంఘటన నాయకుడు, ఎంపీ రాజుశెట్టి చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. ఠాక్రే చేసిన పనులు, మార్గదర్శకాలు భావితరానికి ఎంతో దోహదపడతాయని వ్యాఖ్యానించారు.
పులికి ఘన నివాళి
Published Sun, Nov 17 2013 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement
Advertisement