ముంబై : శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సర్కార్ మహారాష్ట్రలో గురువారం కొలువుతీరనున్న నేపథ్యంలో ముంబైలో సేన వ్యవస్ధాపకులు బాల్ ఠాక్రే, దివంగత ప్రధాని ఇందిరా గాంధీల పోస్టర్లు వెలిశాయి. బాలాసాహెబ్ స్వప్నం ఫలించింది ముఖ్యమంత్రి పీఠంపై శివసైనికుడని ఈ పోస్టర్లపై రాసిఉంది. గతంలో బాల్ ఠాక్రే, ఇందిరాగాంధీ భేటీ అయిన చిత్రాలతో కూడిన ఈ పోస్టర్‌ను శివసేన భవన్‌కు సమీపంలో ఏర్పాటు చేశారు. రెండు భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల అధినేతలను ఒక్కటి చేస్తున్న ఈ పోస్టర్లను అందరూ ఆశ్చర్యంగా తిలకిస్తుండటం విశేషం. మరోవైపు శివసేన అధిపతి బాల్ ఠాక్రే ఇందిరా గాంధీ విధానాలకు సంఘీభావం తెలిపేవారని, పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ను ఆయన సమర్ధించారని శివసేన నేతలు గుర్తుచేస్తున్నారు.
1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవగా ఆమె నిర్ణయాన్ని బాల్ ఠాక్రే సమర్ధించారు. 1966లో శివసేనను స్ధాపించిన బాల్ ఠాక్రే పార్టీ విధానాలకు అద్దంపట్టేలా సామ్నా పత్రికను నెలకొల్పారు. 2012లో 86 ఏళ్ల వయసులో ఆయన మరణించేంతవరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ సైతం ఇప్పటివరకూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment