మోసం.. దగా.. అబద్ధాలు: పొన్నాల | ponnala laxmaiah takes on KCR | Sakshi
Sakshi News home page

మోసం.. దగా.. అబద్ధాలు: పొన్నాల

Published Tue, Mar 25 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

మోసం.. దగా.. అబద్ధాలు: పొన్నాల

మోసం.. దగా.. అబద్ధాలు: పొన్నాల

* టీఆర్‌ఎస్ పునాదులివే: టీ-పీసీసీ చీఫ్ పొన్నాల ధ్వజం
* కేసీఆర్‌కు అహకారం ఎక్కువైంది
* అమరవీరుల కుటుంబాలను అవమానిస్తావా?
* తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చేస్తారు

 
సాక్షి, హైదరాబాద్: అబద్ధాల పునాదులు, మోసం, దగా, కుట్ర, నమ్మక ద్రోహం వంటి వాటితో నిర్మించిందే టీఆర్‌ఎస్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. నిత్యం అబద్దాలాడుతూ గుడ్డిగా ఓట్లు దండుకోవాలనుకునే ఆ పార్టీ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడాల్సిందేముందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్మ, రెడ్లు రాజ్యమేలగా లేనిది.. తన సామాజికవర్గం రాజ్యమేలితే ఏముం దంటూ కేసీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు  తగిన శాస్తి చేస్తారన్నారు.
 
అమరుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతుంటే.. టీఆర్‌ఎస్ మాత్రం అమరవీరులను చులకన చేస్తోందని దుయ్యబట్టారు. వారి కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వాలంటే దక్షిణాదిలోని సీట్లన్నీ కావాలని ఆ పార్టీ హేళనగా మాట్లాడుతోందని, 1200 మంది అమరుల కుటుంబాలకు ఏనాడూ సాయం చేయని నైజం కేసీఆర్‌దని మండిపడ్డారు.  
 
 కేసీఆర్‌నుద్దేశించి పొన్నాల ఇంకా ఏమన్నారంటే..
  నాకు, నా కుటుంబ సభ్యులకు పదవులు వద్దు. తెలంగాణ వచ్చాక కాపలా కుక్కలా ఉంటానని ఆనాడు అనలేదా? ఇప్పుడేమో నా కుటుంబ సభ్యులు ఉద్యమంలో లేరా.. ఎవరి కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావట్లేదని ప్రశ్నిస్తావా? నీ కుటుంబం ఒక్కటే తెలంగాణ కుటుంబమా? టీఆర్‌ఎస్‌లో సమర్థులెవరూ లేరా?
 *    తెలంగాణ వస్తే దళితుడిని సీఎం, మైనారిటీని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పావు. ఇప్పుడేమో వారు ఆ పదవులకు సమర్థులుకారనే విధంగా మాట్లాడుతూ అవమానపర్చడం నీ అహంకారానికి నిదర్శనం కాదా?
 *   ఉద్యమంలో నీ కుటుంబం ఒక్కరోజు జైల్లో ఉన్నందుకే టిక్కెట్లు ఇస్తున్నామని చెబుతున్నావు. మరి వేలాది మంది ఉద్యమకారులు వందలాది కేసులు మోసి ఉద్యమాన్ని నడిపించారు. వారికి టిక్కెట్లు అవసరం లేదా? ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన చెరుకు సుధాకర్‌లాంటి నేతలను అవమానిస్తావా?
*  ఉద్యమం పేరుతో దందాలు చేస్తూ.. కోట్లు సంపాదిస్తున్నావని... దళిత, బడుగు వర్గాల యువకులను ఆత్మహత్యలకు ప్రోత్సహించావని కొండా సురేఖ దంపతులు గతంలో నీపై చేసిన వ్యాఖ్యలను అంగీకరిస్తున్నావా?
 *   జలయజ్ఞంలో భాగంగా 48 ప్రాజెక్టులపై బహిరంగ చర్చ పెడితే ఏ ఒక్కనాడూ స్పందించని నీవు.. ఇంతకాలం నిద్రపోయి ఎన్నికలు రాగానే పోలవరం, పులిచింతల, దుమ్ముగూడెం అంటూ సాంకేతిక అంశాలను ముందుపెట్టి రాజకీయాలు చేస్తావా? తెలంగాణ వచ్చినందున నీ దుకాణం బందవుతుందన్న భయంతోనే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నావు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement