సాక్షి, ముంబై: ‘మా శత్రువులను మీరు చేర్చుకోవద్దు.. మీ శత్రువులను మేం చేర్చుకోం..’ అనే నినాదంతో ఇకపై ముంద డుగు వేయాలని బీజేపీ, శివసేన ఒప్పందం చేసుకున్నాయి. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేను ఎవరైతే ఇబ్బందులకు గురిచేశారో వారిని బీజేపీలో చేర్చుకోవద్దని, అదే విధంగా ఎవరైతే బీజేపీని ఇబ్బందుల్లో పెడుతున్నారో వారిని తమ పార్టీలోకి చేర్చుకోబోమని శివసేన చేసిన ప్రతిపాదనకు బీజేపీ నాయకులు సై అన్నారు. శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘సేనా భవన్’ ఈ ఒప్పందానికి వేదికగా నిలిచింది.
వివరాలిలా ఉన్నాయి.....
శివసేన తమ ప్రధాన మిత్రపక్షమైన బీజేపీతో సేవాభవన్‌లోగురువారం సాయంత్రం సమావేశం నిర్వహించింది. ఇరు పార్టీల నాయకులు దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిపారు. సమావేశం అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే బీజేపీలో చేరనున్నట్లు గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఒకవేళ ఆయనకు చేరాలని ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం చేర్చుకోదని కుండబద్దలు కొట్టారు. రాణే అంశానికి తాము ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. శివసేన, బీజేపీలు కేవలం అధికారం కోసం కూటమిగా ఏర్పడలేదు.
ఇరు పార్టీల ఆశయాలు, ఒకే విధమైన ఆలోచనలు కావడంతో కలిసి కొనసాగుతున్నామన్నారు. దీంతో ఇరు పార్టీలను ఇబ్బందులకు గురిచేసిన వారికి కూటమిలో స్థానం లేదన్నారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. వివిధ పార్టీలకు చెందిన అనేక మంది దిగ్గజాలు, వారి అనుచరులు కాషాయ కూటమిలో చేరుతున్నారని, దీంతో మహాకూటమి మరింత బలపడుతోందని ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఎన్సీపీ నాయకుడు ఛగన్ భుజబల్‌కు విదర్భ రీజియన్‌లో అతి సన్నిహితుడైన కిశోర్ కన్హేరే,నాసిక్‌కు చెందిన ప్రముఖ సమాజ సేవకుడు రాజాభావు వాజే తమ అనుచరులతో శివసేనలో చేరారని అన్నారు. అయితే వీరంతా గతంలో శివసేనకుగాని, బీజేపీకిగాని ఇబ్బందులు కల్గించలేదని గుర్తు చేశారు.
శత్రువులను చేరదీయొద్దు
Published Sat, Jul 19 2014 12:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM
Advertisement
Advertisement