టోల్‌నాకా ధ్వంసం | MNS activists ride on toll plaza | Sakshi
Sakshi News home page

టోల్‌నాకా ధ్వంసం

Published Fri, Feb 21 2014 2:40 AM | Last Updated on Mon, Oct 29 2018 8:16 PM

MNS activists ride on toll plaza

 రాజ్‌ఠాక్రే సమక్షంలో రెచ్చిపోయిన ఎమ్మెన్నెస్ కార్యకర్తలు
 
 సాక్షి, ముంబై:
 మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కార్యకర్తలు ఠాణేలోని ఖారేగావ్ టోల్‌నాకా వద్ద గురువారం సాయంత్రం వీరంగం చేశారు. టోల్‌చార్జీలు కట్టనిదే రాజ్‌ఠాక్రే కాన్వాయ్‌ను పోనిచ్చేది లేదని అక్కడి ఉద్యోగి తేల్చి చెప్పడంతో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు రెచ్చిపోయినట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... కల్యాణ్‌కు చెందిన  ఎమ్మెన్నెస్ మహిళా పదాధికారి కల్పనా కపోతేతో టోల్ ఉద్యోగి తనకు రాజ్‌ఠాక్రే ఎవరో తెలియదన్నారు. దీంతో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు తమ వాహనాలు దిగి టోల్‌బూత్‌పై దాడికి దిగి, అక్కడ ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెన్నెస్ కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారు. దీంతో పరిసరాల్లో కొద్దిసేపు  తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సౌకర్యాలు లేకుండా టోల్ చెల్లించేది లేదని పేర్కొన్న కల్పనాతో టోల్ వసూలు సిబ్బంది కొంత అమర్యాదకరంగా ప్రవర్తించారని స్థానికులు తెలిపారు.

ఈ సమాచారం అందుకున్న అనేక మంది ఎమ్మెన్నెస్ కార్యకర్తలు వెంటనే ఆ టోల్ నాకా వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో ముంబై నుంచి నాసిక్ వెళ్తున్న రాజ్ ఠాక్రే టోల్ నాకా వద్దకి వచ్చారు. ఆయనను చూసిన ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అంతే టోల్‌నాకాపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే రాజ్‌ఠాక్రే నాసిక్ వెళ్తున్నట్టు ముందుగానే తెలిసి ఉండడంతో టోల్‌నాకా వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. దాడికి పాల్పడిన వారిపై లాఠీలు ఝుళిపించారు. ఇదంతా కార్లో కూర్చొని ఉన్న రాజ్‌ఠాక్రే సమక్షంలోనే జరగడం విశేషం. అనంతరం ఆయన టోల్ చెల్లించకుండానే నాసిక్‌కు వెళ్లిపోయారు. అయితే ఈ సంఘటన అనంతరం కల్యాణ్ ఎమ్మెల్యే ప్రకాష్ బోయిర్‌తో పాటు సుమారు 15 మంది ఎమ్మెన్నెస్ పదాధికారులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెలారంభం నుంచి పలు చోట్ల ఎమ్మెన్నెస్ కార్యకర్తలు టోల్ బూత్‌లపై దాడులకు దిగి ధ్వంసం చేశారు. ఆ నష్టాన్ని రాజ్ ఠాక్రే ఆస్తులను జప్తుచేయడం ద్వారా పూడుస్తామని ప్రభుత్వం ఇటీవలే హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement